హిస్టరీ రిపీట్స్! నాడు టీడీపీ.. నేడు వైసీపీ
పసుపు నీళ్లతో రోడ్లు శుద్ధి.. విధాత: ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కఠినంగానే ఉంటాయి. కక్షలు కార్పణ్యాలు కడుపులోనే దాచుకుని ఉండే కార్యకర్తలు తమకు టైం వచ్చినపుడు వాటిని బయటకు తీసి ప్రత్యర్థుల మీదకు విసురుతారు. గతంలో తాము అవతలి వారిపట్ల ఎలా వ్యవహరించామో అదే పరిస్థితి తమకూ ఇంకోరోజు ఎదురవుతుందనేందుకు ఈ సంఘటనే నిదర్శనం. ఈ విషయాన్ని పార్టీల నాయకులకు కూడా మరొక్కసారి స్పష్టంగా అర్థం అవుతుందని చెప్పవచ్చు. అసలు విషయం క్లియర్‌గా అర్థం […]

పసుపు నీళ్లతో రోడ్లు శుద్ధి..
విధాత: ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కఠినంగానే ఉంటాయి. కక్షలు కార్పణ్యాలు కడుపులోనే దాచుకుని ఉండే కార్యకర్తలు తమకు టైం వచ్చినపుడు వాటిని బయటకు తీసి ప్రత్యర్థుల మీదకు విసురుతారు.
గతంలో తాము అవతలి వారిపట్ల ఎలా వ్యవహరించామో అదే పరిస్థితి తమకూ ఇంకోరోజు ఎదురవుతుందనేందుకు ఈ సంఘటనే నిదర్శనం. ఈ విషయాన్ని పార్టీల నాయకులకు కూడా మరొక్కసారి స్పష్టంగా అర్థం అవుతుందని చెప్పవచ్చు. అసలు విషయం క్లియర్‌గా అర్థం కావాలంటే ఐదేళ్లు వెనక్కి వెళ్లాలి.
2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఓటమి పాలైన జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. ఆ సమయంలో అమరావతి రాజధాని భూముల సమీకరణలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు గుప్పుమన్నాయ్. ఇదే తరుణంలో జగన్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు ఉపక్రమించారు.
పాదయాత్రలో భాగంగా 2017లో రాజధాని ప్రాంతమైన అమరావతిలో జగన్ పాదయాత్ర చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. అయితే జగన్ అడుగు పెట్టడంతో రాజధాని ప్రాంతం అపవిత్రం అయిందని, ఆయన వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ నాయకులు మంగళగిరిలో అంబెడ్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకూ రోడ్లను పసుపునీళ్లతో కడిగారు. అప్పట్లోనే ఈ విపరీత చర్యను ప్రజలు గర్హించారు.
అయితే 2019లో చంద్రబాబు ఓడిపోయి.. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. మళ్లీ 2024 ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో చంద్రబాబు మొన్న కర్నూలులో పర్యటించి, బహిరంగ సభల్లో మాట్లాడారు. అప్పట్లో జగన్ నడిచిన ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు ఎలాగైతే పసుపు నీళ్లతో రోడ్లను శుభ్రం చేశారో ఇప్పుడూ అచ్చం అలాగే.. వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు మీటింగ్స్ పెట్టిన పత్తికొండ తదితర ప్రాంతాల్లో రోడ్లను పసుపు నీళ్లతో శుభ్రం చేశారు.
ఈ సంఘటనతో హిస్టరీ రిపీట్ అయిందని పలువురు గుసగుసలాడుతున్నారు. అప్పుడు వాళ్లు చెప్పిన కారణమే ఇప్పుడు వీళ్లు చెబుతున్నారు. రాయలసీమలో మళ్లీ కక్షలు, కార్పణ్యాలకు చంద్రబాబు ఆజ్యం పోస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఏపీలో హిస్టరీ ఇలా రిపీట్ అయిందన్న మాట.