ఏపీలో కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తా : మంత్రి కొండా సురేఖ

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం తాను ప్రచారం చేస్తానని తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు

ఏపీలో కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తా : మంత్రి కొండా సురేఖ
  • నేవీ రాడార్ కేంద్రంపై బీఆరెస్ దుష్ప్రచారం
  • అనుమతులు ఇచ్చింది వారే
  • భూములు కేటాయించిందీ వారే

విధాత : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం తాను ప్రచారం చేస్తానని తెలంగాణ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం తాను ప్రచారానికి వెళతానని చెప్పారు. ఏపీలో వైఎస్ షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంపీ సీట్లను గణనీయ స్థాయిలో గెలుచుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏపీలో కాంగ్రెస్ బలం పెంచుకోవడం ఖాయమన్నారు.

వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ ఏర్పాటుతో అడవులు కలుషితమవుతాయని బీఆరెస్‌ చేస్తున్న ఆరోపణలపై మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. 30 ఏళ్లుగా తమిళనాడులో నేవీ రాడార్‌ను కేంద్రం నడిపిస్తున్నదని, అక్కడ ఎలాంటి సమస్య లేదని చెప్పారు. బీఆరెస్ అధికారంలో ఉన్నప్పుడే నేవీ రాడార్ కోసం కేంద్రం అన్ని పర్మిషన్లు ఇచ్చిందని, కానీ అప్పటి సీఎం కేసీఆర్ తమకు బైసన్‌ పోలో గ్రౌండ్ ఇస్తేనే సంతకం పెడతానంటూ మెలిక పెట్టి ఆపారని గుర్తుచేశారు. రాడార్ స్టేషన్‌కు గత బీఆరెస్‌ ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందన్నారు. రాడార్ స్టేషన్‌కు రిజర్వ్ ఫారెస్ట్ భూములను కూడా గత ప్రభుత్వమే అప్పగించిందని గుర్తు చేశారు. 2014లో భూముల బదలాయింపుల లెక్క వేసి నోట్ పంపారని చెప్పారు. 2017లో అటవీ భూములపై గత ప్రభత్వమే జీవో జారీ చేసిందన్నారు. 2017లో కేంద్రం మరింత సమాచారం కోరిందని.. గత ప్రభుత్వమే దానికి కూడా వివరణ ఇచ్చిందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాడార్ సెంటర్‌కు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు నష్టం జరిగే ప్రాజెక్టు కాదు కాబట్టే పరిశీలన చేసి తుది జీవో విడుదల చేశామని కొండా సురేఖ తేల్చిచెప్పారు.

జంతువులు, మనుషుల ప్రాణాలకు ముప్పు లేదని స్పష్టంచేశారు. రాడార్ ప్రాజెక్టు వల్ల ప్రకృతికి నష్టం జరగదని, గ్రామాలు ఖాళీ చేయాల్సిన అవసరం కూడా లేదని తేల్చిచెప్పారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెందిన పాఠశాలలు, కొత్త ప్రాజెక్టులు వస్తాయని వివరించారు. పరిరక్షణ కమిటీ, గ్రామాల నుంచి ప్రజలను తమిళనాడు పర్యటనకు తీసుకెళ్తామని సురేఖ చెప్పారు. రెండు, మూడు నెలల్లో రాడార్ సెంటర్‌కు శంకుస్థాపన జరుగుతుందని, నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి అవుతుందని వెల్లడించారు.