కాంగ్రెసోళ్లు వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారు..రాబోయే కాలం మనదే: కేసీఆర్

కాంగ్రెస్‌ నేతలు వాళ్లల్లో వాళ్లే కొట్టుకుంటున్నారన్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి, ఆరోపణలు ప్రారంభమయ్యాయని, రాబోయే కాలం మనదేనని బీఆరెస్ అధినేత

  • Publish Date - March 4, 2024 / 02:33 PM IST
  • వారి పాలనపై అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి
  • బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జోస్యం
  • నలుగురు ఎంపీ అభ్యర్థులతో బీఆరెస్‌ తొలి జాబితా ప్రకటన
  • ఖమ్మంకు నామా..మహబూబాబాద్‌కు మాలోతు కవిత
  • కరీంనగర్‌కు బి.వినోద్‌కుమార్‌..పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్‌
  • ఖమ్మం..మహబూబాబాద్ నేతలతో కేసీఆర్ భేటీ
  • భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం డుమ్మా

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్‌ నేతలు వాళ్లల్లో వాళ్లే కొట్టుకుంటున్నారన్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి, ఆరోపణలు ప్రారంభమయ్యాయని, రాబోయే కాలం మనదేనని బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో విసుగు ప్రారంభమైందని, రాబోయే కాలం బీఆరెస్ పార్టీదేనని పార్టీ శ్రేణుల్లో భరోసా నింపారు. ఈ నెల 12న కరీంనగర్‌లో బీఆరెస్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లుగా, ఆ తర్వాత ఖమ్మంలోనూ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నేతలంతా కలిసికట్టుగా పని చేసి పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఉండాలన్నారు. పార్టీ నుంచి సాగుతున్న వలసలపై కేసీఆర్ స్పందిస్తూ ఎన్టీఆర్ లాంటి వాళ్లకే రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదని గుర్తుచేశారు. పార్టీని వీడుతున్న వారితో మనకు ఎలాంటి నష్టం లేదని నేతలకు ధైర్యం చెప్పారు. ప్రజల తరుపునా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం మనకు వచ్చిందని.. ప్రతిపక్షం పాత్ర అంటే ఎలా ఉంటదో ప్రభుత్వానికి చూపిద్దామని పిలుపునిచ్చారు.

నలుగురు అభ్యర్థులతో బీఆరెస్ తొలి జాబితా ప్రకటన

పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నాలుగు ఎంపీ స్థానాల అభ్యర్థులతో కేసీఆర్ బీఆరెస్ తొలి జాబితాను ప్రకటించారు. ఖమ్మం బీఆరెస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును, మహబూబాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా మాలోత్ కవితల పేర్లను కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్ అభ్యర్థగా బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌లను ప్రకటించారు. త్వరలో మిగతా ఎంపీ స్థానాల బీఆరెస్ అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు.

ఎమ్మెల్యే తెల్లం డుమ్మా..రంగంలోకి హరీశ్‌రావు

ఖమ్మం, మహబూబ్‌బాద్ పార్లమెంట్ నియోజక వర్గ నేతలతో తెలంగాణ భవన్‌లో సోమవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి ఈ రెండు జిల్లాలోని కీలక నేతలంతా హాజరయ్యారు. అయితే సమావేశానికి భద్రాచలం బీఆరెస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాత్రం డుమ్మా కొట్టడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీఆరెస్‌కు ఎమ్మెల్యే వెంకట్రావు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం వెంకట్రావు కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకైక బీఆరెస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రరావు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఆయన సత్సంబంధాలు చాలాకాలంగా కొనసాగిస్తున్నారు. వెంకట్రావును కాంగ్రెస్‌లోకి తీసుకెళ్లేందుకు పొంగులేటి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వెంటనే బీఆరెస్‌ చేరి భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే బీఆరెస్‌లోకి వెంకట్రావు వెళ్లడం వెనుక కూడా పొంగులేటి హస్తమున్నట్లు ప్రచారం జరిగింది. ఆయన పార్టీ వీడుతుండటంతో గులాబీ పెద్దలు అలెర్ట్ అయినట్లు సమాచారం. రంగంలోకి దిగిన మాజీ మంత్రి టి.హరీశ్‌రావు సోమవారం భద్రాచలం బీఆరెస్‌ నేతలతో సమావేశమయ్యారు. వెంకట్రావు పార్టీ మారుతున్నారా, ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు పార్టీ మారతారనే విషయంపై కూడా హరీశ్ రావు చర్చించినట్లు సమాచారం. తెల్లంతో పాటు పార్టీ ఖమ్మం జిల్లా కీలక నేతలు ఎవరు కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా హరీశ్‌రావు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఖమ్మం రాజకీయ వర్గాలలో చర్చ సాగుతున్నది.