17స్థానాల బీఆరెస్ అభ్యర్థుల ప్రకటన పూర్తి
బీఆరెస్ పార్టీ తెలంగాణలోని 17పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది

- హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి గడ్డం శ్రీనివాస్ యాదవ్
- 12జనరల్ స్థానాల్లో ఆరు ఓసీలకు..ఆరు బీసీలకు
- ఐదు రిజర్వ్‌డ్ స్థానాల్లోనే రెండు మహిళలకు
విధాత : బీఆరెస్ పార్టీ తెలంగాణలోని 17పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. చివరగా హైదరాబాద్ పార్లమెంటు స్థానం బీఆరెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన ఓటమి..పార్టీ నుంచి భారీగా సాగుతున్న వలసల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కేసీఆర్ కాస్తా కష్టంగానే పూర్తి చేశారు.
సిటింగ్ ఎంపీలలో పలువురు పార్టీ మారి కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎంపీ టికెట్లు తెచ్చుకోవడం..ముందుగా అనుకున్న అభ్యర్థులలో కొందరు పోటీకి విముఖత చూపడంతో అభ్యర్థుల ఎంపిక కేసీఆర్‌కు సవాల్ విసిరింది. అయితే పార్టీలో ఎంపీ టికెట్లకు పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ దఫా సామాజిక సమీకరణలు పాటించేందుకు కేసీఆర్‌కు వెసులుబాటు చిక్కింది. దీంతో ఒకవైపు విజయవకాశాల భేరీజు..మరోవైపు సామాజిక సమీకరణల పాటింపుతో మొత్తం 17మంది అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేశారు.
మూడు ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలు పోగా 12జనరల్ స్థానాల్లో ఆరు నియోజకవర్గాల్లో (జహీరాబాద్, నిజామాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, భువనగిరి, హైదరాబాద్) బీసీలకు టికెట్లు కేటాయించారు. నాలుగు నియోజకవర్గాల్లో (మహబూబ్ నగర్, మెదక్, మల్కాజిగిరి, నల్గొండ) రెడ్డి సామాజిక వర్గం వారికి, కమ్మ (ఖమ్మం), వెలమ (కరీంనగర్) సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో (మహబూబాబాద్, అదిలాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి) ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాల అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. మొత్తంగా రెడ్లకు 4, మున్నురుకాపుకు 2, మాదిగలకు 2, కమ్మ, వెలమ, ముదిరాజ్, గౌడ, కురుమ, గొల్ల, లంబాడా, గోండు, డక్కలికి ఒక్కో సీటు కేటాయిచారు.
మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు
1)ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు(ఓసీ)
2) మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత
3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)
4)పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5)మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)
6)చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)
7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
8)నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ)
9)జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ (బీసీ)
10) ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు ( ఆదివాసీ)
11 )మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)
12)మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి (ఓసీ)
13)నాగర్ కర్నూల్ (ఎస్సీ )- ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .
14) సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్ ( బీసీ)
15) భువనగిరి – క్యామ మల్లేశ్ (బీసీ)
16) నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)
17) హైదరాబాద్ – గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ).