గాజాలో ఉంటే తీవ్రవాదులే, బతికుండాలంటే పారిపోండి:ఇజ్రాయెల్ హెచ్చరిక
ఉత్తర గాజా నుంచి సత్వరమే దక్షిణ ప్రాంతానికి వెళ్లిపోవాలని, లేదంటే వారిని తీవ్రవాదులుగానే పరిగణిస్తామని పాలస్తీనా పౌరులకు ఇజ్రాయెల్ తాజా హెచ్చరికలు జారీ చేశారు.

జెరూసలేం: ఉత్తర గాజా నుంచి సత్వరమే దక్షిణ ప్రాంతానికి వెళ్లిపోవాలని, లేదంటే వారిని తీవ్రవాదులుగానే పరిగణిస్తామని పాలస్తీనా పౌరులకు ఇజ్రాయెల్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర ప్రాంతంలో ఉన్నవారందరినీ తీవ్రవాదుల మద్దతుదారులుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ దళాల పేరిట, దాని లోగోతో ఈ మేరకు కరపత్రాలను విడుదల చేశారు. దీనితోపాటు గాజా స్ట్రిప్‌లో ఉన్న ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా ఆడియో మెసేజ్‌లను కూడా పంపారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ‘గాజా నివాసితులకు అత్యవసర హెచ్చరిక. ఉత్తరాన వాడీ గాజాలో ఉండటం మీకు ప్రాణాలకు ప్రమాదకరం.
ఉత్తర గాజాను విడిపోకూడదని నిర్ణయించుకునేవారిని ఉగ్రవాద సంస్థతో అనుబంధం ఉన్నవారిగా గుర్తిస్తాం’ అని ఆ కరపత్రంలో ఉన్నది. గాజాలో ఉపరితల పోరుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజా హెచ్చరిక జారీ కావడం విశేషం. తమ హెచ్చరికల మేరకు ఇంకా ఖాళీ చేయనివారి విషయంలో తమకేమీ వేరే ఉద్దేశాలు లేవని, పౌరుల మరణాలను తగ్గించేందుకే తాము తాజా హెచ్చరిక జారీ చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గతంలో 24 గంటల్లో ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించినా.. అందులో ఖాళీ చేయనివారిని ఉగ్రవాదుల మద్దతుదారులుగా పరిగణిస్తామని చెప్పలేదు. కానీ.. తాజా హెచ్చరికను గమనిస్తే.. గాజాలోకి చొరబడేందుకు ఇంకా వేచిచూసే ధోరణిలో ఇజ్రాయెల్ లేదని అర్థమవుతున్నదని పరిశీలకులు అంటున్నారు. అయితే.. దక్షిణాదికి తరలిపోవాలని చెబుతున్న ఇజ్రాయెల్.. దక్షిణాదిపైనా బాంబులు కురిస్తున్నది. దీంతో అటువైపు వెళ్లేవారికి ప్రాణసంకటంగా మారింది.