అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ బొమ్మబొరుసు: జేపీ నడ్డా
అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ బొమ్మబొరుసు లాంటివని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.

- ధరణి, కాళేశ్వరం ప్రాజెక్టును దోచుకున్న కేసీఆర్
- బోధన్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
విధాత, నిజామాబాద్: అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ బొమ్మబొరుసు లాంటివని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. భూమి, సముద్రం, ఆకాశంలో అన్నింటా కాంగ్రెస్ అవినీతికి పాల్పడితే.. బీఆర్ఎస్ కు ధరణి పోర్టల్, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఏటీఎంగా మారిందని విమర్శించారు. సోమవారం బోధన్ లో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో నడ్డా మాట్లాడారు.
బోధన్ లో బీజేపీ అభ్యర్థి మోహన్ రెడ్డి విజయం ఖాయమైందన్నారు. బీఆర్ఎస్ ఉన్న చోట అవినీతి, అత్యాచారం రాజ్యమేలుతున్నాయని, బీఆర్ఎస్ అంటే భ్రష్టాచారి రాక్షసుల సమితిగా నడ్డా అభివర్ణించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అవినీతిపరుడంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ బంద్ చేస్తామని చెప్పారు.
మియాపూర్ భూములను దోచుకోవాలని కేసీఆర్ పన్నాగం పన్నాడన్నారు. దళిత బంధులో ముప్ఫై శాతం కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. దళిత వ్యతిరేకి సీఎం కేసీఆర్ అన్ని వర్గాల విరోధిగా మారారని అన్నారు. బీఆర్ఎస్ పెద్దలకు మాత్రమే పార్టీగా మారిందన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్ళీ రాష్ర్టంలో అవినీతి పేరుకుపోతుందని తెలిపారు.
మోడీ హయాంలో దేశం అభివృద్ధి లో పరుగిడుతూ, వచ్చే రెండేళ్లలో ప్రపంచ మూడో ఆర్థిక వ్యవస్థగా రూపొందుతున్నట్లు చెప్పారు. మొబైల్ రంగంలో చైనా నుంచి భారత్ అభివృద్ధి దిశగా సాగుతుండగా, అన్ని రంగాల్లోనూ దేశం దూసుకుపోతున్నదన్నారు. బీఆరెస్ పాలనలో డబుల్ బెడ్ రూం పథకం పూర్తి స్థాయిలో అటకెక్కగా, ఉద్యోగులకు జీతాలు లేని దుస్థితిలో అన్ని రంగాల్లో అవినీతి పెరిగిందని ధ్వజమెత్తారు.
బీజేపీని గెలిపిస్తే రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పించి, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. బీబీ నగర్ లో ఎయిమ్స్ కడుతున్నమని, రైతులకు ధాన్యం కొనుగోలులో బోనస్ తో కలిపి రూ.3100 ధర చెల్లింపు, ఎరువుల్లో సబ్సిడీ, విద్యార్థులకు లాప్ టాప్ లు ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆరెస్ పాలనలోని అన్ని పథకాల్లో అవినీతిపై విచారణ జరిపి, జైలుకు పంపిస్తామన్నారు.