Karimnagar | చెక్ డ్యాం ముసుగులో ఇసుక దందా.. మానేరులో మాయ

Karimnagar మైనింగ్ రూల్స్ అర్థం మార్చేశారు నిర్మాణమే జరుగని చెక్ డ్యాములు పూడిక తీత పేరుతో ఇసుక రవాణా కోట్లు కొల్లగొట్టడానికి సులభ మార్గం పర్యావరణ నిబంధనలకూ తూట్లు విధాత, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై దందా నడిపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రూపొందించుకున్న […]

  • Publish Date - June 3, 2023 / 04:16 PM IST

Karimnagar

  • మైనింగ్ రూల్స్ అర్థం మార్చేశారు
  • నిర్మాణమే జరుగని చెక్ డ్యాములు
  • పూడిక తీత పేరుతో ఇసుక రవాణా
  • కోట్లు కొల్లగొట్టడానికి సులభ మార్గం
  • పర్యావరణ నిబంధనలకూ తూట్లు

విధాత, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై దందా నడిపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రూపొందించుకున్న ఇసుక విధానం గాలికి కొట్టుకు పోతున్నాయని, రాత్రికి రాత్రే గులాబీ నేతల అనుయాయులు టన్నుల కొద్దీ ఇసుకను తరలించేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

లక్ష్యం మారిపోయిన చెక్‌డ్యామ్‌లు

వృథాగా పోతున్న నీటిని నిల్వ చేయడం, తద్వారా భూగర్భ జలాలు పెంపొందేలా చూడటం, మత్స్య సంపదను అభివృద్ధి చేయడం చెక్ డ్యాంల నిర్మాణ లక్ష్యం. అయితే ఆ లక్ష్యానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో చెక్ డ్యాంల నిర్మాణానికి నాబర్డ్ సుమారు 2000 కోట్లు కేటాయించింది.

వాటి నిర్మాణం, పనితీరుపై ఆ సంస్థ నిరంతర పర్యవేక్షణను దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం నాబర్డ్ నిధులన్నింటినీ ఇసుకకు ఆస్కారం లేని ప్రాంతాలలో చెక్ డ్యాముల నిర్మాణానికి ఉపయోగించిందని, ఇసుక తీయడానికి ఆస్కారం ఉన్న మానేరు తీరం మొత్తం మీద సొంత నిధులతో చెక్ డ్యాములు ప్రారంభించిందని ఆరోపణలు ఉన్నాయి.

మానేరు నదిపై..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు నదిపై 21 చెక్ డ్యాముల నిర్మాణానికి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఒక్కో చెక్ డ్యామ్ 13 నుండి 18 కోట్ల అంచనాలతో నిర్మించేందుకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించింది.

చేగుర్తి, గొల్లపల్లి, నీరుకుల్ల, గట్టెపల్లి, కదంబాపూర్, తొగర్రాయి, గుండ్లపల్లి, కనగర్తి, మడక, పొత్కపల్లి, రూప్ నారాయణపేట, ఇందుర్తి, గుంపుల, పోచంపల్లి, కిష్టంపేట, మొట్లపల్లి, ముత్తారం, ఓడేడు, అడవి శ్రీరాంపూర్, ఖమ్మం పల్లి చిన్న ఓదాల తదితర గ్రామాల సమీపంలో మానేరు నదిపై వీటిని నిర్మించాల్సి ఉంది.

మడకకోర్కల-కోర్కల్, కిష్టంపేట- వావిలాల మధ్య నిర్మించిన రెండు చెక్ డ్యాములు నిర్మాణం పనులు పూర్తి చేసుకున్న కొద్ది రోజులకే కొట్టుకుపోయాయి. చేగుర్తి- లింగాపూర్, నీరుకుల్ల-వేగురుపల్లి మధ్య నిర్మించిన చెక్ డ్యాములు మాత్రమే ఉపయోగంలో ఉండగా, మిగిలిన వాటిలో కొన్ని ప్రారంభానికి నోచుకోకపోగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.

నిబంధనలు ‘దారి’మళ్లించి!

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పర్యావరణ, అటవీ శాఖ దేశమంతటికీ వర్తించేలా ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మానిటరింగ్ గైడ్ లైసెన్సెస్ ఫర్ శాండ్ మైనింగ్’ పేరిట మార్గదర్శకాలు రూపొందించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్‌, దేశంలోని వివిధ కోర్టులలో వ్యాజ్యాల సందర్భంగా వెలువడిన తీర్పులను అనుసరించి వీటిని రూపొందించారు. కేంద్ర పర్యావరణ శాఖ సూచనలు, నిబంధనలకు అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఇసుక విధానాలను రూపొందించుకున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం జీవో ఎంఎస్ 38 ద్వారా 2014 డిసెంబర్ 12న న్యూ సాండ్ మైన్ పాలసీ రూపొందించుకుంది. జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్, పంచాయితీ అధికారి, భూగర్భ జల శాఖ అధికారి, నీటిపారుదల శాఖ అధికారి, గ్రామీణ నీటి సరఫరా అధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి, మైన్స్ అండ్ జియాలజీ అధికారుతో జిల్లా స్థాయిలో ఇసుక నిర్వహణ అనుమతులు ఇచ్చే కార్యనిర్వాహక వ్యవస్థ ఏర్పడింది.

ఇక్కడే ప్రభుత్వం తన ప్రణాళిక అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నదని ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారు చెబుతున్నారు. ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ మంథని (డివిజన్ నెంబర్ 4) కార్యనిర్వాక ఇంజినీర్ మానేరు నదిపై చెక్ డ్యాముల వద్ద ఇసుక రవాణాకు ఈఈ/ఐడీఎన్‌వో4 / ఎంఎస్‌టీ/ డీబీ/ హెచ్‌డీ/ 109/1/ఎం లేఖ ద్వారా 2021 జులై 25న ఇసుక లభ్యతకు నోటిఫై చేశారు.

2021 అక్టోబర్ 5న జిల్లా కలెక్టర్ నోట్ మేరకు నీటిపారుదల అధికారి సుబ్బరామిరెడ్డి, టీఎస్ఎండీసీ అధికారి జగన్మోహన్ రెడ్డి, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ పరశురాములు, భూగర్భ జల శాఖ అధికారి బీ ఉమాదేవి, రెవెన్యూ శాఖ నుండి రాజేశ్వరరావు జాయింట్ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించారు. ఐదు హెక్టార్లకు మించిన ప్రదేశంలో ఇసుక తీయడానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి. ఇందులోనూ పర్యావరణ, హైడ్రాలజికల్, సోషల్ ఇంపాక్ట్, ఆర్థిక అభివృద్ధి అంశాల పరిశీలన తప్పనిసరి.

పెద్దపల్లి జిల్లా అధికారులు సర్వే రిపోర్ట్ తయారీలోనే ప్రభుత్వ అంతర్గత ఆలోచనలు అమలు చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూడికతీత అనే పదాన్ని వక్రీకరించి తమ నివేదికకు అనుకూలంగా మలుచుకున్నారని ఉద్యమకారులు చెబుతున్నారు.

పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టినట్టు..

నిర్మాణం పనులు పూర్తి చేసుకొని వాడుకలో ఉన్న చెక్ డ్యామ్‌లలో పూడిక పేరుకు పోతే పర్యావరణ అనుమతులు అవసరం లేదనే, నిబంధనను సాకుగా తీసుకొన్నారని విమర్శలు వెల్లువెత్తాయి. మానేరు నదిపై మొత్తం 21 చెక్ డ్యాముల నిర్మాణానికి అనుమతులు రాగా, అవన్నీ పూర్తయినట్టుగానే చూపారని, అందులో పూడిక తీత ముసుగులో ఇసుక రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అంటున్నారు. చెక్ డ్యాముల నిర్మాణాలే జరగనప్పుడు వాటిలో నీటి నిలువ ఎక్కడ? పూడికలు ఎక్కడ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నిర్మాణం పూర్తి చేసుకున్న నాలుగింటిలో రెండు మాత్రమే ఉపయోగంలో ఉండగా, కోర్కల్, మడక చెక్ డ్యాములు ఎప్పుడో కొట్టుకుపోయాయి. అయినప్పటికీ వీటన్నింటిలో ఇసుక లభ్యతను అంచనా వేసి, తదుపరి కార్యక్రమాన్ని అధికారులు ఆగమేఘాల మీద జరిపించారని పలువురు ఆరోపిస్తున్నారు.

భూగర్భ జలాల మాటేమిటి?

ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు రెండు నుండి రెండున్నర మీటర్ల లోతులో ఉన్నాయని భూగర్భ జల శాఖ పేర్కొంది. ఆ స్థాయికి మించి ఇసుక తీయడానికి ఆస్కారమే లేదు. ఒకవేళ అలా జరిగితే సమీప గ్రామాల భూగర్భ జలాలపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది.

వాస్తవానికి మానేరు ప్రవాహం సాగు భూముల కన్నా మూడు నుండి ఐదు మీటర్ల లోతున ఉంది. అంటే మానేరులో నీటి లభ్యత ఒక మీటర్ లోతులోనే. ఇక్కడ రెండు నుండి రెండున్నర మీటర్ల లోతులో ఇసుక తీస్తే భూగర్భ జలాలు పడిపోవడం ఖాయం.

