ఘనంగా యాదాద్రి లక్ష్మీనరసింహుడి గరుడ వాహన సేవ..రథోత్సవం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు మంగళవారం స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకార సేవలో గరుడ వాహనంపై ఊరేగారు

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు మంగళవారం స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకార సేవలో గరుడ వాహనంపై ఊరేగారు. స్వామి ప్రియ వాహనమైన గరుడునిపై విహరించిన స్వామి వారు ప్రసన్నవదనంతో భక్తులకు దర్శనమిచ్చారు.
గర్భాలయంలో మూలవర్యులకు నిత్యారాధనలు అభిషేకాల అనంతరం వేంచేపు మండపంలో స్వామి అలంకార సేవ, మంగళనీరాజనం నిర్వహించారు. అనంతరం అర్చక పండితులు, యజ్ఞికులు, పారాయణికులు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య మేళా తాళాలతో యాదగిరిషుడు శ్రీ మహావిష్ణువు అలంకార సేవలో గరుడవాహనంపై ఊరేగగా, స్వామివారిని దర్శించుకుని భక్తుల పులకించారు.

రాత్రి కల్యాణమూర్తులైన లక్ష్మీ నరసింహుల దివ్య విమాన రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్త జనం మంగళాహారతులు, భజనలు, కోలాటాలు, నృత్యాలు, మేళతాళాల మధ్య గోవింద నామస్మరణలతో వైభవంగా రథోత్సవం సాగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ధార్మిక, సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.