విధాత: ఏపీ రాజకీయాల మీద బిజెపి గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది… త్వరలోనే పార్టీ మారతారని.. జనసేనలో చేరతారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితులు చక్క దిద్దేందుకు అధిష్టానం చర్యలు చేప్పట్టింది. ఆయన్ను పార్టీ మారకుండా ఉంచేందుకు ఆయనతో చర్చలు జరపాలని నిర్ణయించింది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన కాపు నేత కన్నా లక్ష్మీనారాయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కేబినెట్లో మంత్రిగా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం తరువాత ఆయన బీజేపీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడైన తరువాత ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు జనసేనలో చేరాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అధిష్టానం రంగంలోకి దిగిందని సమాచారం.
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వంటి వారు వేరే పార్టీల వైపు చూస్తున్నారని టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నాకు బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ ప్రకాష్ ఫోన్ చేశారని చెబుతున్నారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలు, జనసేన టీడీపీ పొత్తు వార్తలు తదితరాలపై కన్నాను ఆరా తీసినట్టు తెలుస్తోంది.
ఈ సందర్బంగా కన్నా లక్ష్మీనారాయణ తాను పార్టీ మారడం లేదని.. మీడియానే ఇలా ప్రచారం చేస్తోందని శివ ప్రకాష్ జీ దృష్టికి తెచ్చినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 27న తనతో విజయవాడలో భేటీ కావాలని శివ ప్రకాష్ జీ.. కన్నా లక్ష్మీనారాయణకు సూచించినట్టు సమాచారం. అక్కడ కన్నా తన అభిప్రాయాన్ని వినిపిస్తారని అంటున్నారు.