ఆ మూడు సీట్లపై ముచ్చట్లు!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని మూడు లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌పై ప్ర‌ధాన

ఆ మూడు సీట్లపై ముచ్చట్లు!
  • ఎంపిక తీరుపై పార్టీల శ్రేణుల్లో చర్చలు
  • వలస నేతలు, స్థానికేతరులే ఎక్కువ
  • మల్కాజిగిరి బరిలో బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి స్థానికేతరులకు అవకాశం
  • తీవ్ర మథనం తర్వాత రాగిడికి కారు సీటు
  • కారు దిగగానే సికింద్రాబాద్‌ టికెట్‌ ‘దానం’
  • పద్మారావు ఎంపికపై భిన్నాభిప్రాయాలు
  • సికింద్రా‘బాద్‌షా’గా ఈసారి ఎవరికి పట్టం?
  • చేవెళ్లలోనూ వలస నేతలకే దక్కిన చాన్స్‌
  • పార్టీ మారేవారిపై జనం ఎలా స్పందిస్తారో!

విధాత‌, హైద‌రాబాద్‌ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని మూడు లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌పై ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీ వర్గాల్లోనే విస్తృత‌ చ‌ర్చ మొద‌లైంది. ఇవేమి ఎంపిక‌లంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అవే మ‌ల్కాజిగిరి, సికింద్రాబాద్‌, చేవెళ్ల లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గాలు. ఇక్కడ మూడు పార్టీల నుంచి నిలబెట్టిన అభ్యర్థుల విషయంలో వారి పార్టీ శ్రేణుల్లోనే అభ్యంతరాలు, అపనమ్మకాలు వ్యక్తమవుతున్నాయి.  

మ‌ల్కాజిగిరి ఎవ‌రిని వ‌రించెనో..

రాష్ట్రంలోనే అత్య‌ధిక ఓట‌ర్లు క‌లిగిన పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం మల్కాజిగిరి. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఒక ర‌కంగా మినీ ఇండియాగా చెప్పుకోవ‌చ్చు. తెలంగాణ‌తోపాటు ఆంధ్ర‌, ఉత్త‌ర భార‌తీయులు, రైల్వే, ర‌క్ష‌ణ విభాగం ఉద్యోగులు అధికంగా ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. అంతకు ముందు మాజీ మంత్రి సీ మ‌ల్లారెడ్డి గెలుపొందిన విష‌యం తెలిసిందే. ముఖ్య‌మంత్రి ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత రేవంత్ రెడ్డి త‌న‌ ఎంపీ ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించారు. ఈ స్థానం కైవ‌సం చేసుకునేందుకు కాంగ్రెస్‌తోపాటు.. బీఆరెస్‌, బీజేపీ ఆరాట‌ప‌డుతున్నాయి. హుజూరాబాద్‌, గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన త‌రువాత ఈట‌ల రాజేంద‌ర్ మ‌ల్కాజిగిరి ఎంపీగానైనా గెలవాలనే ఆశ పెట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు స్థానికేతరులు కావడం గమనార్హం. అయితే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉన్నప్పుడు మేడ్చల్‌ మల్కాజిగిరి ప్రాంతంలో మహేందర్‌రెడ్డికి కొన్ని సంబంధాలు ఉండేవి. ఈటలకు ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి. అంతకు మించి ఇద్దరికీ స్థానికేతర ప్రాంతమే. బీఆరెస్ అభ్య‌ర్థిగా ఉప్ప‌ల్ ప్రాంతానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని పార్టీ అధినేత‌ కే చంద్ర‌శేఖ‌ర్ రావు ఎంపిక చేశారు. కాంగ్రెస్ నుంచి వికారాబాద్ జడ్పీ చైర్ ప‌ర్స‌న్ సునీతారెడ్డి పోటీప‌డుతున్నారు. ఈమె మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి స‌తీమ‌ణి. సునీతారెడ్డి చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు కావ‌డం మైన‌స్ పాయింట్‌గా చెబుతున్నారు. చేవెళ్ల నుంచి ఆమెకు టికెట్ ఇవ్వ‌కుండా మ‌ల్కాజిగిరికి ఎందుకు పంపించార‌నే సందేహాలు కాంగ్రెస్‌ పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. ఆమె ఎంపిక స‌రైన నిర్ణ‌యం కాద‌ని పలువురు కార్య‌క‌ర్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక బీఆరెస్ విష‌యానికి వ‌స్తే ఈ సీటు నుంచి పోటీ చేయాల‌ని మాజీ మంత్రి మ‌ల్లారెడ్డిని గులాబీ దళపతి ఆదేశించారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న అల్లుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మ‌ల్లారెడ్డి కుమారుడు భ‌ద్రారెడ్డికి టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన‌ప్పటికీ ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం, ఆయ‌న క‌బ్జాలు, కాలేజీల్లో అక్ర‌మాల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌న్నెర్ర చేయ‌డంతో మల్లారెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న కుమారుడిని ఎంపీ అభ్య‌ర్థిగా నిల‌బెడితే మ‌రిన్ని చిక్కులు త‌ప్ప‌వ‌ని, కబ్జాల్లో భూములు లాక్కోవ‌డం ఖాయ‌మ‌ని, అక్రమంగా కట్టిన కాలేజీ భవనాలు మూయ‌డం త‌ప్ప‌ద‌ని గ‌మ‌నించి.. నీకో దండం, నీ సీటుకో దండం అంటూ మ‌ల్లారెడ్డి, కెసిఆర్ కు తెగేసి చెప్పారనే చర్చ జరుగుతున్నది. దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేరును కేసీఆర్‌ పరిశీలిస్తున్నారనే వార్తలు వచ్చాయి. రాజు కూడా అందుకు సిద్ధపడలేదు. దీంతో ఎంపీ అభ్య‌ర్థిగా రాగిడి ల‌క్ష్మారెడ్డి పేరును కేసీఆర్‌ ప్ర‌క‌టించారు. అయితే ఈయ‌న‌ను ఎంపీ స్థాయిలో ఓట‌ర్లు కాని బీరెస్‌ కార్య‌క‌ర్త‌లు కాని ఊహించుకోవ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుభ‌వం కూడా లేదు. ఇక్క‌డ ఎక్కువ సంఖ్య‌లో ఓట‌ర్లు ఉండ‌డం, మల్లారెడ్డి కుటుంబం నుంచి సంపూర్ణ మ‌ద్ధ‌తు లేక‌పోవ‌డంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో లక్ష్మారెడ్డి ఉన్నారు. ఇక బిజెపి అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ ఎంపిగా గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో కాలుకు బ‌ల‌పం క‌ట్టుకుని తిరుగుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గం యావ‌త్తు క‌లియ‌తిరుగుతూ ఓట‌ర్ల‌ను క‌లుసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోవ‌డంతో క‌సితో గెలవాల‌నే ప‌ట్టుద‌లతో ఉన్నారు. బిఆరెస్‌, కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను ప‌రిశీల‌న చేస్తే ఈట‌ల గెలుపు బాట‌లో ముందంజ‌లో ఉన్నారు.

