IRCTC | ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ విమానం టూర్‌ ప్యాకేజీ.. తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు..!

IRCTC | ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ విమానం టూర్‌ ప్యాకేజీ.. తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు..!

IRCTC | తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త తెలిపింది. ప్రత్యేకంగా ఎయిర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. విశాఖపట్నం నుంచి ఈ ఎయిర్‌ ప్యాకేజీ అందుబాటులో ఉండనున్నది. ‘తిరుపతి బాలాజీ దర్శనం’ పేరుతో ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ.. భక్తులను విమానంలో తీసుకెళ్లి.. తిరుమలలో శ్రీవారి దర్శనం చేయించనున్నది.



ప్యాకేజీలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని స్పెషల్‌ ఎంట్రీ దర్శనం ద్వారా చేసుకునే వీలుంటుంది. తిరుమలలో దర్శనానంతరం కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ దర్శనాలు చేసుకోవచ్చు. రెండు రాత్రులు, మూడు రోజుల పాటు ప్యాకేజీ పర్యటన కొనసాగుతుంది. అక్టోబర్‌ 28, నవంబర్ 4, డిసెంబర్‌ 7 తేదీల్లో ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.


పర్యటన ఇలా సాగుతుంది..


ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ బుక్‌ చేసుకున్న వారు.. విశాఖపట్నం విమానాశ్రయంలో ఉదయం 10.30 గంటలకు విమానం ఎక్కాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12.10 గంటల వరకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి చెకిన్‌ అవుతారు. లంచ్‌ చేసిన తర్వాత కాణిపాకం, శ్రీనివాస మంగాపురం ఆలయాల దర్శనం ఉంటుంది. రాత్రికి తిరుపతిలోనే బస ఉంటుంది.


రెండరోజు ఉదయం తిరుచానూర్‌, శ్రీకాళహస్తి, ఆలయాల దర్శనానికి వెళ్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత తిరుమలలో స్పెషల్‌ ఎంట్రీ దర్శనం ఉంటుంది. శ్రీవారి దర్శనం తర్వాత తిరిగి తిరుపతికి చేరుకుంటారు. రాత్రికి తిరుపతిలోనే బస చేసి.. మూడోరోజు ఉదయం రేణిగుంట విమానాశ్రయంలో విమానం ఎక్కి.. విశాఖపట్నం చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ఇలా..


తిరుపతి టూర్ ప్యాకేజీ ధరను ఐఆర్‌సీటీసీ ట్రిపుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి రూ.16,275 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్‌ ఆక్యుపెన్సీకి రూ.16,465, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.19,835 చెల్లించాల్సి ఉంటుంది. టూర్‌ ప్యాకేజీలో విమానం టికెట్లు, హోటల్‌ బస, ఏసీ వాహనంలో సైట్‌ సీయింగ్‌, బ్రేక్‌ఫాస్ట్‌, డిన్నర్‌, తిరుమల స్పెషల్‌ ఎంట్రీ దర్శనం, తిరుచానూరు, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం ఆలయాల్లో దర్శనాలతో పాటు ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్‌కానున్నాయి. ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకునేందుకు irctctourism.com వెబ్‌సైట్‌లో టూర్‌ ప్యాకేజీపై క్లిక్‌ చేసి తిరుపతి బాలాజీ దర్శనం లింక్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత టూర్‌ ప్యాకేజీ వివరాలను సరిచూసుకొని.. బుక్‌ చేసుకోవాలని ఐఆర్‌సీటీసీ సూచించింది.