యాదాద్రిలో ఆక‌ట్టుకుంటున్న హ‌రిత శోభ‌

విధాత‌: యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రీనరీ భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. యాదాద్రి ఆలయ అభివృద్ధిలో శిల్ప కళాకృతితో పాటు హరిత శోభ కూడా అభివృద్ధి చేశారు. కొండచుట్టు 70 ఎకరాల విస్తీర్ణంలో ఆలయానికి వెళ్లే దారులలో పార్కులు, వాకింగ్ ట్రాక్ లు, రకరకాల పూల మొక్కలతో, చిన్నచిన్న తోటలతో పచ్చదనాన్ని ఏర్పాటు చేశారు. కొండ కింద నుంచి ఆలయానికి చేరే మెట్ల దారిలో ఔషధ మొక్కలతో కూడిన నక్షత్ర వనాన్ని ఏర్పాటు చేశారు. […]

యాదాద్రిలో ఆక‌ట్టుకుంటున్న హ‌రిత శోభ‌

విధాత‌: యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రీనరీ భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. యాదాద్రి ఆలయ అభివృద్ధిలో శిల్ప కళాకృతితో పాటు హరిత శోభ కూడా అభివృద్ధి చేశారు. కొండచుట్టు 70 ఎకరాల విస్తీర్ణంలో ఆలయానికి వెళ్లే దారులలో పార్కులు, వాకింగ్ ట్రాక్ లు, రకరకాల పూల మొక్కలతో, చిన్నచిన్న తోటలతో పచ్చదనాన్ని ఏర్పాటు చేశారు.

కొండ కింద నుంచి ఆలయానికి చేరే మెట్ల దారిలో ఔషధ మొక్కలతో కూడిన నక్షత్ర వనాన్ని ఏర్పాటు చేశారు. కొండ చుట్టూ 5.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన రక్షణ గోడ నాలుగు వలయాల్లో వివిధ రకాల మొక్కలు నాటి గడ్డి ల్యాన్ లను ఏర్పాటు చేశారు.

గిరి ప్రదక్షిణ దారులలో రకరకాల పూలు, ఔషధ మొక్కలు రుద్రాక్ష, పారిజాత, జమ్మి, మారేడు, వేప, మల్లె, రావి, జువ్వి, అల్లనేరేడు, తెల్ల జిల్లేడు, కదంబం, దేవ గన్నేరు, టోరేనియా, టర్మినేనియా, గల్పిమియా, గుల్ మోహర్ వంటి మొక్కలను నాటారు.

వరంగల్ జాతీయ రహదారి నుంచి ఆలయానికి చేరుకునే 11 కిలో మీటర్లకు పైగా ఉన్న రహదారికి రెండువైపులా మొక్కలు నాటారు. నాలుగు కోట్లతో 240 ఎకరాల్లో నరసింహ అభయారణ్యము, 3 కోట్లతో 140 ఎకరాల్లో ఆంజనేయ అభయారణ్యాలని రకరకాల మొక్కలతో తీర్చిదిద్దారు.

లక్ష్మీ నరసింహుల నిత్య ఆరాధనకు అవసరమైన పువ్వులు, తులసి దళాలు సేకరణకు గోశాల దగ్గర మూడు ఎకరాలలో తులసి వనం ఏర్పాటు చేశారు. భక్తుల బస కోసం తులసీ కాటేజీ వద్ద మొక్కలు నాటారు. మరోవైపు ఆలయ నగరి ఏర్పాటుకు పెద్దగుట్టపై 250 ఎకరాలలో 46 రహదారులతో, రింగ్ రోడ్డుతో పచ్చదనంతో, పార్కులతో, ఫంక్షన్ హాల్స్ లతో, షాపింగ్ కాంప్లెక్స్ తో వందల కోట్లతో భారీ నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

ఆలయ నగరిలో 22 కాటేజీలు దాతల సహకారంతో నిర్మాణంలో ఉన్నాయి. ముఖ్య అతిథుల బసకు యాదగిరిగుట్టకు ఉత్తరాన ఉన్న 13.26 ఎకరాల రాళ్లగుట్టపై 110 కోట్లతో ప్రెసిడెన్షియల్ సూట్ తో పాటు వీఐపీ విల్లాలను నిర్మించారు. ఇటీవల యాదాద్రి బస్ టెర్మినల్ ను ప్రారంభించారు.

గుట్టలో 100 పడకల ఆసుపత్రి కూడా అందుబాటులోకి వచ్చింది. కొండ దిగువనే భక్తుల బసకు కొత్తగా నిర్మించిన లక్ష్మి నివాస్ గదులు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. హరిహరుల నిలయమైన యాదగిరిగుట్టలో కొండపైన లక్ష్మీ నరసింహ ప్రధాన ఆలయం పునర్ నిర్మాణంతో పాటు శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వరుడి ఆలయాన్ని కూడా కృష్ణశిలలతో అద్భుత శిల్పకళాకృతులతో 60 కోట్లతో పునర్నిర్మించారు.

శైవాగమ శాస్త్ర యుక్తంగా నిర్మించిన శివాలయంలో గర్భగుడికి ఎదురుగా పెద్ద నంది విగ్రహాన్ని, ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. త్రితల రాజగోపురం, ముఖ మండపం, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, పార్వతీదేవి ఉప ఆలయాలను నిర్మించారు. నవగ్రహాలను, యాగశాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాకారాలపై ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలను, శివుని విభిన్న రూపాలను తీర్చిదిద్దారు. ప్రస్తుతం శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.