Julie Bundock | చిన్న తప్పిదం, భారీ మూల్యం.. రూ.24 కోట్ల ఇల్లు బుగ్గిపాలు..!

Julie Bundock | చిన్న తప్పిదం, భారీ మూల్యం.. రూ.24 కోట్ల ఇల్లు బుగ్గిపాలు..!

Julie Bundock : ఒక్కోసారి మనం చేసే చిన్నచిన్న తప్పిదాలకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తాజాగా ఆస్ట్రేయాలోని సిడ్నీ నగరంలో జరిగిన ఘటనే అందుకు ఉదాహరణ. ఇంటి స్టోర్‌ రూమ్‌లో లైట్‌ ఆఫ్ చేయడం మరిచిపోయిన పాపానికి ఆ స్టోర్‌ రూమ్‌లోని ఫర్నీచర్‌కు మంటలు అంటుకుని ఏకంగా రూ.24 కోట్ల విలువైన ఇల్లు పూర్తిగా తగులబడి పోయింది. అంతా చూస్తుండగానే కొన్ని నిమిషాల్లోనే అది బుగ్గిపాలైంది.

వివరాల్లోకి వెళ్తే.. జూలీ బండోక్ అనే మహిళ సిడ్నీ నగరంలో రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పనిచేస్తోంది. మంగళవారం ఆమె స్థానికంగా ఉన్న అవలోన్‌ బీచ్ సమీపంలో ఖాళీగా ఉన్న ఓ ఖరీదైన ఇంట్లో తన వాటాను పరిశీలించేందుకు వెళ్లింది. ఆ సమయంలో బాల్కనీలో ఆమెకు ఒక పరుపు కనిపించింది. తన వాటాలో అంతకుముందు అద్దెకున్నవాళ్లు దాన్ని మర్చిపోయి ఉంటారని భావించి.. బెడ్‌ రూమ్‌ కింద ఉన్న స్టోర్‌ రూమ్‌లో దాన్ని దాచింది.

ఆ సమయంలో స్టోర్‌ రూమ్ లైట్‌ వేసిన జూలీ బయటికి వచ్చేటప్పుడు దాన్ని ఆఫ్‌ చేయడం మర్చిపోయింది. బయట ఉన్న పరుపును స్టోర్‌ రూమ్‌లో వేయడం, స్టోర్‌ రూమ్‌లో లైట్ ఆఫ్‌ చేయకపోవడం జూలీ చేసిన తప్పిదాలు. ఈ చిన్న తప్పిదాలే ఆమె కొంపకు కొరివిపెట్టాయి. కోట్ల రూపాయల ఇంటిని బూడిద చేశాయి. అయితే ఇంట్లో మంటలు చెలరేగగానే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఈ ఘటనపై బిల్డింగ్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్టోర్‌ రూమ్‌లో మంటలు చెలరేగడంతోనే ఇల్లంతా తగులబడినట్లు వారి దర్యాప్తులో తేలింది. స్టోర్‌ రూమ్‌లో లైట్‌ ఎక్కువ సేపు వేసి ఉంచడంవల్ల రూమ్‌ వేడెక్కి పరుపులో మంటలు చెలరేగాయని, ఆ మంటలే ఇల్లంతా తగులబడిపోవడానికి కారణమయ్యాయని నిర్ధారించారు. స్టోర్‌ రూమ్‌లో లైట్‌ వేసి ఇల్లు కాలిపోవడానికి కారణమైన జూలీని అరెస్ట్‌ చేశారు. ప్రమాదానికి కారణమైన జూలీనే.. ఆ ఇంట్లోని మిగతా వాటాదారులైన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.