కప్పల తక్కడైనా మునుగోడు: శుభే ఆన.. శ్యామ్‌ జాన

లక్షల ఆఫర్లతో పార్టీలు మారుతున్న స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయారామ్.. గయారామ్‌లతో పరేషాన్ విధాత, నల్లగొండ: సెప్టెంబర్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల పర్వం పార్టీల బలాబలాల కంటే ప్రలోభాల బలం పైనే సాగుతుండడంతో ఓటర్ల మొగ్గు ఎటు వైపు అన్నదాని కంటే ముందుగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జంపుజిలానీలుగా మారి పార్టీలు ఫిరాయిస్తున్న తీరుతో నియోజకవర్గంలో కప్పలతక్కెడ ఆట సాగుతుంది. పార్టీ మారిన సర్పంచులకు, వార్డు సభ్యులకు, ఎంపీటీసీలకు వారి స్థాయి మేరకు […]

  • By: krs    latest    Sep 16, 2022 6:15 AM IST
కప్పల తక్కడైనా మునుగోడు: శుభే ఆన.. శ్యామ్‌ జాన
  • లక్షల ఆఫర్లతో పార్టీలు మారుతున్న స్థానిక ప్రజా ప్రతినిధులు
  • ఆయారామ్.. గయారామ్‌లతో పరేషాన్

విధాత, నల్లగొండ: సెప్టెంబర్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల పర్వం పార్టీల బలాబలాల కంటే ప్రలోభాల బలం పైనే సాగుతుండడంతో ఓటర్ల మొగ్గు ఎటు వైపు అన్నదాని కంటే ముందుగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జంపుజిలానీలుగా మారి పార్టీలు ఫిరాయిస్తున్న తీరుతో నియోజకవర్గంలో కప్పలతక్కెడ ఆట సాగుతుంది.

పార్టీ మారిన సర్పంచులకు, వార్డు సభ్యులకు, ఎంపీటీసీలకు వారి స్థాయి మేరకు 5 లక్షల నుంచి 20 లక్షల మేరకు ఆఫర్లు ఇస్తుండగా, మునుముందు ఆపరేషన్ ఆకర్ష్ ధరలు మరింత పెరగనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ, విపక్ష బీజేపీలు రెండు కూడా ఆర్థికంగా ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తూ ప్రత్యర్థి పార్టీల నుంచి జోరుగా వలసలను ప్రోత్సహిస్తుండటంతో పార్టీ ఫిరాయింపుల పర్వం నియోజకవర్గంలో నిత్య కృత్యమైంది.

ఈరోజు తాను చేరిన పార్టీ నుంచి దక్కిన ఆఫర్ కంటే ఇంకో పార్టీ ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేస్తే వెంటనే ఆ పార్టీలోకి మారుతున్న తీరుతో పోలింగ్ నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో గ్యారెంటీ ఇవ్వలేని ఆయారాం గయారామ్ సంస్కృతి నియోజకవర్గంలో కొనసాగుతుంది. ప్రధానంగా నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీల వలసల తంత్రం కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ సాగుతుంది.

ఆ పార్టీ సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలపైనే టీఆర్ఎస్, బీజేపీలు ఎక్కువ ఫోకస్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సంఖ్య ప్రస్తుతం వేళ్ళ మీద లెక్క పెట్టే స్థాయికి చేరుకుంది. గత సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆయా పార్టీలు గెలిచిన సంఖ్యకు ప్రస్తుతం ఆ పార్టీల వారీగా ఉన్న సర్పంచులు, ఎంపిటీసీల సంఖ్యకు ఎక్కడ పొంత లేని పరిస్థితి నెలకొంది. దీంతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి.

ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరిన వారు ఎన్ని రోజులు తమ పార్టీలో ఉంటారో చెప్పలేని గందర గోళం రాజకీయ పార్టీలలో కనిపిస్తుంది. ఇందుకు తాజా ఉదాహరణగా ఇటీవల మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన మాజీ సర్పంచ్ సాయంత్రం కల్లా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిపోయారు.

అలాగే మర్రిగూడలో రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన వారు మరుసటి రోజు కల్లా టీఆర్ఎస్‌లో చేరారు. మునుగోడు మండలం కిష్టాపురంలో టీఆర్ఎస్‌లో చేరిన ఎంపిటిసి మళ్లీ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ట్లుగా యూటర్న్ తీసుకున్నారు. చండూరు మండలం కొండాపురం టీఆర్ఎస్ సర్పంచ్ బీజేపీలో చేరి మళ్లీ టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు.

కంచర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్‌లో చేరిన కాల్వలపల్లి, కిష్టాపురం సర్పంచ్‌లు తాజాగా రాజీనామా ప్రకటించారు. చోల్లేడు సర్పంచ్ జనిగల మహేశ్వరి సైదులు తిరిగి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నట్లుగా ప్రకటించారు. అలాగే టీఆర్ఎస్‌లో చేరిన రావిగూడెం, జమస్తానపల్లి సర్పంచ్‌లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇంత అయోమయంగా సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పార్టీలు మారుతున్న తీరు నియోజక వర్గంలో రాజకీయ పార్టీల బలాబలాల సమీకరణలను వేగంగా మారుస్తున్నాయి. అసలు లీడర్లు పార్టీలు మారితే వారికి స్థానిక ఎన్నికల్లో ఓట్లేసిన ఓటర్లు కూడా పార్టీలు మారినట్లేనా అంటే ఆచరణలో అదంతా సాధ్యం కాని వ్యవహారమే.

