హనుమకొండలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

హనుమకొండ నగరంలో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థిని వెనుగుల సాహితి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది

  • Publish Date - March 8, 2024 / 02:12 PM IST

వరంగల్ : హనుమకొండ నగరంలో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థిని వెనుగుల సాహితి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఆమె హనుమకొండ జిల్లా భీమారంలోని శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో బీపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నది. ఆమెది శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామం. సాహితి గురువారం రాత్రి కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని కాలేజీ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఇదిలా ఉండగా గురువారం రాత్రి ఘటన జరిగినా, శుక్రవారం ఉదయం వరకు తమకు సమాచారం అందించకుండా నేరుగా పోస్టుమార్టం తరలించాక సమాచారం ఇచ్చారని మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతి పై యజమాన్యం గోప్యత పాటించారని మండిపడుతున్నారు.

సాహితి చేతిపై కత్తితో కోసినట్టు గాయాలు ఉన్నాయని, తలభాగంలో దెబ్బలు తగిలి ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శివరాత్రి వేళ సాహితి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే సాహితి మృతికి సంబంధించిన స్పష్టమైన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని అన్ని కోణాల నుండి పరిశీలించాల్సిన అవసరం ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరన్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు పెరుగుతున్న సందర్భంలో కూడా దీని వెనుక ఉన్న కారణాలను మరింత స్పష్టంగా బయటికి తీయవలసిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు.