Pakistan | ఇమ్రాన్‌కు షాక్.. సమాచారం లీక్ కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష
ఎన్నికల ముంగిట పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రరహస్య సమాచారం లీక్ కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Pakistan | విధాత: ఎన్నికల ముంగిట పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రహస్య పత్రాలను బయలుపరిచారన్న ఆరోపణలపై ఆయనతో పాటు ఆయన సన్నిహితుడు షా మొహమ్మద్ ఖురేషీకి పాకిస్థాన్ (Pakistan) కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి అబ్దుల్ హస్నత్ జుల్కర్‌నైన్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ ఉన్న రావల్పిండిలోని అడియాలా జైలులోనే కేసు విచారణను ముగించారు.
ఈ కేసులో స్పెషల్ కోర్టు జరిపిన విచారణను, విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు గతంలోనే తోసిపుచ్చింది. కేసు తప్పుల తడకగా ఉందని ఆక్షేపించింది. దాని తర్వాత ప్రభుత్వం అఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్ 2023ను తీసుకువచ్చింది. దాని ఆధారంగానే ప్రస్తుత తీర్పు వెలువడింది. అయితే ఈ కేసులో దోషులుగా తేలిన ఇమ్రాన్‌ఖాన్, ఖురేషీలు తమను కొంతమంది బలి పశువులుగా చేశారని ఆరోపించారు. ఈ కోర్టు చేసిందని చెబుతున్న విచారణ అంతా ఓ జోక్ అని ఇమ్రాన్ కొట్టిపడేశారు. ప్రభుత్వ న్యాయవాదులు, తమ తరఫు న్యాయవాదులు కూడా కుమ్మక్కయిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అధికారంలోకి తీసుకురావాలని సైన్యం ప్రకటిస్తున్నప్పటికీ.. జనాదారణ ఇమ్రాన్‌కే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను బయటకు రాకుండా జైలు పాలుచేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తాజా తీర్పు అందులో భాగంగానే వచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు నాలుగేళ్లుగా లండన్‌లో స్వీయనిర్బంధంలో ఉంటున్న తన తండ్రిని సైన్యమే స్వదేశానికి రప్పించిందని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షరీఫ్ వ్యాఖ్యానించారు. తద్వారా నవాజ్‌కు సైన్యం అండదండలున్నాయని ఆమె ఒప్పుకొన్నట్లయింది.