KCR | ప్రతిపక్షాలలో.. కేసీఆర్‌ ఓంటరి!

KCR BRSను దరి చేరనివ్వని విపక్షాలు కేసీఆర్‌ కలిసిన నేతలూ అటువైపే బెంగళూర్‌ భేటీకి వెళతామన్న ఆప్‌ బీజేపీతో బంధంపై అనుమానాలు! కేసీఆర్‌ను దూరం పెట్టిన సీఎంలు విపక్షాల భేటీకి అందని ఆహ్వానం విధాత: జాతీయ రాజకీయాల్లో బీఆరెస్‌ ఒంటరి అవుతున్నది. తాము మిత్రులుగా భావించిన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో టీఆరెస్‌ను కాస్తా బీఆరెస్‌గా […]

KCR | ప్రతిపక్షాలలో.. కేసీఆర్‌ ఓంటరి!

KCR

  • BRSను దరి చేరనివ్వని విపక్షాలు
  • కేసీఆర్‌ కలిసిన నేతలూ అటువైపే
  • బెంగళూర్‌ భేటీకి వెళతామన్న ఆప్‌
  • బీజేపీతో బంధంపై అనుమానాలు!
  • కేసీఆర్‌ను దూరం పెట్టిన సీఎంలు
  • విపక్షాల భేటీకి అందని ఆహ్వానం

విధాత: జాతీయ రాజకీయాల్లో బీఆరెస్‌ ఒంటరి అవుతున్నది. తాము మిత్రులుగా భావించిన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో టీఆరెస్‌ను కాస్తా బీఆరెస్‌గా మార్చిన కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో మాత్రం మద్దతు లభించడం లేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

దీంతో కేసీఆర్‌ ఒంటరైపోయారని అంటున్నారు. గతంలో శరద్‌పవార్‌, ఉద్ధవ్‌ఠాక్రే, నితీశ్‌కుమార్‌, క్రేజీవాల్‌ తదితరులతో కేసీఆర్‌ ప్రత్యామ్నాయ ఎజెండాపై చర్చలు జరిపారు. అయితే.. కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు.. పరోక్షంగా బీజేపీకే లబ్ధి చేకూర్చేటట్టు ఉన్నదని అనుమానించడం వల్లే సదరు నేతలు కేసీఆర్‌కు దూరమయ్యారన్న చర్చ నడుస్తున్నది.

కాంగ్రెస్‌తోనే విపక్ష కూటమి

బీజేపీ విధ్వంసకర ఎజెండాను తిప్పి కొట్టాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విపక్షాల విశాల ఐక్యత అనేది అత్యవసరంగా మారింది. అందుకే కాంగ్రెస్‌ పార్టీ సైతం ప్రతిపక్షాలను కలుపుకొని పోయే స్వభావంతోనే ఉన్నది. తాజాగా ఢిల్లీ ఆర్డినెన్స్‌ విషయంలో కాంగ్రెస్‌ వైఖరి చెబితేనే బెంగళూరు సమావేశానికి వస్తామని ఆప్‌ తేల్చడంతో.. విశాల ప్రయోజనాల రీత్యానే ఆప్‌కు కాంగ్రెస్‌ మద్దతు పలికింది. దీంతో ఆప్‌ కూడా పట్టు సడలించి.. బెంగళూరు సమావేశానికి హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

అదే సమయంలో మెజార్టీ పార్టీలు కాంగ్రెస్‌ లేని విపక్ష కూటమి సాధ్యం కాదు అనే అవగాహనతో ఉన్నట్టు కనిపిస్తున్నది. ప్రతిపక్షాల ఐక్యతకు మొదట చొరవ చూపిన బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌.. తమ రాష్ట్రంలో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా.. దాని విజయవంతానికి కూడా కృషి చేశారు. మొత్తానికి ఆ సమావేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా ఎన్నికలకు వెళ్లాలన్న స్థూల నిర్ణయం జరిగింది. దీనికి కొనసాగింపుగా సోమ, మంగళవారాల్లో బెంగళూరులో సమావేశాన్ని కాంగ్రెస్‌ ఏర్పాటు చేస్తున్నది.

