బీజేపీ బిల్లుల ధాటికి.. విపక్షాల విలవిల

- వరుస బిల్లుతో మోడీ సర్కార్ జోరు
- ప్రతి వ్యూహాల్లో ఇండియా కూటమి బేజారు
విధాత, న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటు వేదికగా సాగిస్తున్న బిల్లుల రాజకీయానికి విపక్షాలు కుదేలవుతున్నాయి. ప్రధాని మోడీ సర్కార్ వరుస బిల్లుల ధాటికి తల్లడిల్లుతున్న ఇండియా కూటమి విపక్షాలు ప్రతివ్యూహాల అమలులో బేజారవుతున్నాయి. తాజాగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వాహణను తెరపైకి తెచ్చి ఎజెండాపై గొప్యత పాటించి ప్రతిపక్షాల్లో, ప్రజల్లో ఉత్కంఠ రేపి దేశ ప్రజల దృష్టిని తమవైపుకు మళ్లించడంలో సఫలీకృమైన మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుతో జనాకర్షణలో మరో అడుగు ముందుకేసింది.
కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లో సాగిన చర్చోపచర్చలను దేశ ప్రజలు ప్రసార, ప్రచార మాద్యమాల్లో ఆసక్తిగా తిలకించడం విదితమే. విపక్ష ఆర్‌జేడీ, డీఎంకే, బీఎస్పీ, కాంగ్రెస్‌లు పెద్దగా గంభీర చర్చలు లేకుండానే, సవరణల ఊసు లేకుండానే ఆమోదం తెలుపడం కొంత విస్మయం కల్గించింది.
ఈ పరిణామం మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణ అమలు పట్ల అధికార, విపక్షాల నిజాయితీని ప్రశ్నార్ధం చేశాయి. దేశంలో బీజేపీ ప్రభుత్వం నయానా, భయానా ప్రతిపక్షాలను సాంకేతికంగా అదిరించి, నిస్సాహాయక స్థితిలో పడేసి బిల్లుల ఆమోద ప్రక్రియలను పూర్తి చేస్తున్నట్లుగా కనబడుతుంది. దాదాపు ప్రతి పక్షపార్టీలన్నీ కీలకమైన సమస్యల బిల్లులన్నింటిపై ప్రభుత్వ అడుగులకు మడుగు లొత్తే పనినే సాగించాయి.
ఇందుకు అనేక ఉదాహరణలు స్పష్టంగా మన కళ్ళముందువున్నాయి. వాటిలో 2019లో అయోధ్య తీర్పుకు సంబంధించిన బిల్లు, జమ్మూకాశ్మీర్ 370బిల్లు, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్సీకి సంబంధించిన బిల్లు, ఆర్ధికంగా వెనుకబడిన సెక్షన్ లవారి కోటాకు సంబంధించిన బిల్లు, ఎన్నికల సంఘం కూర్పు బిల్లు, ఢీల్లీ ప్రభుత్వ అధికారాల బిల్లు, డెటా ప్రొటెక్టు బిల్లు వంటివి ఉదాహరణగా చెప్పవచ్చు.
తాజాగా పాసైన మహిళా రిజర్వేషన్ బిల్లు. ఇలా చెప్పుకొంటూ పోతే బీజేపీ బిల్లుల ఆమోదంలో విజయవంతమైన వ్యూహాలను, ఆమోద ప్రక్రియలో ప్రతిపక్షాల అనివార్య ఆమోదతకు నిదర్శనంగా కనిపిస్తాయి. వీటన్నిటిని విశ్లేషిస్తే అధికార బీజేపీ ప్రభుత్వ ప్రభావం, పలుకుబడి దేశ రాజకీయ పటంపై పెరుగుతోందనే విషయం సుస్పష్టమవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
విఫలమవుతున్న విపక్ష వ్యూహాలు
పార్లమెంటులో అధికార బీజేపీ బిల్లుల రాజకీయంలో పడిపోయి ప్రభుత్వంతో కలిసి బిల్లుల ఆమోదంలో విపక్షాలు కలిసి నడుస్తుంటే ఇక అవి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాయనే విశ్వాసం క్రమంగా ప్రజల్లో ఆవిరైపోక తప్పదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అంత కన్నాముఖ్యమైన విషయం మన రాజ్యాంగానికి ఆధారభూతమైన ప్రజాస్వామ్వాన్ని ఇది బలహీనపరుస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
మహిళ రిజర్వేషన్ బిల్లును పరిశీలిస్తే ఆ బిల్లు లింగవివక్షత నిర్మూలన దిశగా చారిత్రాత్మకమైనదే అందులో సందేహం లేదు. దాదాపు ప్రతిపక్షలన్నీ ఏకగ్రీవంగా బిల్లు కుమద్దతునిచ్చాయి. కాకపోతే ఒక విషయాన్ని ఎత్తి చూపాయి. అది బిల్లులో ఓబిసీ మహిళలను రిజర్వేషన్ కోటాలో చేర్చాలనే విషయం. అంతేకాని అసలు విషయం బిల్లులో కీలక సవరణలు చేయాలనే మాటెవరూ పట్టించు కోలేదు.
పార్లమెంట్ లో ఈబిల్లును ఇద్దరు ఎంపీలు మాత్రమే వ్యతిరేకించారు. ఇదే మాదిరి వ్యవహారం ప్రభుత్వం ఈడబ్ల్యుఎస్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టినపుడు ఏ ప్రతిపక్ష పార్టీ స్పష్టంగా వ్యతిరేకించలేదు. ఒక్క డీఎంకే పార్టీ తప్ప. ప్రత్యేకించి ఓటింగ్ సమయంలో సభలో గైర్హాజర్ కావటం వంటి చర్యలు ప్రభుత్వం సులువుగా ఆ బిల్లును పాస్ చేసేందుకు ఉపయోగపడింది. అయోధ్య బిల్లుకుసంబంధించి ఇదే జరిగింది. బీజేపీ ఒకవైపు ప్రతిపక్షాలను చీల్చడంలో నిమగ్నమైవుంది. అందులో కొంత ఫలితం సాధించింది.
పార్లమెంట్ లోనూ ప్రతి పక్షాల మాట చెల్లకుండా చేయాలనుకొంటోంది. అందులోనూ చాలామేరకు సఫలం అయ్యింది. ఇవన్నిబీజేపీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సాధిస్తున్న విజయాలు. వాటితో బీజేపీ మరింత లపడుతుంటే, ప్రతిపక్షాలు సిధ్ధాంతపరంగా బీజేపీకి గట్టి కౌంటర్ ఫైట్ ఇచ్చేది పోయి క్షేత్ర స్తాయి రాజకీయాల్లోనూ, పార్లమెంటులోనూ చతికిల పడుతున్నాయి. ఎక్కడ తమ వ్యూహాలు విఫలం చెందుతున్నాయో ప్రతిపక్షాలు పరిశీలించుకోవలసిన అవసరం వచ్చిందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరికలు చేస్తున్నారు.