YS. Sharmila: కేసీఆర్..జగన్ ల జాయింట్ ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్

YS. Sharmila: కేసీఆర్..జగన్ ల జాయింట్ ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్

వారి బంధం ముందు రక్తసంబంధం చిన్నబోయింది
వైవీ సుబ్బారెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆడియో నాకు వినిపించారు
నన్ను అణిచివేసేందుకే వారి కుట్ర
అప్పటి సీఎంల ట్యాపింగ్ అక్రమాలపై ఇప్పటి సీఎంలు చర్యలు తీసుకోవాలి
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల

విధాత, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజమని ఏపీ కాంగ్రెస్ చీప్ వైఎస్.షర్మిల రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అప్పటి తెలంగాణ, ఏపీ సీఎం కేసీఆర్, వైఎస్.జగన్ లు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ గా భావిస్తున్నానన్నారు. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గర వాళ్ళ ఫోన్ ల ట్యాపింగ్ జరుగుతున్నట్లుగా అప్పట్లో మేం పసిగట్టామని…అదిగాక వైసీపీ నేత వైవి.సుబ్బారెడ్డి అప్పట్లో మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని మా ఇంటికి వచ్చి మరీ చెప్పారని..ఓ ఫోన్ కాల్ సంభాషణ కూడా మాకు వినిపించారని షర్మిల వెల్లడించారు. అయితే జగన్ ఒత్తిళ్ల నేపథ్యంలో సుబ్బారెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఒప్పుకుంటారని మాత్రం అనుకోవడం లేదన్నారు. జగన్ తన సొంత మేనల్లుడు, మేన కోడలు అస్తి కాజేసే అంశంలో సుబ్బారెడ్డితో అబద్ధాలు చెప్పించాడని షర్మిల పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితిలో వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడు అనుకోను ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు జరగాలని..దోషులకు శిక్ష పడాలని షర్మిల డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానన్నారు. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న… ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం అని షర్మిల స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని కోరారు. అనాటి సీఎంలు జగన్,కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందన్నారు. వారిద్దరూ ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేవాళ్ళన్నారు. తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ ఫోన్ ట్యాపింగ్ అని ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిస్తే మీరు ఏం చేశారని..మీడియా నన్ను అడగొచ్చని..ఇది అక్రమం..అనైతికమని తెలిసి…మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించవచ్చని..అయితే ఆనాటి పరిస్థితులు వేరు అని.. అప్పుడు జగన్, కేసీఆర్ చేసినవి అరాచకాల ముందు ఫోన్ ట్యాపింగ్ చిన్నదని షర్మిల చెప్పుకొచ్చారు. నేను జగన్ కి తోడబుట్టిన చెల్లెలు అని..ఆ విషయం మరిచి నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదు అని కుట్ర చేశారన్నారు. నా భవిష్యత్ ను పాతిపెట్టాలని ఎన్నో చేశారని..ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కుట్ర చేశారని షర్మిల ఆరోపించారు. నాకు సపోర్ట్ చేసిన వాళ్లను బెదిరించారని..రాజకీయంగా నా వాళ్ళు రానివ్వకుండా చేశారన్నారు. నా అనుచరులను భయబ్రాంతులకు గురి చేశారని..నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారన్నారు. నేను తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ కి ఏ సంబంధం లేదని..కేసీఆర్ కోసం నన్ను తొక్కి పెట్టాలని చూశాడని షర్మిల అభిప్రాయపడ్డారు. నా చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశారని..నా సర్వైవల్ కోసం నేను పోరాటం చేశానని..నా ప్రతి పోరాటానికి అడ్డు పడ్డారని విమర్శించారు. నాకు పర్సనల్ టార్గెట్ అంటూ ఏమి లేదని..నా మీద జగన్ కేసు వేసినప్పుడే నేను కేసు వేసే దాన్ని అని..అమ్మకు ఇచ్చిన ఆస్తి విషయంలో కేసు వేసినప్పుడే నేను కేసు వేసే దాన్ని అని షర్మిల గుర్తు చేశారు.