సూర్యాపేట, ఆలేరులలో వీగిపోయిన అవిశ్వాసం.. కోదాడలో నెగ్గింది
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సూర్యాపేట, ఆలేరు మున్సిపాల్టీల్లో అవిశ్వాసాలు వీగిపోవడంతో ఆ మున్సిపాల్టీలను బీఆరెస్ నిలబెట్టుకోగలిగింది

విధాత : ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సూర్యాపేట, ఆలేరు మున్సిపాల్టీల్లో అవిశ్వాసాలు వీగిపోవడంతో ఆ మున్సిపాల్టీలను బీఆరెస్ నిలబెట్టుకోగలిగింది. కోదాడలో అవిశ్వాసం నెగ్గడంతో మున్సిపాల్టీ హస్తగతమైంది. సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ పై నిఖిల దిలీప్ రెడ్డి వర్గీయులు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది..అవిశ్వాసా తీర్మానం నోటీస్ పై సంతకం పెట్టిన 32 మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. కాగా కొండపల్లి నిఖిల దిలిప్ రెడ్డి శిబిరంలో ఉన్న 32 మందిలో 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కనిపించక పోవడంతో కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి వర్గంలో ఉన్న 31 మంది అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు. దీంతో అవిశ్వాసం వీగిపోయింది. మున్సిపాల్టీలో మొత్తం 48మంది కౌన్సిలర్లు ఉన్నారు.
దళిత మహిళా చైర్ పర్సన్‌పై కాంగ్రెస్, బీజేపీలు కలిసి పెట్టిన అవిశ్వాసాన్ని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జి. జగదీశ్ రెడ్డి విజయవంతంగా తిప్పికొట్టగలిగారు. మరోవైపు కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీషపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. సమావేశానికి హాజరైన 33మంది కౌన్సిలర్లలో 29మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. మొత్తం 35మంది సభ్యుల్లో ఒకరు మృతి చెందారు. ఆలేరు మున్సిపల్ చైర్మన్‌పై ఎనిమిది మంది కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం భువనగిరి ఆర్డివో అమరేందర్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సభ్యులను సమావేశపర్చగా మొత్తం 12 మంది సభ్యులకుగాను కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. చట్ట ప్రకారం ఎనిమిది మంది సభ్యుల కోరం ఉండాలి. దాంతో ఆర్డీవో సమావేశాన్ని మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం రెండున్నర వరకు కూడా ఒక్క సభ్యుడు కూడా హాజరుకాలేదు. దాంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. మరోసారి అవిశ్వాసం పెట్టడానికి వీల్లేదని తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చక్రపాణి, లావణ్య, స్వామి, యాదగిరి, రవి, ప్రసాద్, కళ్యాణ్, జైనుధన్, తదితరులు పాల్గొన్నారు.