తెలంగాణతో కేసీఆర్ కుటుంబమే బాగు పడింది: జైరాం రమేశ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పిదప పదేళ్ల పాలన చూస్తే సీఎం కేసీఆర్ కుటుంబం లబ్ధి పొందడం మినహా తెలంగాణ నిరుద్యోగులు, పేదలు, దళిత, గిరిజనులకు దక్కిన ప్రయోజనం లేదని కేంద్ర మాజీ మంత్రి జైరా రమేశ్ విమర్శించారు.

తెలంగాణతో కేసీఆర్ కుటుంబమే బాగు పడింది: జైరాం రమేశ్

విధాత : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పిదప పదేళ్ల పాలన చూస్తే సీఎం కేసీఆర్ కుటుంబం లబ్ధి పొందడం మినహా తెలంగాణ నిరుద్యోగులు, పేదలు, దళిత, గిరిజనులకు దక్కిన ప్రయోజనం లేదని కేంద్ర మాజీ మంత్రి జైరా రమేశ్ విమర్శించారు. గురువారం ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందిందని, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు పెట్టుబడులు విస్తరించలేదన్నారు.


నిరుద్యోగంతో రాష్ట్రంలో రోజుకొకరు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల నిరుద్యోగులు నష్టపోయారన్నారు. తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదని, తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందన్నారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. తెలంగాణలో బీజేపీకి బీఆరెస్‌, ఎంఐఎంలు బీ, సీ టీమ్‌లుగా మారాయన్నారు.


తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్‌లో ఒక బీఆరెస్‌ ఎంపీ లేరని.. రాజ్యసభలోనూ లేరని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని తెలంగాణ ద్రోహి అంటున్నాడని కేసీఆర్‌పై మండిపడ్డారు. కేటీఆర్ బ్రాండ్ తెలంగాణ తయారు చేశానంటున్నారని, హైదరాబాదులో అనేక రకాల పరిశ్రమలను ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు.


భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కలిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. బీఆరెస్‌ అంబాసిడర్ కారు మ్యూజియంలో ఉండాల్సిన రోజు వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. బీఆరెస్ ఎన్నికల హామీలకు ఈ నెల 30తర్వాతా కాలం చెల్లిపోతాయన్నారు.