హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖరారు
తమిళనాడు రాజకీయాల్లో మరో సినీ హీరో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళ సినీ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైంది.

- హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖరారు
- తమిళగా వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీ ప్రకటన
విధాత : తమిళనాడు రాజకీయాల్లో మరో సినీ హీరో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళ సినీ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైంది. తమిళగా వెట్రి కళగం పేరిట విజయ్ కొత్త పార్టీ ప్రకటించారు. సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యమని ఈ సందర్భంగా విజయ్ ప్రకటించారు. రాజకీయ మార్పు కోసం తమిళనాడు తహతహలాడుతుందని, అవినీతి రాజకీయ సంస్కృతి ఒకవైపు.. విభజన రాజకీయ సంస్కృతి మరోవైపు మన ఐక్యతకు ప్రగతికి అవరోధాలుగా మారాయని ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను, పార్టీ పోటీ చేయబోదని, అలాగే ఏ పార్టీకి కూడా మద్దతునివ్వబోమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళిగా వెట్రి కళగం పోటీ చేస్తుందని విజయ్ ప్రకటించారు. విజయ్ కొత్త పార్టీ ప్రకటన తమిళనాడులోని రాజకీయాల్లో, ద్రవిడ ప్రభావిత రాజకీయాల్లో మరో మలుపుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమిళ నాడు రాజకీయాల్లో సినీ హీరోలు, నటులు, రచయితల ప్రభావం మొదటి నుంచి కొనసాగుతుంది. మాజీ సీఎంలు ఎంజీఆర్ మొదలుకుని జయలలిత…డిఎండీకే అధినేత విజయకాంత్, ఎంఎన్‌ఎం అధినేత కమలాహాసన్, ఖుష్బు సుందర్, సీఎం స్టాలిన్ కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వంటి నటులతో పాటు మాజీ సీఎం కరుణానిధి కూడా సినీ రచయితగా పనిచేసిన వారే కావడం గమనార్హం.