Karnataka Elections 2023 | కర్ణాటకలో ప్రచారానికి నేటితో తెర!

సర్వశక్తులు ఒడ్డిన ప్రధాన పార్టీలు పాతమైసూర్‌ ప్రాంతం సీట్లపై బీజేపీ వ్యూహరచన బీజేపీని గద్దె దింపి 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు దారులు వేయాలని కదిలిన కాంగ్రెస్‌ హంగ్‌పైనే ఆశలు పెట్టుకున్న జేడీఎస్‌ విధాత‌: సుమారు నెలన్నరగా జరుగుతున్న కర్ణాటక ఎన్నికల ప్రచారం (Karnataka Elections 2023) నేటితో తెరపడనున్నది. మార్చి 29న ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే అలావాటు ఉన్న […]

Karnataka Elections 2023 | కర్ణాటకలో ప్రచారానికి నేటితో తెర!
  • సర్వశక్తులు ఒడ్డిన ప్రధాన పార్టీలు
  • పాతమైసూర్‌ ప్రాంతం సీట్లపై బీజేపీ వ్యూహరచన
  • బీజేపీని గద్దె దింపి 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు దారులు వేయాలని కదిలిన కాంగ్రెస్‌
  • హంగ్‌పైనే ఆశలు పెట్టుకున్న జేడీఎస్‌

విధాత‌: సుమారు నెలన్నరగా జరుగుతున్న కర్ణాటక ఎన్నికల ప్రచారం (Karnataka Elections 2023) నేటితో తెరపడనున్నది. మార్చి 29న ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే అలావాటు ఉన్న కర్ణాటకలో వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టి 38 ఏళ్ల చరిత్రను తిరగరాయాలని కమలనాథులు భావిస్తున్నారు.

బీజేపీని గద్దె దింపి కన్నడనాట కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు దారులు వేయాలని కాంగ్రెస్‌ యోచిస్తున్నది. ఒకవేళ హంగ్‌ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో కింగ్‌ మేకర్‌ కావాలని జేడీఎస్‌ ఆలోచన చేస్తున్నది.

ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ ముందుగానే ప్రచారం మొదలుపెట్టింది. బీజేపీ, జేడీఎస్‌లు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే.. ఓటర్లను ఆకట్టుకోవడానికి అనేక హామీలను గుప్పించాయి. ప్రచారానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో నేతలు చివరి ప్రయత్నంగా రంగంలోకి దిగారు.

ప్రధాని అన్నీ తానై ముందుండి ప్రచారం

బీజేపీ తరఫున ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ప్రచారం చేశారు. ప్రధాని అన్నీ తానై ముందుండి ప్రచారాన్ని నడిపించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌, కేంద్ర ప్రభుత్వ పథకాలే ప్రచారాస్త్రాలుగా బీజేపీ ప్రచారం చేసింది. ప్రధానంగా గత నెల 29వ తేదీ నుంచి ప్రధాని తన సుడిగాలి పర్యటనతో కర్ణాటక మొత్తం చుట్టారు. 18 భారీ బహిరంగసభలు, 6 రోడ్‌ షోలు నిర్వహించారు.

2008, 2018 లో బీజేపీకి ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో ఈసారి ఆ అవకాశం ఇవ్వాలని ప్రధాని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రధాని కర్ణాకటలో 7సార్లు పర్యటించారు. కేంద్ర మంత్రి అమిత్‌ షా కూడా కర్ణాటకలో విస్తృతంగా పర్యటించారు.

జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, జై శంకర్‌, స్మృతి ఇరానీ, నితిన్‌ గడ్కరీ తదితర నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసారి 150 సీట్లే టార్గెట్‌గా.. ముఖ్యంగా బెంగళూరుతో కలిపి 89 సీట్లు ఉన్న పాత మైసూర్‌ ప్రాంతంలో పాగావేయాలని బీజేపీ వ్యూహ రచన చేసింది.

150 స్థానాలే గెలుపే లక్ష్యం హస్తం పార్టీ

కర్ణాటకలో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి తేవడం ద్వారా పార్టీకి పూర్వవైభవం తేవాలని ఆ పార్టీ నేతలు పనిచేశారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి, బీజేపీ కొంతమంది సీనియర్‌ నేతలను పక్కనపెట్టడం వంటి అంశాలను తనకు అనకూలంగా మలుచుకుని కర్ణాటకలో కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలని భావిస్తున్నది.

కర్ణాటకలో విజయం ద్వారా ఈ ఏడాది చివరలో జరిగే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని యోచిస్తున్నది. పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మాజీ సీఎం సిద్ధరామయ్య, టీపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విస్తృత ప్రచారం నిర్వహించారు.

ముఖ్యంగా ప్రధాని విమర్శలకు రాహుల్‌, ప్రియాంకలు ధీటుగా స్పందించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. బీజేపీ ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను ఎత్తిచూపుతూ… ప్రచారం నిర్వహించారు.

ప్రచార గడువు ముగుస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రంగంలోకి దిగారు. శనివారం హుబ్బళ్లిలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సొంతరాష్ట్రం కావడంతో ఇక్కడ పార్టీ గెలుపు చాలా కీలకం కానున్నది. ఈ ఎన్నికల్లో 150 స్థానాలు గెలువాలని హస్తం పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది.

జేడీఎస్‌కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య

ఈ ఎన్నికలు జేడీఎస్‌కు కూడా జీవన్మరణ సమస్య. ఇప్పటివరకు కింగ్‌ మేకర్‌గా ఉన్న ఆపార్టీ మనుగడకు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ఈసారి హంగ్‌ ఏర్పడే అవకాశం లేదని ఇప్పటికే సర్వేలు తేల్చి చెప్పాయి. కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఆ సర్వల సారాంశం. అయితే ఒకవేళ హంగ్‌ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్‌ కీలకం కానున్నది. పార్టీలో చీలికలు, అంతర్గత కలహాలు, కుటుంబపార్టీ అనే విమర్శల మధ్య జేడీఎస్‌ ప్రచారం చేసింది.

మాజీ సీఎం కుమారస్వామి అంతా తానై ప్రచార బాధ్యలను తన భుజంపై వేసుకున్నారు. గతం కంటే ఎక్కువ సీట్లు సాధించాలనుకుంటున్న జేడీఎస్‌ అనారోగ్యంతో ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడతోనూ ప్రచారం చేయించింది. ముఖ్యంగా జేడీఎస్‌కు గట్టి పట్టున్న పాత మైసూర్‌ ప్రాంతంపై బీజేపీ దృష్టి సారించడంతో కన్నడ సెంటిమెంట్‌ను ముందుకు తెచ్చింది. ఈసారి 35 -40 సీట్లు దక్కించుకుంటే ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పవచ్చని జేడీఎస్‌ భావిస్తున్నది