హామీల అమలుపై స్పష్టతేది? విశ్వాసం కల్పించని గవర్నర్‌ ప్రసంగం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగంలో ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, హామీల అమలుపై

హామీల అమలుపై స్పష్టతేది? విశ్వాసం కల్పించని గవర్నర్‌ ప్రసంగం

ప్రభుత్వ విజన్‌నూ ఆవిష్కరించలేదు

ఆరు గ్యారెంటీల్లో 13 హామీలున్నాయి

2 గ్యారెంటీలూ పూర్తిగా అమలు కాలేదు

త్వరలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌

ఇంకెప్పుడు ఆరు గ్యారెంటీల అమలు?

మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నలు

విధాత : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రసంగంలో ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు, హామీల అమలుపై స్పష్టతనివ్వలేదని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ప్రసంగం విశ్వాసం కల్పించలేకపోయిందని అన్నారు. చివరకు ప్రభుత్వ విజన్‌ను కూడా ఆవిష్కరించలేకపోయిందని విమర్శించారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశామని ప్రభుత్వం చెబుతోందని, నిజానికి వాటిని కూడా పాక్షికంగా అమలు చేశారని హరీశ్‌ అన్నారు. గవర్నర్ ప్రసంగంలో ఆరోగ్యశ్రీ ప్రస్తావన లేదంటే దాని అమలు సరిగ్గా లేదని చెప్పకనే చెప్పారన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 ఎప్పటి నుంచి ఇస్తారో గవర్నర్‌ ప్రసంగంలో చెప్పలేదని విమర్శించారు. రైతులకు బోనస్‌ ఇచ్చే విషయమై, గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపై ఒక్క మాట కూడా చెప్పలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

నిరుద్యోగులకు రూ.4 వేలు ఇచ్చే విషయాన్నీ ప్రస్తావించలేదన్నారు. గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల విద్యుత్‌ గురించి మాత్రమే చెప్పారని, మేనిఫెస్టో అంశాల గురించి ఎక్కడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీ, గవర్నర్‌ ప్రతిష్ఠ దిగజార్చిందని హరీశ్‌ ఆరోపించారు. ఆరు గ్యారెంటీల్లో 13 హామీలున్నాయని గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకంలో మూడు హామీలు ఉంటే ఒక గ్యారెంటీని అమలు చేశామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ అమలు లోపభూయిష్టంగా ఉన్నందునే గవర్నర్‌ ప్రసంగంలో చెప్పించలేదని వ్యాఖ్యానించారు. రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని హరీశ్‌ మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన నాలుగు హామీలు అమలు చేయడం లేదని చెప్పారు. ‘డిసెంబర్‌ 9న అధికారంలోకి వస్తాం.. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. ప్రమాణ స్వీకారాన్ని ముందుకు జరిపి.. హామీల అమలును వాయిదా వేశారు’ అని ఆక్షేపించారు. ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. వంద రోజుల్లో 60 రోజులు పూర్తయ్యాయని, ఇంకా 40 రోజులే ఉన్నాయని గుర్తుచేశారు.

‘మరో పది రోజుల్లో ఎన్నికల కోడ్‌ వస్తుంది.. అప్పటివరకు సాగదీసి హామీల అమలు వాయిదా వేయాలని ప్రభుత్వం చూస్తున్నది’ అని ఆరోపించారు. ఎన్నికల కోడ్ వస్తే హామీలు ఎలా అమలు చేస్తారని నిలదీశారు. చిత్తశుద్ధి ఉంటే హామీల అమలు గురించి గవర్నర్ ప్రసంగంలో ఉండేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం వాయిదా వేశారని విమర్శించారు. మిగిలిన హామీల గురించి గవర్నర్ ప్రస్తావించలేదని చెప్పారు. ప్రభుత్వ ఆలోచనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. గవర్నర్ తన ప్రసంగంలో తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగా పాలన చేస్తుందని, సామాన్యుల ప్రభుత్వమని, ప్రజాభవన్ కంచెలు తొలగించామని ప్రజాభవన్ తెరిచామని చెప్పుకున్నారని, నిజానికి సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క రోజు మాత్రమే ప్రజలను కలిశారని గుర్తు చేశారు. ‘ప్రజావాణి’ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయిందని విమర్శించారు. ప్రస్తుతం పొరుగు సేవల సిబ్బంది మాత్రమే దరఖాస్తులు తీసుకుంటున్నారని హరీశ్‌రావు అన్నారు.