వినాయక విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ షాక్.. ఇద్దరు దుర్మరణం

విధాత, జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్లలో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. వినాయక విగ్రహం తరలిస్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు దుర్మరణం చెందగా తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కోరుట్లలోని ఓ షెడ్డులో కొందరు కార్మికులు వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు.
కాగా స్థలాన్ని మార్చాలంటూ ఆ షెడ్డు యజమాని కోరడంతో కార్మికులు వినాయక విగ్రహాలను మరో షెడ్డుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వినాయక విగ్రహానికి హైటెన్షన్ వైర్లు తగిలాయి. దీంతో సంఘటనా స్థలంలోనే ఇద్దరు దుర్మరణం చెందగా మరో తొమ్మిది మందికి గాయాలైనట్టు సమాచారం.
33 కేవీ విద్యుత్ తీగలు తగలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది. షాక్ తగిలిన వారిలో పలువురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.