సిద్ధాంతాలు లేని బీజేపీ: జితేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు సిద్ధాంతాలు వదిలేసి స్వప్రయోజనాలకు పాటుపడుతున్నారని మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి

- ఆత్మాభిమానం చంపుకోలేకే కాంగ్రెస్‌లోకి
- టికెట్ రాకుండా కొందరు అడ్డుపడ్డారు
- ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి
విధాత, ఉమ్మడిమహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు సిద్ధాంతాలు వదిలేసి స్వప్రయోజనాలకు పాటుపడుతున్నారని మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి ఢిల్లీలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ లో చేరిన తరువాత మొదటిసారి శనివారం పాలమూరుకు వచ్చిన సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించిన తరువాత జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ఉన్నపుడు నేతల మధ్య ఎలాంటి తరతమ్యాలు లేకుండా ఉండేవని, ఆయన ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళితే రాష్ట్రంలో బీజేపీ కి 35 స్థానాలు వచ్చేవన్నారు.
బండి సంజయ్ ను అధ్యక్ష భాద్యతల నుంచి తప్పించడంతో బీజేపీలో నేతల మధ్య స్నేహ సంబంధాలు లేకుండా పోయాయన్నారు. పార్టీలో నేతలు ఎదుగుతుంటే ఓర్వలేని తనం ఎక్కువైందని, ఎదిగితే తొక్కే ప్రయత్నం చేస్తున్నారని జితేందర్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు పార్లమెంట్ టికెట్ విషయంలో ఎలాంటి సమాచారం లేకుండా ఇతరులకు ప్రకటించారని, టికెట్ కోసం ప్రయత్నిస్తున్న తన అభిప్రాయం కూడా అధిష్టానం తెలుసుకోలేదన్నారు. సీనియర్ నేతకు ఇలా అవమానం జరిగితే ఎలా సహించాలన్నారు. గతం లో కూడా కేసీఆర్ తన కూతురు కవితను పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ చేసేందుకు తనకు టికెట్ ఇవ్వలేదన్నారు. అవమానం జరిగిన చోట ఉండే వ్యక్తిని కాదని, ఆత్మభిమానం చంపుకోలేకే అప్పుడు బీఆరెస్‌ను వదిలి బీజేపీలో చేరానన్నారు.
బీజేపీలో అప్పటి సిద్ధాంతాలు లేవనే విషయం తెలుసుకున్నానని, అక్కడ వ్యక్తులకే ప్రాధాన్యత ఉందని, వ్యవస్థ కు ప్రాధాన్యత లేదన్నారు. తనకు ఎంపీ టికెట్ రాకుండా కొందరు అడ్డుకున్నారని, విలువలు లేని పార్టీలో ఉండడం ఇష్టం లేక బాధ పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి ధైర్యం చెప్పి ఓదార్చారని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన అభిష్టం మేరకే కాంగ్రెస్‌లో చేరానని, తనతో పాటు తన కుమారుడు మిథున్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ లో చేరారన్నారు. తన స్వభావాన్ని నమ్మిన కాంగ్రెస్ పార్టీ వెంటనే రెండు పదవులు ఇచ్చిందని, వాటికి తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశం లో పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మిథున్ రెడ్డి, వినోద్ కుమార్ పాల్గొన్నారు.