12నుంచి మహిళా సంఘాలకు మళ్లీ వడ్డీ లేని రుణాలు
రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళను మహాలక్ష్మిగానే భావించి గౌరవిస్తున్నామని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ఈనెల 12నుంచి

- రైతుబంధులో ఏరివేత తప్పదు
- 200యూనిట్ల లోపు బిల్లు వస్తే కట్టనవసరం లేదు
- పెరిగిన విద్యుత్తు వినియోగం డిమాండ్
- అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళను మహాలక్ష్మిగానే భావించి గౌరవిస్తున్నామని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ఈనెల 12నుంచి మళ్లీ రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రారంభించనున్నట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. శనివారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆరెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రారంభించడంతో పాటు ద్వారా మహిళలు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే మహిళలకు గృహజ్యోతి పథకం 200యూనిట్ల లోపు ఉన్నవారికి జీరో బిల్లు వస్తుందని, కొందరికి బిల్లు కట్టాలని వస్తుందని తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. బిల్లులో 200 యూనిట్లలోపు ఉన్న వారికి డబ్బులతో కూడిన బిల్లు వస్తే వారు ఆ బిల్లు కట్టనవరం లేదని చెప్పారు.. ప్రజాపాలన దరఖాస్తులో పొరపాటుగా నమోదు చేయడం జరిగి ఉండొచ్చని, బిల్లుతో పాటు రేషన్ కార్డు తీసుకెళ్లి ఎంపీడీఓ ఆఫీస్ నందు నమోదు చేయించుకుంటే జోరో బిల్లు వస్తుందని తెలియజేశారు. రాష్ట్రంలో 40,33,702 మందికి గృహజ్యోతి అందుతున్నదని పేర్కోన్నారు. గత ప్రభుత్వం 10 ఏండ్లుగా రేషన్ కార్డు ఇవ్వని కారణంగానే, కొత్తగా పెళ్లి అయిన వారికి గృహ జ్యోతి రావడంలేదని, గృహజ్యోతి కోసం దరఖాస్తు నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రైతుబంధులో ఏరివేత తప్పదు
గతంలో బీఆరెస్ ప్రభుత్వం రైతు బంధును ఐదు నెలలపాటు ఇచ్చిందని, తాము వారి కంటే తక్కువ సమయంలోనే అందజేస్తున్నామని మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలను కొండలు, గుట్టలు ఉన్న బడా బాబులకు రైతు బంధుగా ఇచ్చారని, తాము ఈ విధంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం కానివ్వరాదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్టు తెలిపారు. ఐదు ఎకరాల్లోపు అర్హుల ఖాతాలో రైతు భరోసా డబ్బును జమ చేశామని తెలిపారు.రాష్ట్రంలో కరెంటు కష్టాలు రాబోతున్నాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, అటువంటి అపోహాల్ని నమ్మోద్దని సూచించారు. తెలంగాణలో కరెంటు డిమాండ్ బాగా పెరిగిందని, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు అని గత ప్రభుత్వ పెద్దలు అన్నారని, రాష్ట్ర చరిత్రలో నిన్న అత్యధికంగా 15,623 మెగావాట్ల విద్యుత్తు సరఫరా చేశామని తెలిపారు. 2022 డిసెంబర్ లో 200 మిలియన్ యూనిట్లు వాడితే 2023 డిసెంబర్ 207.07 మిలియన్ యూనిట్లు సరఫరా చేశామని, గత ప్రభుత్వం సరఫరా చేసిన దానికంటే ఎక్కువ కరెంట్ డిసెంబర్ నుంచి సరఫరా చేస్తున్నామని వెల్లించారు. విద్యుత్తు పీక్ డిమాండ్‌ను ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రీన్ విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణను ఆదర్శంగా నిలిపేలా, ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తిపై దృష్టి పట్టామని స్పష్టం చేశారు. భారీ, మధ్య తరహా సాగు నీటి రిజర్వాయర్‌లో ఫ్లోటింగ్ సోలార్ ను అందుబాటులోకి తెస్తామని, మత్స్య సంపదకు ఏలాంటి నష్టం ఉండదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇరిగేషన్ మెయిన్ కాలువలు, వాటి పక్కన ఉన్న బండ్స్‌పై కూడా సోలార్ పవర్ ఉత్పత్తి చేయడానికి అధికారులను అధ్యయనం చేయాలని ఆదేశించామన్నారు.
గత ప్రభుత్వం 7లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆర్ధిక వ్యవస్థను చిన్నభిన్నం చేసినప్పటికి ఉద్యోగులకు ఎప్పుడూ మొదటి వారంలో జీతాలు ఇవ్వలేదని, రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ తాము మార్చి 1న జీతాలు ఇచ్చామని, ఆరు గ్యారంటీలను ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. 3 నెలల్లో 30వేల ఉద్యోగాలు ఇచ్చామని, వ్యవసాయ బావుల మోటర్లకు ఎట్టి పరిస్థితిలో విద్యుత్తు మీటర్లు బిగించమని ముందే చెప్పామని, మేం దానికే కట్టుబడి ఉన్నామన్నారు. ఐటిఐ విద్య సంస్థల్లో నూతనంగా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఙానంతో కూడిన శిక్షణ యువతకు ఇవ్వడానికి టాటా టెక్నాలాజీస్ తో ఎంవోయూ కుదుర్చుకున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు చెల్లించుకుండా దాదాపు 40వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టిందని, మేము అధికారంలోకి రాగానే తొలుత రూ.10లక్షల రూపాయల లోపు ఉన్నబిల్లులు చెల్లిస్తూ వస్తున్నామని తెలిపారు.