గ్రేటర్‌లో గెలుపే కీలకం.. 29 నియోజకవర్గాలు ఇక్కడే
మినీ ఇండియాగా పిలిచే గ్రేటర్ ఓటర్ల తీర్పు ఈసారి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న అంశాన్ని నిర్ణయించబోతున్నది. గ్రేటర్ పరిధిలో 29 స్థానాలు ఉన్నాయి.

- పాతబస్తీలో ఏడు సీట్లు మినహాయిస్తే
- మిగిలిన 22 స్థానాల కోసం హోరాహోరీ
- జిల్లాల్లో జరిగే నష్టం.. ఇక్కడ గెలిచే సీట్లతో భర్తీ
- పావులు కదుపుతున్న బీఆరెస్ నేతలు
- పూర్వవైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు
- మినీ భారతంగా గ్రేటర్ హైదరాబాద్
- రాజకీయాలకు అతీతంగా ఓటింగ్‌కు చాన్స్
- మిశ్రమ ఓటింగ్‌లో మునిగేదెవరో.. తేలేదెవరో!
(విధాత ప్రత్యేకం)
మినీ ఇండియాగా పిలిచే గ్రేటర్ ఓటర్ల తీర్పు ఈసారి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న అంశాన్ని నిర్ణయించబోతున్నది. గ్రేటర్ పరిధిలో 29 స్థానాలు ఉన్నాయి. ఎంఐఎం గత ఎన్నికల్లో 7 స్థానాల్లో గెలుపొందింది. మలక్‌పేట, నాంపల్లి, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్నది. అయితే నాంపల్లిలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇక మిగిలిన 22 స్థానాల ఫలితాలు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆరెస్‌కు చాలా ముఖ్యమని పరిశీలకులు అంటున్నారు.
బీఆరెస్ 2014లో 3 సీట్లు మాత్రమే సాధించింది. కానీ 2018 ఎన్నికల్లో ఏకంగా 19 స్థానాలు దక్కించుకున్నది. ఈసారి కూడా మెజారిటీ స్థానాలను దక్కించుకునే దిశగా కసరత్తు చేస్తున్నది. గత ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణలో (ఖమ్మం మినహా) అంతటా బీఆరెస్ గణనీయమైన సీట్లు సాధించింది. ఈసారి చాలా జిల్లాల్లో ఎదురీదే పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లాల్లో కోల్పోతున్న సీట్లను సిటీలో భర్తీ చేయాలని చూస్తున్నదని చెబుతున్నారు. కాంగ్రెస్‌పార్టీ 2009లో గ్రేటర్‌లోని 24 చోట్ల పోటీ చేసి 14 స్థానాలు గెలుచుకున్నది.
అప్పటి నుంచి 2018 వరకు పెద్దగా సీట్లు గెలుచుకోలేదు. 2018లోనూ మహాకూటమి పొత్తులో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేసి ఎల్బీనగర్, మహేశ్వరంలోనే మాత్రమే నెగ్గింది. అనంతరం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆరెస్‌లో చేరిపోయారు. ఈసారి 2009 నాటి ఫలితాలను పునరావృతం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో బీజేపీ ప్రభావం కూడా బాగానే ఉంటుంది. ఆ పార్టీ గత ఎన్నికల్లో గోషామహల్‌లో మాత్రమే గెలుపొందింది.
ఈసారి గోషామహల్‌తోపాటు 2014లో గెలిచిన ముషీరాబాద్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, ఉప్పల్‌లను నిలబెట్టుకోవాలని భావిస్తున్నది. అదే సమయంలో శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల స్థానాల్లోనూ తన బలమేమిటో చూపెట్టాలనుకుంటున్నది. ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు తప్పకపోవచ్చని అంటున్నారు. అందుకే ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు? గెలవకపోయినా ఎవరు ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపు అవకాశాలకు గండి కొడతారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
కొత్త ఓటర్లు ఎటువైపు?
గ్రేటర్ వ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో ఎక్కువమొత్తంలో కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఇందులో 40 శాతం యువ ఓటర్లే ఉన్నారు. వీరు అభ్యర్థుల గెలుపోటమలను నిర్ణయించే సంఖ్యలో ఉండటం ప్రధాన పార్టీ అభ్యర్థులను కలవరపరుస్తున్నది. ఎందుకంటే 18-25 సంవత్సరాల లోపు యువతపై బీజేపీ భావజాల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అందుకే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లను గెలుచుకోవడానికి ఈ యూత్ ఓట్లు కూడా ఒక కారణం. గ్రేటర్‌లో కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోరులో నేపథ్యంలో ప్రతి ఓటు కీలకమే. ఎవరు గట్టెక్కినా.. వెయ్యి, రెండు వేల మెజారిటీతోనే అని అంటునారు.
కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్లు ఏ పార్టీవైపు మొగ్గుచూపుతారనే దానిపై కొన్ని స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, కుద్బుల్లాపూర్‌లలో గతంతో పోలిస్తే ఓటర్లు పెరిగారు. ఇందులో తొలి ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. దీనికితోడు ఇక్కడ ఓటింగ్ శాతం కూడా తక్కువగానే నమోదవుతున్నది. ఇది కూడా ప్రధాన పార్టీలకు ఇబ్బందికర పరిణామమేనని అంటున్నారు. ఈసారి ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చనే అంచనాలూ ఉన్నాయి.
అటువంటి పరిస్థితే ఉంటే.. యువ, మహిళా ఓటర్లే దిక్కని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ గ్రేటర్ పరిధిలోని యువ ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. ఓటర్లు కూడా తమ సమస్యలపై పోరాడే వారినే ఎన్నుకునేలా స్థానికంగా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. స్థానిక సమస్యలతో ఒక అజెండా రూపొందించుకుని వాటి పరిష్కారం కోసం ఏ అభ్యర్థి స్పష్టమైన హామీ ఇస్తే వారికే తమ మద్దతు అంటున్నారు. దీంతో ఓట్లు, సీట్ల వేటలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పడ్డాయి. బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్ తోపాటు గ్రేటర్ పరిధిలో తమ సత్తా చాటి రెండంకెల సీట్లను దాటాలని యత్నిస్తున్నది. జనసేనతో కలిసి పోటీ చేస్తుండటం తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.
మరోవైపు టీడీపీ ఈ ఎన్నికల్లో దూరంగా ఉంటం తమకు లాభిస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తున్నది. అధికారపార్టీ మాత్రం ఐటీ ఉద్యోగులతో పాటు, గ్రేటర్ పరిధిలో తాము చేపట్టిన అభివృద్ధి పనులు, పాత బస్తీలో మినహా ఎంఐఎం మద్దతుతో తాము గత ఎన్నికల్లో గెలుచుకున్న స్థానాలను తిరిగి నిలబెట్టుకుంటామనే విశ్వాసంతో ఉన్నది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా గ్రేటర్ పరిధిలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు దక్కించుకుంటే వారికే ఎక్కువ అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నవంబర్ 30న జరిగే పోలింగ్‌లో గ్రేటర్ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపనున్నారు అన్నది డిసెంబర్ 3 నాటి ఫలితాల్లో తేలనున్నది.