మొదటి సమావేశంలో 17 రాజకీయ పార్టీలు పాల్గొనగా.. బెంగళూరు సమావేశానికి ఆ సంఖ్య 24కు పెరగడం విశేషం. ఈ సమావేశానికి హాజరు కావాలని ఆప్‌ ముఖ్యనేతల సమావేశం నిర్ణయించింది.
నిజానికి కేసీఆర్‌ను మిగిలిన పార్టీలు దూరం పెట్టినప్పటికీ.. ఆప్‌ మాత్రం సన్నిహితంగానే మెలిగింది. ఇటీవల బీఆరెస్‌ ఆవిర్భావ దినోత్సవ సభకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీఎంలు కేజ్రీవాల్‌, భగవంత్‌సింగ్‌ మాన్‌ హాజరయ్యారు. అయితే.. బెంగళూరు విపక్షాల భేటీకి హాజరవ్వాలని కేజ్రీవాల్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన కూడా కేసీఆర్‌కు దూరం జరిగినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టిన తరువాత పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వద్దకు వెళ్లి చర్చించారు. తదుపరి తమిళనాడు సీఎం స్టాలిన్‌, బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌, ఆప్‌ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రె, జార్ఖండ్‌ సీఎం హుమంత్‌ సొరేన్‌, యూపీ మాజీ సీఎం, సమాజ్‌ వాది పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ తదితర నేతలతో భేటీ అయ్యారు.

సీఎం కేసీఆర్‌ ఆయా నేతల వద్దకే వెళ్లి కలిసి మాట్లాడారు. కాంగ్రెస్‌ లేని విపక్ష కూటమి ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. అయితే కేసీఆర్‌ చేసిన ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో ఆయన ఒంటరి పోరాటానికి పరిమితమైపోయారు.

BRS పిలుద్దామని ఎవరూ అనలేదా?

బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరంగా తాను ఏర్పాటు చేయదలచిన ప్రత్యామ్నాయం ఫలించకపోగా.. దేశంలో విపక్ష పార్టీల నేతలు ఎవరు కూడా విపక్షాల కూటమిలోకి బీఆరెస్‌ను ఆహ్వానిద్దామన్న ప్రతిపాదన కూడా చేసినట్లు కనిపించడం లేదు. కేసీఆర్‌ స్వయంగా ఆయా రాష్ట్రాల సీఎంల వద్దకే వెళ్లి మాట్లాడి వచ్చినప్పటికీ కారణం ఏమిటో కానీ ఆయా నేతలు విశ్వసించినట్లుగా కనిపించడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వెలువడుతోంది.

కేసీఆర్‌ చేసే ప్రయత్నాలు పరోక్షంగా విపక్షాల ఓట్లు చీలి బీజేపీకే లబ్ధి చేకూరుతుందన్న అభిప్రాయంతోనే దూరం పెట్టారన్న చర్చ జరుగుతున్నది. నమ్మకం లేకనే విపక్షాల కూటమి సమావేశాలకు కేసీఆర్‌ను ఆహ్వానించడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ బీఆరెస్‌ పార్టీ బీజేపీకి బీ టీమ్‌ అని ప్రకటించారు.

పైగా ఖమ్మం సభలోనే.. విపక్షాల కూటమిలోకి కేసీఆర్‌ను ఆహ్వానించేది లేదని తెగేసి చెప్పారు. ఆ పార్టీ ఉంటే తాము కూటమిలో ఉండే ప్రసక్తి లేదని చెప్పామని కూడా వెల్లడించారు. రాహుల్‌ ప్రకటనకు ముందు కానీ, తరువాత కానీ ఏ నాయకుడు కూడా కేసీఆర్‌ను బెంగళూరులో జరిగే సమావేశానికి పిలువాలని కోరలేదు.

రాహుల్‌ ఖమ్మం వచ్చిన వెళ్లిన మరుసటి రోజు సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్‌యాదవ్‌ హైదరాబాద్‌కు వచ్చి, సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అయితే.. ఆయన స్వయంగా వచ్చారా? లేక రాజకీయంగా గందరగోళం సృష్టించేందుకు కేసీఆరే ఆయనను పిలిపించుకున్నారా? అన్న విషయంలో సందేహాలు ఉన్నాయి.

అఖిలేశ్‌తో చర్చలు జరిపినా.. ఆయన మాత్రం బెంగళూరు సమావేశానికి హాజరు కానుండటంతో ఈ ప్రయత్నం కూడా విఫలమైనట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏతావాతా బీఆరెస్‌పై పడిన అపప్రథ కారణంగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ ఒంటరయ్యారన్నది మాత్రం కనిపిస్తున్న వాస్తవం.