ముందుగా ఐటీ సోదాలు.. ఆపై బాండ్ల కొనుగోళ్లు!
దేశవ్యాప్తంగా మూడు రాజకీయ పార్టీల తరువాత నాలుగో స్థానంలో ఎలక్టోరల్ బాండ్ల స్వీకరణలో భారత రాష్ట్ర సమితి (బీఆరెస్) ఉంది

- మోదీ, కేసీఆర్ జాయింట్ ఆపరేషన్?
- బీఆరెస్ బాండ్ల కొనుగోలులో ఫార్మా కంపెనీలే టాప్
విధాత, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మూడు రాజకీయ పార్టీల తరువాత నాలుగో స్థానంలో ఎలక్టోరల్ బాండ్ల స్వీకరణలో భారత రాష్ట్ర సమితి (బీఆరెస్) ఉంది. ఫార్మా, నిర్మాణ, హాస్పిటల్ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున చందాలు బీఆరెస్‌కు సమకూరాయి. 2018 అక్టోబర్ 11వ తేదీ నుంచి 2023 సెప్టెంబర్ వరకు రూ.1,322 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపేణా నిధులు సమకూరాయి. 2022 ఏప్రిల్ 12వ తేదీన ఒక్కరోజే బీఆరెస్ రూ.1 కోటి విలువ చేసే 268 బాండ్లను నగదుగా మార్చుకున్నది.
మెఘా ఇంజినీరింగ్ చందా రూ.195 కోట్లు
కొద్ది సంవత్సరాలలోనే మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) దేశంలో అతి పెద్ద కంపెనీగా అవతరించింది. ప్రధాన పార్టీలలోని నాయకులను మచ్చిక చేసుకోవడం, బ్యూరోక్రాట్లను వలలో వేసుకుని పనులు చక్కబెట్టుకోవడం ఈ కంపెనీకి వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం సదరు ముఖ్యమంత్రి, మంత్రి, బ్యూరోక్రాట్లకు వాటాలు కూడా ఇస్తారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పనులు, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం నిర్మాణ కాంట్రాక్టులు దక్కించుకున్నది. ఎస్‌బీఐ వెల్లడించిన ఎలక్టోరల్ బాండ్ల లెక్కల ప్రకారం మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బీఆరెస్‌కు రూ.195 కోట్లు ముట్టచెప్పింది.
కైటెక్స్ గ్రూప్
కేరళ రాష్ట్రానికి చెందిన కైటెక్స్ గ్రూప్ బీఆరెస్ పార్టీకి 2023లో రూ.25 కోట్లు చెల్లించింది. ఈ కంపెనీకి వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో భూమి, రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో 250 ఎకరాలు గార్మెంట్ కంపెనీ ఏర్పాటు కోసం బీఆరెస్ ప్రభుత్వం కేటాయించింది. కైటెక్స్ కేరళలో అక్రమాలకు పాల్పడంతో అక్కడి సీపీఎం ప్రభుత్వం కట్టడి చేసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో చేసేది లేక తన కార్యకలపాలను కేరళ నుంచి మార్చుకునే ప్రయత్నాల్లో ఉండగా.. బీఆరెస్ ప్రభుత్వం ఎర్రతివాచీతో స్వాగతం పలికింది.
నీతి పలుకుల యశోద హాస్పిటల్
హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చెంది, బిఆరెస్ ప్రభుత్వ హయాంలో మరింతగా విస్తరించిన యశోద సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ నిన్నటి వరకు నీతి పలుకులు పలికింది. తాము ఏ రాజకీయ పార్టీకి చందాలు చెల్లించలేదని బుకాయించింది. బహిరంగపర్చిన వివరాల ప్రకారం యశోద హాస్పిటల్ బీఆరెస్‌కు రూ.94 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపేణా అందించడం గమనార్హం. ఈ హాస్పిటల్ యాజమాన్యంపై 2020 డిసెంబర్ నెలలో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయి.
ఫార్మా కంపెనీలు తక్కువేమీ కాదు
హెటిరో డ్రగ్స్ అండ్ ల్యాబ్స్ రూ.50 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ రూ.32 కోట్లు, దివీస్ ల్యాబొరేటరీ రూ.20 కోట్లు, అరబిందో ఫార్మా లిమిటెడ్ రూ.9 కోట్లు, నాట్కో ఫార్మా రూ.20 కోట్లు బాండ్లు తీసుకున్నాయి. కాగా 2023 నవంబర్‌లో పన్నులు ఎగవేస్తున్నారంటూ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు చెందిన డాక్టర్ కే నాగేందర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయం పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించి, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. హెటిరో డ్రగ్స్ యజమాని బీ పార్థసారధి రెడ్డిని బీఆరెస్ అధినేత, అప్పటి సీఎం కే చంద్రశేఖర్ రావు 2022 జూన్‌లో రాజ్యసభకు నామినేట్ చేయడం గమనార్హం. అంతకు ముందు 2021 అక్టోబర్ నెలలో హెటిరో కంపెనీలో ఐటీ శాఖ దాడులు నిర్వహించడం విశేషం. దివీస్ 2019 ఫిబ్రవరిలో ఐటీ సోదాలను ఎదుర్కొన్నది. అరబిందో ఫార్మా డైరెక్టర్ పార్థసారథి రెడ్డి కార్యాయాలు, నివాసాల్లో 2022 నవంబర్‌లో ఈడీ అరెస్టు చేసింది.
మై హోం చందా రూ.49 కోట్లు
ఆయన పేరు డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు. వృత్తిరీత్యా హోమియో వైద్యుడు అయినా ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో పేరు పొందారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాక ముందు అంతగా గుర్తింపు పొందలేదు. బీఆరెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఆయన పేరు మారుమోగుతున్నది. చిన జీయర్ స్వామికి ప్రియ శిష్యుడు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో రామానుజ విగ్రహ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించారు. మై హోంతో పాటు సబ్సిడరీ కంపెనీ తెల్లాపూర్ టెక్నో సంయుక్తంగా రూ.49 కోట్లు విలువైన బీఆరెస్ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. బాండ్ల కొనుగోలుకు ముందు 2019 జూలై నెలలో ఆదాయపు పన్ను శాఖ పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. మై హోంతో పాటు సంబంధిత కంపెనీ కార్యాలయాలు, ఉన్నత ఉద్యోగుల ఇళ్లు, రామేశ్వర్ రావు నివాసంలో తనిఖీలు నిర్వహించి కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈయన బిఆరెస్ అధినేత కె.చంద్రశేఖర్ రావుతో సన్నిహితంగా ఉండడంతో పాటు బీజేపీతో దగ్గర సంబంధాలు కలిగి ఉన్నారనే ప్రచారం ఉన్నది.