జార్ఖండ్‌ అసెంబ్లీలో రేపు బలపరీక్ష

జార్ఖండ్‌ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష జరుగనున్నది. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీంతో మెజారిటీ సంఖ్య 41

జార్ఖండ్‌ అసెంబ్లీలో రేపు బలపరీక్ష
  • బీహార్‌లో 12న బలపరీక్ష
  • క్యాంపు రాజకీయాలకు కేరాఫ్‌గా హైదరాబాద్‌
  • ఇబ్రహీమ్‌పట్నం చేరుకున్న బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

విధాత ,రాంచీ: జార్ఖండ్‌ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష జరుగనున్నది. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీంతో మెజారిటీ సంఖ్య 41. అయితే జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ ఉంది. ఆ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాంగ్రెస్‌కు 16, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్‌)కు చెరొక ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో అధికార జేఎంఎం కూటమికి మొత్తంగా 46 మంది సభ్యులున్నారు.


మరోవైపు ప్రతిపక్ష బీజేపీకి 25 మందితోపాటు దాని మిత్ర పక్షాలతో కలిపి 29 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎదైనా ఊహించని పరిణామాలు జరిగితే తప్ప అధికార జేఎంఎం బలపరీక్షలో ఈజీగా గెలిచే అవకాశమున్నది.

2022 సెప్టెంబర్‌లో కూడా అవినీతి ఆరోపణల వల్ల హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు పడవచ్చని అంతా భావించారు. ఈ నేపథ్యంలో జేఎంఎం ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొంది. 48 ఓట్ల మెజారిటీతో ఫ్లోర్‌ టెస్ట్‌లో విజయం సాధించింది.

అవినీతి ఆరోపణల కేసులో ఈడీ అరెస్ట్‌కు ముందు హేమంత్ సోరెన్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రవాణా మంత్రి చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. దీంతో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), భాగస్వామ్య పార్టీలకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్‌కు తరలించారు. సోమవారం అసెంబ్లీలో ఫ్లోర్‌ టెస్ట్‌ జరుగనున్న నేపథ్యంలో వారంతా రాంచీకి తిరుగు ప్రయాణమమ్యారు.

జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లారు..బీహార్ ఎమ్మెల్యేలు వచ్చారు

హైదరాబాద్ రాష్ట్రం క్యాంపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలకు అడ్డగా మారిన హైదరాబాద్ తాజాగా జార్ఞండ్ జేఎంఎం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల క్యాంపుకు వేదికైంది. రెండు రోజులు లీయోనియో రీసార్ట్‌లో బస చేసి, నేడు అసెంబ్లీలో నిర్వహించనున్న విశ్వాస పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్లారు. వారు వెళ్లాక ఇప్పుడు బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 22మంది ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ చేరుకున్నారు. ఇబ్రహీమ్‌ పట్నంలోని రిసార్ట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్యాంపు వేశారు. ఈ నెల 12న సీఎం నితీశ్‌కుమార్ విశ్వాస పరీక్ష నేపధ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వారిని హైదరాబాద్‌కు తరలించింది.