Karimnagar
విధాత బ్యూరో, కరీంనగర్: కోడలికి అబార్షన్ చేసిన డాక్టర్ ని ఉతికి ఆరేశారు ఆ అత్తమామలు. కరీంనగర్ నడిబొడ్డున అబార్షన్స్ కు కేరాఫ్ గా తయారైన శ్రీసాయి ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలోనూ ఈ ఆసుపత్రిలో జరుగుతున్న అబార్షన్లపై పలు ఫిర్యాదులందడంతో.. అప్పటి డీఎంహెచ్వో రాజేశం సీజ్ చేసిన దాఖలాలున్నాయి.
ధర్మారం మండలం బంజరుపల్లికి చెందిన స్వాతి అనే మహిళ సోమవారం శ్రీసాయి హాస్పిటల్ కు అబార్షన్ కోసం వచ్చింది. సదరు మహిళ భర్త పవన్ కళ్యాణ్ మరో అమ్మాయితో వెళ్లిపోగా.. స్వాతి పేరిట భర్త ఆస్తులను రిజిస్ట్రేషన్ చేశారు. భర్త విడిచి వెళ్లే నాటికి స్వాతి గర్భవతి. అయితే కోడలిని అబార్షన్ చేయించుకోవద్దని అత్తమామలు నచ్చ చెబుతూ వస్తున్నారు.
తమ కొడుకు ఎప్పుడో ఓసారి తిరిగి రాక తప్పదని ఆమెకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, భర్త లేకుండా పిల్లల్ని కనడంపై సందేహించిన స్వాతి.. కరీంనగర్ ముకరంపురలోని శ్రీసాయి హాస్పిటల్ ను సంప్రదించింది. ఈ విషయం తెలుసుకున్న స్వాతి అత్తమామలు ఆ క్లినిక్ నడుపుతున్న డాక్టర్ అబార్షన్ చేసిందంటూ స్వాతి అత్తమామలు స్వాతితో పాటు.. డాక్టర్ రాధను కూడా చితకబాదారు. చీపుర్లు, రాళ్లతో ఇరువురిపై దాడికి దిగారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు సదరు మహిళా వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు.