Government Whip Sunita | మేము అర్ధనారీశ్వరులం.. ఇద్ధరం ఒకటే… టికెట్ ఎవరికిచ్చినా ఓకే..
Government Whip Sunita విధాత: మేమిద్దరం అర్ధనారీశ్వరులం.. అంటే శివపార్వతులం.. సునీత మహేందర్ రెడ్డి వేర్వేరు కాదు.. ఇద్దరూ ఒకటే వచ్చే ఎన్నికల్లో మా ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకటే అంటూ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో బిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ […]

Government Whip Sunita
విధాత: మేమిద్దరం అర్ధనారీశ్వరులం.. అంటే శివపార్వతులం.. సునీత మహేందర్ రెడ్డి వేర్వేరు కాదు.. ఇద్దరూ ఒకటే వచ్చే ఎన్నికల్లో మా ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకటే అంటూ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో బిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు.
ఇటీవల సోషల్ మీడియాలో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ టికెట్ విషయమై మా భార్య భర్తల మధ్య పంచాయతీ పెడుతూ, మా మధ్య విభేదాలున్నాయంటూ కేడర్ ను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. వాటిని అంతా ఖండించాలన్నారు.
మీరే(కార్యకర్తలు) చెప్తుంటారు కదా మేము ఒక ఓటేస్తే మాకు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుస్తున్నారని ఎవరా ఇద్దరు… సునీత, మహేందర్ రెడ్డి లే కదా.. మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయితే సునీత ఎమ్మెల్యే అయినట్లే… సునీత ఎమ్మెల్యే అయితే మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయినట్లే కదా… దీంట్లో కూడా భార్యాభర్తలకు పంచాయితీనా.. ఇంత ఓర్వలేని స్థితిలో ఉన్నారు అవతల ప్రతిపక్షాలు గాని, ఇంకొకరు గానీ అంటూ వ్యాఖ్యానించారు.
నియోజకవర్గ ప్రజలకు మేమిద్దరం నిరంతరం సేవ చేస్తూనే ఉంటామని, 24 గంటలు అందుబాటులో ఉంటున్నామని, ప్రజల కోసం పనిచేస్తున్నామని కాబట్టి ఓటు అడిగే హక్కు మాకు ఉందన్నారు. అది మహేందర్ రెడ్డి అయితేంది.. సునీత అయితేంది.. ఇద్దరం ఒకటే.. శివుడు పార్వతి వేరువేరా..? అర్ధనారీశ్వరులు కదా మేము అంతే.. మహేంద్రుడు, సునీత ఒకటే. ఇందులో కన్ఫ్యూజన్ అవసరం లేదన్నారు.
ఖచ్చితంగా మళ్ళీ ఆలేరులో గులాబీ జెండా ఎగురవేసేందుకు మన సైన్యం సిద్ధంగా ఉండాలని కోరుతున్నానన్నారు. ఎన్నికలు మరో ఐదారు నెలలు మాత్రమే ఉన్నాయని, మన గులాబీ సైన్యం గెలుపు కోసం ఇప్పటి నుండే పని చేయాలన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి తోపాటు నియోజకవర్గంలోని ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.