మూవీ పేరు: ‘జిన్నా’విడుదల తేదీ: 21-10-2022నటీనటులు: మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, వెన్నెల కిశోర్, రఘబాబు తదితరులుసినిమాటోగ్రఫీ: చోటా.కె. నాయుడుఎడిటింగ్: చోటా కె. ప్రసాద్సంగీతం: అనూప్ రూబెన్స్రచన: కోన వెంకట్నిర్మాత: ఎమ్. మోహన్ బాబుదర్శకత్వం: ఈషాన్ సూర్య మంచు ఫ్యామిలీ హీరోల సినిమాలు కానీ, వారు పెట్టే ప్రెస్మీట్స్, చేసే ట్వీట్స్ అన్నింటిపై ఈ మధ్య ట్రోలింగ్ ఏ రేంజ్లో వైరల్ అవుతుందో తెలియంది కాదు. ఇంకా చెప్పాలంటే.. ఆ ట్రోలింగే వారిని ఇంకా వార్తలలో […]
మూవీ పేరు: ‘జిన్నా’
విడుదల తేదీ: 21-10-2022
నటీనటులు: మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, వెన్నెల కిశోర్, రఘబాబు తదితరులు
సినిమాటోగ్రఫీ: చోటా.కె. నాయుడు
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
సంగీతం: అనూప్ రూబెన్స్
రచన: కోన వెంకట్
నిర్మాత: ఎమ్. మోహన్ బాబు
దర్శకత్వం: ఈషాన్ సూర్య
మంచు ఫ్యామిలీ హీరోల సినిమాలు కానీ, వారు పెట్టే ప్రెస్మీట్స్, చేసే ట్వీట్స్ అన్నింటిపై ఈ మధ్య ట్రోలింగ్ ఏ రేంజ్లో వైరల్ అవుతుందో తెలియంది కాదు. ఇంకా చెప్పాలంటే.. ఆ ట్రోలింగే వారిని ఇంకా వార్తలలో ఉండేలా చేస్తుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ హీరోల నుండి ఈ మధ్య కాలంలో సరిగా సినిమాలే రావడం లేదు. రీసెంట్గా మోహన్‌బాబు ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా తీస్తే.. దానిని థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులే రాలేదు. దీనిని ఆ ఫ్యామిలీ చాలా అవమానకరంగా భావించింది.
అందుకే ఈసారి బంపర్ హిట్‌తో ప్రేక్షకులను కొట్టాలని భావించి.. ‘జిన్నా’ అనే సినిమాని చేసినట్లుగా గత 15 రోజుల నుండి ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రమోషన్స్ చూస్తుంటే తెలుస్తుంది. మంచు విష్ణు హీరోగా.. హాట్ భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కన చిత్రం ‘జిన్నా’. తనకు అచ్చొచ్చిన కామెడీనే బేస్ చేసుకుని.. మంచు విష్ణు ఈ సినిమాని చేసినట్లుగా చెబుతూ వస్తున్నారు.
అన్నీ ఆయుధాలను ఈ సినిమాకు సమకూర్చుకున్నట్లుగా రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కూడా వెల్లడించారు. మరి ఆ ఆయుధాలు ఈ సినిమాకు ఏ విధంగా ఉపయోగపడ్డాయో.. మంచు ఫ్యామిలీ కాన్ఫిడెంట్ ఎంత వరకూ కరెక్ట్ అయిందో? అసలు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్ర భవిష్యత్ ఏమిటో మన రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఇదొక గాలి కథ. సారీ గాలి నాగేశ్వరరావు కథ. Gaali Nageswarrao. GNa అంటే బాగోదని తనని ‘జిన్నా’(మంచు విష్ణు) అని పిలవమని ఊరందరికీ చెబుతుంటాడు. చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో జిన్నా అంటే తెలియని వారుండరు. ఎందుకంటే అందరి దగ్గర అప్పులు చేస్తాడు కాబట్టి. అలా అప్పు చేసే ఓ టెంట్ హౌస్ పెట్టి డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు. మ్యాటర్ ఏమిటంటే.. ఆ టెంట్ సామానుని ఎవరు తీసుకెళ్లినా అక్కడ అరిష్టమే జరుగుతుంటుంది.
పెళ్లికి జిన్నా టెంట్ హౌస్ వెళితే.. అక్కడ ఆ పెళ్లి పెటాకులవుతుంది. ఇది గమనించిన ఆ ఊరి ప్రెసిడెంట్ తిప్పేస్వామి (రఘుబాబు).. ఆ టెంట్ సామానులను చావుకి మాత్రమే వాడాలని ఓ రూల్ పాస్ చేస్తాడు. అదే సమయంలో తన చిన్ననాటి స్నేహితురాలు రేణుక (సన్నీలియోన్).. ఆ ఊరిలోకి ఎంటరవుతుంది. అమెరికా నుండి వచ్చిన తను.. జిన్నాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. జిన్నాకి మాత్రం అదే ఊరిలో ఉన్న పచ్చళ్ల స్వాతి (పాయల్) అంటే ఇష్టం. కానీ రేణుకని చూడగానే తన నిర్ణయం మార్చుకుంటాడు.
అమెరికా నుంచి వచ్చిన ఆమెను ప్రేమించి.. ఆమె దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కొట్టేసి, అప్పులు తీర్చేసి.. ఊరికి సర్పంచ్ కావాలని అనుకుంటాడు. అయితే అక్కడ పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోతాయి. రేణుకని చూసి ఊరుఊరంతా భయపడిపోతుంది? మారిన పరిస్థితులు ఏమిటి? ఊరంతా ఎందుకు భయపడుతుంది? జిన్నా చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? అసలీ కథలోకి హారర్ ఎలిమెంట్ ఎలా యాడ్ అయింది? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
ఈ సినిమాకి హీరోగా మంచు విష్ణు చేశారు. కానీ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి హీరో సన్నీలియోన్ అంటారు. ఈ సినిమాకి ఆమె పాత్రే కీలకం. మూగ, చెవిటి పాత్రలో ఎలాగోలా మ్యానేజ్ చేసినా.. ఆ తర్వాత రివీలయ్యే పాత్రలో సన్నీలియోన్ దొరికిపోయింది. ఈ పాత్రకి కాస్త పేరున్న నటి అయితే సినిమాలో ఇంకాస్త ఊపు వచ్చేది. అయితే సన్నీలియోన్ కూడా కొన్ని సన్నివేశాలలో చక్కగానే మెప్పించింది.
ఇక మంచు విష్ణు విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం విష్ణు చాలానే కష్టపడ్డాడు. ముఖ్యంగా చిత్తూరు యాసలో విష్ణు పలికిన డైలాగ్స్ బాగున్నాయి. యాక్షన్ పార్ట్‌లోనూ విష్ణు మెరిశాడు. ఆయన పాత్ర వరకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. పాయల్ రాజ్‌పుత్ తన పాత్రకి న్యాయం చేసింది.
అయితే ఆమె పాత్ర ఇంతకు ముందు చాలా సినిమాల్లో చూసినట్లే ఉంటుంది. ఇంకా ప్రెసిడెంట్‌గా రఘుబాబు, రాకేష్ మాస్టర్‌గా చమ్మక్ చంద్ర, మైసూర్ బజ్జీగా వెన్నెల కిశోర్, నరేష్ వంటి వారు కామెడీతో ఆకట్టుకుంటారు. ముఖ్యంగా చమ్మక్ చంద్ర కామెడీ హైలెట్‌గా ఉంటుంది. ఇంకా చాలా మంది ఈ సినిమాలో నటించారు. వారంతా వారి పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ హైలెట్ అని చెప్పుకోవచ్చు. నిర్మాణ విలువలు చాలా నాసిరకంగా ఉన్నాయి. మంచు ఫ్యామిలీ నిర్మాణంలో విషయంలో ప్రతి రూపాయికి ఆలోచించితీసినట్లుగా అర్థమవుతుంది. అంత గొప్పగా దేనికి ఖర్చు పెట్టలేదు. చిన్న చిన్న ఆర్టిస్ట్‌లను మాత్రం సినిమా అంతా నింపేశారు.
ఎడిటింగ్ విషయంలో ఫస్టాఫ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది. సెకండాఫ్ పర్లేదు. డైలాగ్స్ బాగున్నాయి. ఇక దర్శకుడు ఈషాన్ సూర్య ఇంతకు ముందు ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ అనే సినిమా చేసిన అనుభవం ఉంది. మంచు ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలా ప్రయత్నించాడు కానీ.. దానిని రీచ్ కాలేకపోయాడు.
ఒక్క సైకో థ్రిల్లింగ్ ఎలిమెంట్ మినహా.. కామెడీ అంతా రొటీన్ అనేలానే ఉంది. కోన వెంకట్, జి. నాగేశ్వరరెడ్డి వంటి వారు వండి వార్చినా కూడా ఈ కథలో పెద్దగా కొత్తదనం కనిపించదు. కానీ ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఓ ట్విస్ట్, క్లైమాక్స్‌కి ముందు వచ్చే ఓ ట్విస్ట్ ఈ సినిమాకు ప్రాణం. అవి రివీల్ చేస్తే.. ఇక సినిమా చూసే పని ఉండదు కాబట్టి.. ఇక్కడ రివీల్ చేయడం లేదు.
విశ్లేషణ:
ఈ సినిమాకి మొదలైనప్పటి నుండి ఉన్న హైప్ ఏదైనా ఉందీ అంటే.. ఖచ్చితంగా ఈ సినిమా హీరోయిన్లే. సన్నీ, పాయల్ వంటి హీరోయిన్లతో ఈ సినిమా వార్తలలో నిలిచింది. వారు పేరు వినబడితే.. ఏదైతే ఊహించుకుంటారో అది మాత్రం ఈ సినిమాలో మిస్సయింది. వారిని భారీగా ఊహించుకుని వెళితే డిజప్పాయింట్ అవుతారు. ఉన్నంతలో సన్నీలియోన్ పర్లేదు.
అలాగే ఇదొక హర్రర్ థ్రిల్లర్ అనే విషయం ట్రైలర్‌తో రివీలయింది కాబట్టి.. కోనవెంకట్ వంటివారు ఈ సినిమా కథ విషయంలో ఉన్నారు కాబట్టి.. ఏదో కొత్తదనం ఉంటుందని ఆశించినా భంగపడతారు. అది కూడా రొటీనే అనిపిస్తుంది. ఈ సినిమాకి ఆయువు పట్టు మాత్రం ఇంటర్వెల్ ట్విస్ట్. అలాగే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు మినహా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీలేదు. ఇవే.. టికెట్ కొనుక్కుని వెళ్లిన ప్రేక్షకుడికి న్యాయం చేస్తాయి. అది మినహా మిగతా అంతా రొటిన్ గానే సాగింది.
ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా ఊహించినట్లుగానే వెళుతుంది. మంచు విష్ణు అల్లరి చేష్టలు, అప్పులు, టెంట్ హౌస్.. ఇలా కాస్త కామెడీ టచ్‌తో వెళితే.. సెకండాఫ్‌లో మాత్రం కాస్త విషయంతోనే నింపారు. అయితే సీక్వెల్ కూడా ముందే అనుకున్నట్లు ఉన్నారు. ముగింపు విషయంలో సరైన క్లారిటీ ఇవ్వకుండానే శుభం కార్డు వేశారు.
దర్శకుడిగా సూర్యకి ఈ సినిమా ద్వారా వచ్చేది ఏమీ లేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే మంచు విష్ణుకి హిట్టొచ్చిందని చెప్పలేం కానీ.. బాక్సాఫీస్ వద్ద అబౌవ్ యావరేజ్ ఫిల్మ్‌గా నిలిచే అవకాశాలైతే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద పోటీ కూడా గట్టిగా ఉంది. సన్నీ కోసం ఓసారి చూద్దామని అనుకుంటే మాత్రం మంచు విష్ణు గట్టెక్కినట్లే.
ట్యాగ్‌లైన్: ‘జిన్నా’ కాదు.. ‘సన్నీ’ అంటే బాగుండేది
రేటింగ్: 2.5/5