Kharge | కేసీఆర్, బీజేపీతో దోస్తులు.. తెరవెనుక డీల్‌ను ప్రజలు గమనించాలి: మల్లికార్జున ఖర్గే
Kharge | కేసీఆర్, మోదీ ప్రభుత్వాలను పీకేయాలి తెలంగాణ కల నెరవేర్చిన సోనియాగాంధీ ఇక్కడి ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. అది ఒక వ్యక్తి చేతిలోకి వెళ్లిపోయింది చారిత్రక డ్యామ్‌లన్నీ కాంగ్రెస్ కట్టినవే పేదలు ఆకలితో ఉండొద్దని ఆలోచించింది జమీందారీ వ్యవస్థను రద్దు చేసింది కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేయాలని మేం కోరుకుంటాం రాహుల్ ఏ హామీ ఇచ్చినా అమలు చేస్తారు కర్ణాటకలో ఇచ్చిన 5 హామీలను నెరవేర్చాం ప్రభుత్వంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ […]

Kharge |
- కేసీఆర్, మోదీ ప్రభుత్వాలను పీకేయాలి
- తెలంగాణ కల నెరవేర్చిన సోనియాగాంధీ
- ఇక్కడి ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. అది ఒక వ్యక్తి చేతిలోకి వెళ్లిపోయింది
- చారిత్రక డ్యామ్‌లన్నీ కాంగ్రెస్ కట్టినవే
- పేదలు ఆకలితో ఉండొద్దని ఆలోచించింది
- జమీందారీ వ్యవస్థను రద్దు చేసింది కాంగ్రెస్
- ప్రజల కోసం పనిచేయాలని మేం కోరుకుంటాం
- రాహుల్ ఏ హామీ ఇచ్చినా అమలు చేస్తారు
- కర్ణాటకలో ఇచ్చిన 5 హామీలను నెరవేర్చాం
- ప్రభుత్వంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు
విధాత: కేసీఆర్, బీజేపీ మధ్య రహస్య దోస్తీ ఉన్నదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రజలు ఈ దోస్తీని గమనించాలని కోరారు. బయటకు బీజేపీని తిట్టే కేసీఆర్.. అంతర్గతంగా మాత్రం ఆ పార్టీతో మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలను పీకిపారేయడానికి ప్రజలు సిద్ధమయ్యారన్న ఖర్గే.. తాము రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లోని 12 అంశాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు.
కేంద్రంలో బీజేపీని, తెలంగాణలో బీజేపీకి మద్దతిస్తున్న బీఆర్ఎస్‌ను గద్దెదించాలని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ ఏ హామీ ఇచ్చినా అమలు చేస్తారని, కర్ణాటకలో ఇచ్చిన 5 హామీలను అమలు చేశామని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాగర్జన పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారూ కలిసి పోరాటం చేస్తే తెలంగాణ సాకారమైందని, తెలంగాణ ప్రజల మనసెరిగి.. వారి కలను సోనియా గాంధీ నెరవేర్చారని ఖర్గే చెప్పారు. కానీ.. తన వల్లే తెలంగాణ సాకారమైందని కేసీఆర్ చెప్పుకొంటున్నారని విమర్శించారు.
అదే మాటను సోనియాగాంధీతో కలిసి దిగిన ఫొటోను తీసుకొని బయటకు వచ్చి చెప్పాలన్నారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత మనసు మార్చుకున్న కేసీఆర్.. ఆ క్రెడిట్ మొత్తం కొట్టేశారని ఆరోపించారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ చేసింది ఏమీ లేదన్న ఖర్గే.. అందుకే ప్రజలు ఆయనను సాగనంపేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ప్రధాని ఎన్నిసార్లు తిడతారని ప్రశ్నించిన ఖర్గే.. అసలు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏం చేశాయని నిలదీశారు. కాంగ్రెస్ డెబ్బై ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేసిందని బీజేపీ, కొన్ని పార్టీలు ప్రశ్నిస్తున్నయన్న ఖర్గే.. ఐఐటీలు, ఎయిమ్స్, ఇస్రో, వివిధ ప్రభుత్వరంగ సంస్థలు, భాక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇలా చెప్పుకొంటే ఎన్నో చేసిందన్నారు. ఆహార భద్రత కోసం కాంగ్రెస్ పాటుపడిందని అన్నారు.
పేదలు ఆకలితో ఉండకూడదని ఆనాడే కాంగ్రెస్ భావించిందని చెప్పారు. తెలంగాణలో భారీ సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ కాకుంటే ఎవరు నిర్మించారని నిలదీశారు. తాము చేసిన పనుల కారణంగానే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు భారతదేశంలోకి రావడంలో ప్రధానిగా పనిచేసిన రాజీవ్ గాంధీ కీలకపాత్ర పోషించారని చెప్పారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే భూసంస్కరణలు చేపట్టామన్నారు.
వైద్య, విద్య రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. బ్యాంకులను జాతీయీకరించామని, హరితవిప్లవం, శ్వేతవిప్లవం తమ ప్రభుత్వాల కాలంలోనే వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు దేశంలో పేదలకు ఎంతో ప్రయోజనకారిగా ఉన్న ఉపాధి హామీ పథకం తెచ్చిందే తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంస్థలను మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తెగనమ్ముతున్నదని విమర్శించారు.
దేశం కోసం ఇందిర, రాజీవ్ ప్రాణత్యాగం
తాను 12 ఎన్నికలలో పోటీ చేసి, 11 సార్లు గెలిచాననన్న ఖర్గే.. ప్రజాస్వామ్య దేశం వల్లే తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అయ్యానని తెలిపారు. దేశ ఐక్యతకు కృషి చేసే క్రమంలో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణాలు త్యాగం చేశారని చెప్పారు. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలిసి స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఉన్న అనేక చిన్న రాజ్యాలను కలిపి ఐక్య భారతదేశంగా తీర్చిదిద్దారని అన్నారు.
కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించేందుకు 26 ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యాయని ఖర్గే చెప్పారు. బీజేపీతో పాటు తెలంగాణలో కేంద్రానికి అండగా ఉన్న కేసీఆర్‌ను కూడా ఓడించాల్సిన అవసరం ఉన్నదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్న ఖర్గే.. అందుకే కేసీఆర్ నేరుగా బీజేపీపై గట్టి విమర్శలు చేయడం లేదని, బయట తిట్టుకునే ఆ రెండు పార్టీలు.. అంతర్గతంగా మంతనాలు చేసుకుంటున్నాయని ఆరోపించారు.