Karnataka Elections | ‘ఐక్య ప్రతిపక్షం’.. ఏర్పాటు ప్రక్రియ వేగవంతం
Karnataka Elections | విధాత: సుమారు 40 రోజుల హోరాహోరీ ప్రచారం తర్వాత నిన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Elections) పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా మొత్తం 224 స్థానాలకు జరిగిన ఎన్నికలు ప్రశాతంగా ముగిశాయి 72 శాతం పోలింగ్ నమోదైంది. ఈనెల 13న ఎన్నికల ఫలితాలు వెలువనున్నాయి. గెలుపుపై పార్టీల నేతలు ఎవరికి లెక్కల్లో వారు ఉన్నారు. హోరాహోరీ పోటీలో ప్రచార సమయంలో చివరి పదిరోజులు ప్రజాసమస్యలు, ప్రగతి కంటే ఉద్వేగాల చుట్టూ […]

Karnataka Elections |
విధాత: సుమారు 40 రోజుల హోరాహోరీ ప్రచారం తర్వాత నిన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Elections) పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా మొత్తం 224 స్థానాలకు జరిగిన ఎన్నికలు ప్రశాతంగా ముగిశాయి 72 శాతం పోలింగ్ నమోదైంది. ఈనెల 13న ఎన్నికల ఫలితాలు వెలువనున్నాయి. గెలుపుపై పార్టీల నేతలు ఎవరికి లెక్కల్లో వారు ఉన్నారు.
హోరాహోరీ పోటీలో ప్రచార సమయంలో చివరి పదిరోజులు ప్రజాసమస్యలు, ప్రగతి కంటే ఉద్వేగాల చుట్టూ బీజేపీ ప్రచారాన్నిమార్చింది. దీంతో కులం, మతం, భావోద్వేగాలతో లబ్ధి పొందాలని ఆపార్టీ నేతలు భావించారు. అయితే పోలింగ్ అనంతరం వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్ కాంగ్రెస్ పార్టీకే అధిక స్థానాలు కట్టబెట్టడమే కాదు, నిరుద్యోగం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నికల్లో ప్రభావం చూపినట్టు విశ్లేషించాయి.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇలా ఉండగా.. కొన్నిరోజులుగా జాతీయ స్థాయిలో మరో పరిణామం చోటు చేసుకున్నది. కాంగ్రెస్ లేకుండా బీజేపీ యేతర ప్రత్యామ్నాయ కూటమి సాధ్యం కాదని ఎన్సీపీ, డీఎంకే, జనతాదళ్, శివసేన (ఉద్ధవ్‌ఠాక్రే) తేల్చిచెప్పిన దానికి అనుగుణంగా నితీశ్ విపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తున్నారు. నితీశ్ ఇప్పటికే చాలామంది ప్రాంతీయ పార్టీ అధినేతలతో ఈ విషయంపై చర్చించారు. మొన్న ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, నిన్న హేమంత్ సోరెన్‌తో భేటీ అయ్యారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ‘ఐక్య ప్రతిపక్షం’ ఏర్పాటు దిశగా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన భేటీ అయిన అందరీతోనూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విపక్షాల మధ్య అనైక్యత వల్లనే బీజేపీ లబ్ది పొంతున్నదని కాబట్టి ఓటు బ్యాంకు చీలి పోకుండా బీజేపీతో ముఖాముఖి పోటీ ఉండేలా అందరం ఏకతాటిపైకి రావాలని సూచిస్తున్నారు. అప్పుడే బీజేపీని నిలువరించడం సాధ్యపడుతుందని నితీశ్‌కుమార్ చెబుతున్నారు.
ఈ ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలపై కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుంది అంటున్నారు. దీంతోపాటు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ‘ఐక్య ప్రతిపక్షం’ ఏర్పాటు ప్రక్రియ మరింత వేగవంతం కావొచ్చు.
ఈ కూటమిలోకి మరిన్ని ప్రాంతీయ పార్టీలు చేరవచ్చు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ వాటికి మద్దతు ఇవ్వడం, కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉన్న స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి నడవడం వంటి అంశాలపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నది. ఇది జరిగితే రానున్న రోజుల్లో కమలం పార్టీకి కష్టాలు తప్పవు అనే వాదనలు వినిపిస్తున్నాయి.