సికింద్రా‘బాద్‌షా’ ఎవ‌రో!

సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోసారి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి త‌న అదృష్టాన్ని చూసుకోవాల‌ని జీ కిష‌న్ రెడ్డి చూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్‌రెడ్డి.. తంతే బూరెల బుట్టలో పడినట్టు.. సికింద్రాబాద్‌ ఎంపీగా గెలవడమే కాకుండా.. ఏకంగా మోదీ క్యాబినెట్‌లో మంత్రి కూడా అయ్యారు. మరోసారి కూడా అదృష్టం తనను వరిస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ బ‌రిలో ఉన్నారు. ఇటీవ‌లే ఆయ‌న బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన ఇలా చేరిన వెంటనే అలా ఎంపీ టికెట్‌ వచ్చేసింది. అయితే.. పార్టీలో చేరిన వెంట‌నే ఎలా టికెట్ కేటాయిస్తారంటూ ప‌లువురు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ప్రశ్నిస్తున్నారు. దీటైన అభ్య‌ర్థులు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ నాగేంద‌ర్‌కు ఎలా ఇస్తారంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. మరోవైపు బీఆరెస్ అభ్య‌ర్థిగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే టీ ప‌ద్మారావును కేసీఆర్‌ ప్ర‌క‌టించారు. ఎంపీగా ఆయనకు ఏ మేరకు ఓట్లు లభిస్తాయనేది చూడాలి. పార్టీలో బ‌ల‌మైన నాయ‌కులు ఉండ‌గా వారిని కాద‌ని ప‌ద్మారావును నిల‌బెట్టార‌నే వాద‌న వినిపిస్తున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఆరెస్‌ చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ మాజీ మంత్రులు కేటీఆర్‌ లేదా హరీశ్‌ ఇక్కడ నిలబడి ఉంటే బాగుండేదన్న చర్చ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తునే సాగుతున్నది. వారిద్దరిలో ఎవరో ఒకరు నిలబడితే ఈ సీటును సునాయాసంగా గెలుచుకుంటామని అంటున్నారు. అయితే.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో కేటీఆర్‌ ఓటమి చెందితే? ఇదే ప్రశ్న అధినాయకత్వాన్ని కలవరపెట్టి ఉంటుందని, అందుకే పద్మారావును తీసుకొచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. 

చేవెళ్ల విజ‌య‌మెవ‌రిది

చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిపై బీఆరెస్ అభ్య‌ర్థిగా రంజిత్ రెడ్డి గెలుపొందారు. ఓట‌మి త‌రువాత విశ్వేశ్వ‌ర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రెండోసారి విజ‌యం సాధించి త‌న అదృష్టాన్ని ప‌రిశీలించుకోవాల‌ని రంజిత్ రెడ్డి ఉన్నారు. త‌న‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యాల‌తో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం ప్రారంభించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డి గెలుపుకోసం వ్యూహ‌ర‌చ‌న చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. కేంద్రంలో న‌రేంద్ర మోదీ స్వ‌చ్ఛ‌మైన పాల‌న‌ను చూసి త‌న‌ను గెలిపించాల‌ని విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఓట‌ర్ల‌ను కోరుతున్నారు. ఇక బీఆరెస్ అభ్య‌ర్థి విష‌యానికి వ‌స్తే ఒక పార్టీలో కుదురుగా ఉండ‌ద‌నే వాద‌న ఓట‌ర్ల‌లో ఉంది. అధికారం కోసం పార్టీలు మార‌తార‌నే అభిప్రాయం ఉంది. అయితే స్థానికుడ‌నైన త‌న‌ను గెలిపించాల‌ని కాసాని కోరుతున్నారు. గ‌తంలో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ చైర్మన్‌గా జిల్లాలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేశాన‌ని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీగా జిల్లాకు సేవ చేశాన‌ని, ఇవ‌న్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని నియోజ‌క‌వ‌ర్గం ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థిస్తున్నారు. మొత్తంగా ఈ నియోజకవర్గాల్లో ఎవరు విజయం సాధిస్తారో అనే ఆసక్తికర చర్చలు ఉన్నాయి. పార్టీలు మారినవారు, స్థానికేతరులు కూడా ఉండటంతో వారి భవితవ్యం ఎలా ఉండబోతున్నదనేది రానున్న రోజుల్లో తేలిపోతుందని అంటున్నారు.