చెక్ డ్యాములపై ఇసుక పరిణామం కోసం జరిపిన సర్వే, టెండర్లను ఆహ్వానించే సమయంలో తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకునే ప్రయత్నం చేయలేదని సంబంధిత గ్రామాల ప్రజలు అంటున్నారు. టెండర్ల దశలో లిఖితపూర్వకంగా ఇచ్చిన అభ్యంతరాలను సైతం అధికారులు తుంగలో తొక్కారని చెబుతున్నారు.

తమ అభిప్రాయాలను జాయింట్ ఇన్‌స్పెక్షన్‌ రిపోర్టులో పొందుపరచలేదని పేర్కొంటున్నారు. జాయింట్ ఇన్‌స్పెక్షన్‌ అన్నది ఓ ప్రహసనంలా కొనసాగిందని చెబుతున్నారు. వెనువెంటనే జిల్లాస్థాయి సాండ్ కమిటీ ఇసుక తీయడానికి నిర్ణయం తీసుకొని మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ప్రతిపాదన పంపింది.

ఈ నివేదిక ఆధారంగా మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ సంబంధిత రీచ్‌లలో ఇసుక తీయడానికి 2022 జనవరి 11న టెండర్ ప్రకటన జారీ చేసింది. వెనువెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, కాంట్రాక్టర్ల ద్వారా అగ్రిమెంట్ చేసుకుని వర్క్ ఆర్డర్లు ఇచ్చేసింది. 2022 మార్చి మొదటి వారం నుంచి కాంట్రాక్టర్లు ఈ 19 ఇసుక రీచ్ నుంచి ఇసుక రవాణా ప్రారంభించారు.

తెలంగాణ స్టేట్ మైనింగ్ రూల్స్ 2015 కు విరుద్ధంగా, చెక్ డ్యాముల నిర్మాణం జరగకముందే, నీటి లభ్యత, ఇసుక మేటలు లేక ముందే యథేచ్ఛగా మేటల పేరిట ఇసుక కొల్లగొట్టడం ప్రారంభమైందని విమర్శలు వినిపిస్తున్నాయి.

తవ్వకాల ద్వారా వచ్చింది ఇంత

పెద్దపల్లి జిల్లాలోని 19 ఇసుక రీచ్‌ల ద్వారా 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక రవాణా చేశారు. టీఎస్ఎండీసీ రికార్డులు ఇదే విషయాన్ని ధ్రువ పరుస్తున్నాయి.

అక్రమంగా తరలించింది మరెంతో!

రికార్డుల మేరకు జరిగిన వ్యాపారం ద్వారానే 168 కోట్ల 75 లక్షలు సమకూరగా, ఇందులో కాంట్రాక్టర్లకు సరాసరి మెట్రిక్ టన్నుకు 82 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన వారికి 35 కోట్ల 25 లక్షలు దక్కిందని సమాచారం.

ఇందులో ప్రభుత్వానికి చెందిన వాటా 133 కోట్ల 49 లక్షలు. ఇందులో నుండి గ్రామపంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్ కు 25:50:25 శాతం వాటా సెస్ కింద చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే మినరల్ సెస్ సంస్థలకు ఇప్పటి వరకు చెల్లించిన దాఖలాలు లేవని అంటున్నారు.

మానేరుకు రెండో వైపూ ఇదే తతంగం

మానేరు నదికి రెండోవైపు కూడా ఇలాంటి తతంగమే జరుగుతున్నదని ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా పరిధిలోకి వచ్చే 11 ఇసుక రీచ్ లలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

పోరాటం చేస్తున్న మానేరు పరిరక్షణ సమితి

పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలలో ఇసుక అక్రమ రవాణాపై మానేరు నది పరిరక్షణ సమితి అలుపెరుగని పోరాటం సాగిస్తోంది. ఈ సంస్థ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పలుమార్లు ఎస్జీటీని ఆశ్రయించారు. ఫలితంగా పెద్ద పెళ్లిలో 19 ఇసుక రీచ్ లలో తవ్వకాలను ఎస్జీటీ నిలిపివేసింది.

కరీంనగర్ పరిధిలోని 11 ఇసుక రీచ్ లలో ఐదింటిలో ఇసుక తవ్వకాలు ప్రారంభం కాగా, తవ్వకాలు నిలిపివేస్తూ 2023 ఏప్రిల్ నెలలో ఎస్జీటీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటికే తవ్విన 50 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలకు సంబంధించి అధికారుల నుండి స్పష్టత లేదు.