Pahalgam Club: ఉగ్రదాడి జరిగిన చోటనే జమ్మూ కశ్మీర్ కేబినెట్ సమావేశం!

Pahalgam Club: జమ్మూ కశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన చోటనే ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్ధుల్లా తన కేబినెట్ సమావేశం నిర్వహించి ఆసక్తి రేపారు. ప్రకృతి అందాలకు నెలవైన పహల్గాంలోని బైసరన్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు బలయ్యారు. అప్పటినుంచి ఈ ప్రాంతానికి పర్యాటకుల రాక తగ్గిపోగా..స్థానికులకు..రాష్ట్ర ఖజానాకు సైతం ఆదాయం తగ్గిపోయింది. మంగళవారం అదే ప్రాంతంలో జమ్మూకశ్మీర్ కేబినెట్ భేటీ అయ్యింది. పర్యాటకంపైనే ఆధారపడిన స్థానిక ప్రజలకు, ఉగ్రదాడితో భీతావహులైన వారికి సంఘీభావంగా పహల్గామ్ క్లబ్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించినట్లుగా సీఎం ఒమర్ అబ్ధుల్లా తెలిపారు. పిరికిపంద చర్యలకు తాము ఏమాత్రం భయపడబోమనే సందేశాన్ని పంపుతూ జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహించిందని తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాల రాజధాని జమ్ము వెలుపల ఇలా మంత్రులు భేటీ కావడం ఇదే తొలిసారి అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
‘మేం ప్రజల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాం. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు పహల్గాంకు వచ్చాం. ఆ దిశగా చర్యలు కొనసాగుతాయి’’ అని ఒమర్ అబ్ధుల్లా ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. పహల్గాం క్లబ్‌లో జరిగిన కేబినెట్ మీటింగ్ దృశ్యాలను ఒమర్ అబ్ధుల్లా ఎక్స్ లో షేర్ చేశారు. ‘‘ఉగ్రవాదుల పిరికిపంద చర్యలకు ఏ మాత్రం భయపడేదిలేదనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చేందుకే ఇక్కడకు వచ్చాం. జమ్మూకశ్మీర్ దృఢంగా నిలుస్తుంది’’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు.
ప్రధాని మోదీ అధ్యక్షత వహించే నీతిఆయోగ్ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించాలని అభ్యర్థించారు. ఈ తరహా చర్యలు స్థానిక ప్రజల్లో భయాలను తొలగిస్తాయన్నారు. గతంలోనూ ఒమర్ అబ్దుల్లా 2009 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన ఉత్తర కశ్మీర్‌లోని గురెజ్, మచిల్, తాంగ్‌ధర్, జమ్మూప్రాంతంలోని రాజౌరీ, పూంఛ్‌లోనూ ఇలా క్యాబినెట్ సమావేశాలు నిర్వహించడం విశేషం.