కేసీఆర్ కే మళ్లీ పట్టం: శాసనమండలి చైర్మన్ గుత్తా

కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వానికే తెలంగాణ ప్రజలు మళ్లీ పట్టం కడతారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

  • By: Somu    latest    Nov 23, 2023 12:19 PM IST
కేసీఆర్ కే మళ్లీ పట్టం: శాసనమండలి చైర్మన్ గుత్తా

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వానికే తెలంగాణ ప్రజలు మళ్లీ పట్టం కడతారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండలోని తన క్యాంపు కార్యక్రమంలో గుత్తా మీడియా చిట్ చాట్ కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నరని, ఆ పార్టీ గెలిచేది లేదన్నారు.


పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీపైన కొంత అసంతృప్తి అనేది సహజంగా ఉండొచ్చని, కానీ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఆలోచన చెయ్యకుండా ఆగం అయ్యి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తారని విమర్శించారు. మళ్ళీ బీఆర్ యస్ పార్టీకే ప్రజలు పట్టం కడుతారని చెప్పారు.


కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేస్తోందని, ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్స్ కర్ణాటక రాష్ట్రంలోనే అమలు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారని తెలిపారు. ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్గొండ ప్రజలు నాలుగు సార్లు అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి చేసారని ఆయన ప్రశ్నించారు.


కేంద్రమంత్రి, బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం కేసీఆర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, అసలు ఆయన కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి, ఆయన నియోజకవర్గానికి కేంద్రం నుండి ఏం నిధులు తీసుకువచ్చారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని, ఆయన పాలనలోనే రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు.


బీఆర్ఎస్ పార్టీని ఆదరించకపోతే రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బంధు, 24 గంటల ఉచిత కరెంట్ వంటి సంక్షేమ పథకాలు ఆగిపోయి, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించడం పక్కా అని గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.