చైనాలో భారీ భూకంపం.. 111 మంది మృతి
చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప ధాటికి పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. 111 మంది మృతి చెందారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు

బీజింగ్ : చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప ధాటికి పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. 111 మంది మృతి చెందారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
చైనాలోని వాయువ్య గన్స్, కింగ్ హై ప్రావిన్స్‌లో భూకంపం సంభవించగా, ఆ ప్రాంతాల్లో అధికారులు, పోలీసులు కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. భవనాలు నేల మట్టం కావడంతో స్థానికులు భయంతో రోడ్లపై పరుగులు తీశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ మాట్లాడుతూ.. స్థానికులు ఎవరూ ఆందోళనకు గురి కావొద్దన్నారు. అన్ని రకాల సహాయ చర్యలు అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిరాశ్రుయులకు పునరావాసం కల్పించాలని జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు. భూకంపం సంభవించడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
చైనాలో గతంలోనూ భూకంపాలు సంభవించాయి. ఈ ఏడాది ఆగస్టులో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నాడు 23 మంది చనిపోయారు. 2022, సెప్టెంబర్‌లో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించగా, 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2008లో 7.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు 87 వేల మందికి పైగా మరణించారు. ఇందులో 5,335 మంది విద్యార్థులు ఉన్నారు.