Kanchi Narasimha Rao | పేరు తెలియదు కానీ.. ఈయన చేసిన పాత్ర చూస్తే దండం పెట్టేస్తారు
Kanchi Narasimha Rao | విధాత: కొన్నిసార్లు ఒకరి జీవితంలోకి ఇంకొకరు ఎందుకు వస్తారో తెలియకుండానే వచ్చేస్తారు. అలా వచ్చేవారు గుర్తింపు కోరుకోరు. అలాగే సినిమాలలో కూడా కొన్ని సార్లు చిన్న చిన్న పాత్రలు సినిమాపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ పాత్ర చేసింది ఎవరనే విషయం తెలియకపోయినా.. ఆ పాత్ర ప్రభావం మాత్రం ప్రేక్షకులపై ఎప్పుడూ ఉంటుంది. అలాంటి పాత్రే 1957లో వచ్చిన ‘మాయాబజార్’ సినిమాలో ఓ నటుడు చేశారు. ఆ నటుడు పేరు కూడా […]

Kanchi Narasimha Rao |
విధాత: కొన్నిసార్లు ఒకరి జీవితంలోకి ఇంకొకరు ఎందుకు వస్తారో తెలియకుండానే వచ్చేస్తారు. అలా వచ్చేవారు గుర్తింపు కోరుకోరు. అలాగే సినిమాలలో కూడా కొన్ని సార్లు చిన్న చిన్న పాత్రలు సినిమాపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ పాత్ర చేసింది ఎవరనే విషయం తెలియకపోయినా.. ఆ పాత్ర ప్రభావం మాత్రం ప్రేక్షకులపై ఎప్పుడూ ఉంటుంది.
అలాంటి పాత్రే 1957లో వచ్చిన ‘మాయాబజార్’ సినిమాలో ఓ నటుడు చేశారు. ఆ నటుడు పేరు కూడా ఎవరికీ తెలియదు.. కానీ ఆయన వేసిన పాత్ర, ఆ పాత్ర వచ్చే సన్నివేశం ‘మాయాబజార్’ సినిమాకి ఎంతో కీలకం అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇంతకీ ఆ పాత్ర ఏదని అనుకుంటున్నారా?
శశిరేఖ శయన మందిరం కోసం ఘటోత్కచుడు వెతుకుతూ.. అక్కడ దారికి అడ్డంగా కనిపించిన వృద్ధ బ్రాహ్మణుడిని చూస్తాడు. అప్పుడా బ్రాహ్మణుడు నన్ను లేపి పక్కన కూర్చోబెడితే ఆమె జాడ తెలుపుతానని అంటాడు. ఘటోత్కచుడు తన శక్తితో ప్రయత్నిస్తాడు కానీ అది అతనికి సాధ్యం కాదు.
అప్పుడు బ్రాహ్మణుడు నవ్వుతూ.. ‘చిన మాయ పెదమాయ.. పెదమాయ పెనుమాయ.. అటు స్వాహా.. ఇటు స్వాహ.. ఎరుగకుండ వచ్చావు.. ఎరుకలేకపోతావు.. ఇదే వేదం.. ఇదే వేదం.. చిరంజీవ చిరంజీవ.’ అంటూ ఓ శ్లోకం చెబుతాడు. ఈ సీన్ సినిమాకి ఎంత ప్రాణమో.. ఆ సీన్ ఎంత ప్రభావమో.. ఈ మధ్య వచ్చిన ‘గోపాల గోపాల’ సినిమా చూసిన వారికి కూడా అర్థమవుతుంది.
అయితే ఘటోత్కచుడు పాత్రధారి అప్పటికే ఫేమస్ కాబట్టి ఆయన ఇప్పటికీ గుర్తున్నాడు. కానీ ఆ బ్రాహ్మణుడి పాత్ర పోషించిన అతను మాత్రం ఎవరికీ తెలియదు. అలా ఉంటాయి.. సినిమాలైనా, జీవితాలైనా. ఇంతకీ ఆ పాత్రధారి పేరు చెప్పలేదు కదా.. కంచి నరసింహారావు.
1934 నుంచి ఈయన సినిమాల్లో కొనసాగుతున్నారంటే ఎవరూ నమ్మరు. కానీ ఇది నిజంగా నిజం. 1935లో వచ్చిన ‘హరిశ్చంద్ర’ సినిమాలో ఆయన కాల కౌశికుడిగా.. ఆ తరువాత ఏవీఎం వారు తీసిన ‘జీవితం’ అనే సినిమాలో, 1955లో వచ్చిన ‘దొంగరాముడు’ చిత్రంలోనూ ఆయన నటించారు.
ఇలా చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన వారు అప్పట్లో.. పాత్రకు ప్రత్యేకత ఉండాలని కానీ, నిడివి ఉన్న పాత్రలే చేయాలని కానీ ఎవరూ అనుకునేవారు కాదు. ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం రావడమే అదృష్టంగా భావించేవారు. ఇక సినిమా విడుదలయ్యాక తెరమీద కనిపించగానే గొప్పగా చెప్పకుని మురిసిపోయేవారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించడాన్ని అవార్డులా భావించిన వారూ ఉన్నారు.