Japan | కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే వెండింగ్ మెషీన్లు.. జపాన్‌లో ఏర్పాటు
విధాత: భూ వాతావరణాన్ని వేడెక్కించడంలో కార్బన్ డై ఆక్సైడ్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ వాయువును వాతావరణం నుంచి తొలగించడానికి శాస్త్రవేత్తలు పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. కార్బన్ న్యూట్రల్‌గా మారాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న (Japan) జపాన్.. ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి Co2ను పీల్చుకునే వెండింగ్ మెషీన్లను రూపొందించింది. ఈ ప్రయత్నం కనుక విజయవంతమైతే ప్రపంచానికి మేలు చేసే ఆవిష్కరణగా నిలవనుంది. జపాన్‌లోని టోక్యో అసహీ సంస్థకు చెందిన కూల్‌డ్రింక్‌ల […]

విధాత: భూ వాతావరణాన్ని వేడెక్కించడంలో కార్బన్ డై ఆక్సైడ్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ వాయువును వాతావరణం నుంచి తొలగించడానికి శాస్త్రవేత్తలు పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. కార్బన్ న్యూట్రల్‌గా మారాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న (Japan) జపాన్.. ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి Co2ను పీల్చుకునే వెండింగ్ మెషీన్లను రూపొందించింది. ఈ ప్రయత్నం కనుక విజయవంతమైతే ప్రపంచానికి మేలు చేసే ఆవిష్కరణగా నిలవనుంది.
జపాన్‌లోని టోక్యో అసహీ సంస్థకు చెందిన కూల్‌డ్రింక్‌ల డివిజన్ Co2ను పీల్చుకునే ఈ వెండింగ్ మెషీన్లను తయారుచేసింది. వచ్చే నెల నుంచి వీటిని పనిలో పెట్టనుంది. ఆ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మెషీన్లలో ఒక తెల్లటి పౌడర్ ఉంటుంది. దీనిని కాల్షియం సమ్మేళనాలతో రూపొందిస్తారు. దీనిని గాలిలో ఉంచగానే Co2ను పీల్చుకుంటుంది. ఈ ప్రక్రియ వల్ల ఆ మెషీన్లలో ఉన్న కూల్‌డ్రింక్ టిన్నులు అవసరాన్ని బట్టి చల్లగానూ, వెచ్చగానూ ఉంటాయి.
ఇలా సంవత్సరానికి ఒక మెషీన్ 60 కేజీల Co2ను సంగ్రహించగలదు. దాని గడువు పూర్తవగానే ఆ పౌడర్‌ను ఎరువులను తయారుచేయడానికి, సీ బెడ్స్ ఆల్గేలకు ఆహారంగానూ ఇవ్వొచ్చు. ప్రస్తుతం తమ వద్ద ఇలాంటివి 2,60,000 మెషీన్లు ఉన్నాయని టోక్యో అసహీ సంస్థ ప్రతినిధి యోషీ హోరీ వెల్లడించారు. ఫారెస్ట్ ఆఫ్ సిటీస్ అని ముద్దుగా పిలుచుకునే వీటిని జపాన్ అంతటా ఇప్పటికే ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రమాద ఘంటికలు
2022 నాటికి ఈ భూగోళంలో ఏకంగా 40.6 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా. ఇదే ఒరవడి ఇకపైనా కొనసాగితే కేవలం తొమ్మిదేళ్లలోనే ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతలు 1.5 సెల్సియస్ డిగ్రీలు పెరిగిపోయే ప్రమాదముంది. దీనిని తప్పించుకోడానికి పలు దేశాలు ప్రయత్నిస్తున్నా.. ఆశించినంత మేర చర్యలు ఉండటంలేదన్నది పరిశోధకుల మాట.