వలసల పర్వంలో బిజీ బిజీ..!

మునుగోడు ఉప ఎన్నికల సంగ్రామాన్ని టీఆర్ఎస్ నుంచి మంత్రి జగదీష్ రెడ్డి గెలుపు సాధనకు అన్నీ తానై ప్రత్యర్థి పార్టీలకు ధీటైన వ్యూహాలతో ముందడుగు వేస్తున్నారు. ఆయన పర్యవేక్షణలోనే ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. నియోజకవర్గ పార్టీ ఇంచార్జీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే ఉప ఎన్నికల అభ్యర్థిగా భావిస్తుండటంతో ఆయన సైతం తన శక్తి మేరకు ఫిరాయింపుల ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను మొన్నటి దాకా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నుండి వీలైనంత ఎక్కువ మందిని బీజేపీలోకి రప్పించేందుకు భారీ ఆఫర్లతో వలసలను ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ఖరారు కావడంతో అమెపై అసంతృప్తిగా ఉండే వారిపైన టీఆర్ఎస్, బీజేపీ లు ఫోకస్ పెట్టాయి.

టీఆర్ఎస్, బీజేపీల నుంచి భారీ ఆఫర్లు రావడంతో కాంగ్రెస్ మెజార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు టీఆర్ఎస్ లేదా బీజేపీలో చేరి పోతున్నారు. ఆ పార్టీ కొత్త వారిని పార్టీలోకి రప్పించడం మాటేమో గాని ఉన్న వారిని కాపాడుకోలేక తంటాలు పడుతుంది. కాంగ్రెస్ కేడర్ చేజారిపోకుండా రేవంత్ రెడ్డి నేరుగా పర్యవేక్షణ చేస్తుండటంతో కొంత పార్టీ నుంచి వలసల ప్రవాహంకు అడ్డుకట్ట పడిందని భావిస్తున్నారు.

‘స్థానిక’ సంఖ్యా బలాబలాలు ఇవే!

గత గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 71 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ 38, కాంగ్రెస్ 22, సిపిఎం 5, సీపీఐ 3, బీజేపీ 2, ఇతరులు ఒక ఎంపీటీసీ స్థానం గెలుచుకున్నారు. 159 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాల్లో టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ 57, బీజేపీ 4, సీపీఎం 4, సీపీఐ 5 సర్పంచ్‌లను గెలుచుకుంది.

ప్రస్తుతం ఈ ‘స్థానిక’ సంఖ్యా బలాబలాల్లో అధికార టీఆర్ఎస్ బలాల్లో పెద్ద మార్పులు లేకపోయినా కాంగ్రెస్ నుంచి సాగిన వలసలతో బీజేపీ స్థానిక సంఖ్యా బలం మాత్రం పెరిగింది. ఆ మేరకు కాంగ్రెస్ బలహీన పడినట్లయింది. అయితే పైకి మాత్రమే కనిపించే ఈ స్థానిక ప్రజాప్రతినిధుల సంఖ్యా బలాన్ని నమ్ముకోకుండా కులాల వారీగా ఓటర్లను మచ్చిక చేసుకుంటూ గెలుపు సాధనకు ప్రధాన పార్టీలు వ్యూహా ప్రతి వ్యూహాలతో పోల్ మేనేజ్మెంట్‌తో జనంలోకి వెళుతున్నాయి.

అధికార టీఆర్ఎస్ పార్టీ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని నమ్ముకోగా, కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, సాంప్రదాయ ఓటర్లను నమ్మి ముందుకెలుతుంది. బీజేపీ కేంద్రంలో ని ప్రధాని నరేంద్రమోదీ పాలన పట్ల ప్రజాదరణను, టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక వర్గం ఓటర్లను, అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి సొంతంగా ఉన్న ప్రజాకర్షణపై ఆశలతో ఉప పోరులో పోరాడుతుంది.

అయితే ఏది ఎలా ఉన్న అంతిమ నిర్ణయం ఓట్లు వేసే ప్రజలదే. ప్రజా ప్రతినిధులు మారినంత మాత్రాాన ఓటర్లు మారరు కదా.. పైపెచ్చు వారిలానే ప్రవర్తిస్తారు. అంతేకాకుండా జనాలు చాలా తెలివితో ఉన్నారు అనుక్షణం జంపింగ్‌ రాయుళ్లను గమనిస్తూనే ఉంటారు. అఖరి రోజు తమ ఓటును వేయాల్సిన వారికే వేస్తారు. కాబట్టి మనం భేరాలు చేసి ఎంతమంది ప్రజాప్రతినిధులను కొన్నా చివరికి గెలవాల్సింది సామాన్యులను మాత్రమే. అప్పుడే ఏ పార్టీకైనా విజయం వరిస్తుంది.