భూతం లాంటి KCRను.. పట్టి సీసాలో బంధించాలి
అమరవీరుల కుటుంబాలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఆ భవనం ఉండి ఎందుకు.. దాని గేట్లు బద్దలు కొడతాం జరిగిన ఎకౌంటర్లకు ఎవరిది బాధ్యత? కేసులు నాకేమీ కొత్త కాదు ఏబీసీడీలు రాని ఎర్రబెల్లికి మంత్రి పదవా? ఉద్యమంలో పాల్గొనని ద్రోహులు మంత్రులుగానా? పొంగులేటి కాంగ్రెస్‌లోకి వస్తామంటే ఆహ్వానిస్తాం మీడియాతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కేసీఆర్ సినిమా క్లైమాక్స్‌కు వచ్చిందని, గులాబీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయనీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. […]

- అమరవీరుల కుటుంబాలకు ప్రవేశం లేని ప్రగతి భవన్
- ఆ భవనం ఉండి ఎందుకు.. దాని గేట్లు బద్దలు కొడతాం
- జరిగిన ఎకౌంటర్లకు ఎవరిది బాధ్యత?
- కేసులు నాకేమీ కొత్త కాదు
- ఏబీసీడీలు రాని ఎర్రబెల్లికి మంత్రి పదవా?
- ఉద్యమంలో పాల్గొనని ద్రోహులు మంత్రులుగానా?
- పొంగులేటి కాంగ్రెస్‌లోకి వస్తామంటే ఆహ్వానిస్తాం
- మీడియాతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో కేసీఆర్ సినిమా క్లైమాక్స్‌కు వచ్చిందని, గులాబీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయనీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. బుధవారం ఉదయం పెనుగొండలో, సాయంత్రం ఈదుల పూసపెల్లిలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేసీఆర్ భూతం లాంటివాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఆయనను పట్టి సీసాలో బంధించాలని, లేకపోతే తట్టుకోలేమని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడేందుకు కేసీఆర్ వ్యతిరేక శక్తులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 3 వేల లిక్కర్ షాపులు, 60 బెల్టు షాపులు ఏర్పాటు చేసి, ప్రజలను తాగుబోతులను చేశాడని కేసీఆర్‌పై మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ ఇంతవరకు చేయకపోవడంతో అప్పులపాలయ్యారన్నారు.
ప్రగతిభవన్ వల్ల ఉపయోగమేంటి?
అమరవీరుల కుటుంబాల ప్రవేశానికి అనుమతి లేని ప్రగతి భవన్ ఎందుకు? అంటూ రేవంత్ రెడ్డి మరోసారి గట్టిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. ములుగులో మంగళవారం రాత్రి రేవంత్ ప్రగతి భవన్‌ను పేల్చివేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.
ఈ విషయంలో రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి పై విధంగా ప్రతిస్పందించారు. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ఎందుకు అనేది తన ఉద్దేశమని మరోసారి స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని.. ద్రోహులను మంత్రులుగా ప్రగతిభవన్‌లో పెట్టుకుంది ఎవరు? ప్రజలకు ఉపయోగపడని అది ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అని రేవంత్ అన్నారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతిభవన్ గేట్లను బద్దల కొడతామని హెచ్చరించారు.
తెలంగాణ ద్రోహులకే మంత్రి వర్గంలో 90 శాతం పదవులిచ్చారని విమర్శించారు. తన పోర్ట్‌ఫోలియో పేరు కూడా రాయలేని ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. కోవర్టు అపరేషన్‌లో ఎర్రబెల్లి దిట్టా? అంటూ మండిపడ్డారు. చదువుకున్న వాడు, తెలంగాణ కోసం ఊరురా గొంగడేసుకుని తిరిగిన రసమయి బాలకిషన్‌కు మంత్రి పదవి ఇవ్వచ్చు కదా? అని ప్రశ్నించారు. తమ కులం అని దయాకర్ రావు ఇచ్చారని విమర్శించారు.
నాకు కేసులు కొత్తేమీ కాదు
కేసులు తనకు కొత్త కాదని, ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌లు ఉండబోవని హామీ ఇచ్చారన్న రేవంత్‌రెడ్డి మరి జరిగిన ఎన్‌కౌంటర్లకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
2024 కొత్త సంవత్సరం, కొత్త విధానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అధికారంలోకి రాగానే పోడు భూముల సమస్య పరిష్కారం చేస్తామని అన్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిద్ధాంతం మంచిదేనని రేవంత్ చెప్పారు. ఆయన టీఆర్ఎస్‌ను వ్యతిరేకించడాన్ని సమర్థిస్తున్నానని, ఆయన కాంగ్రెస్‌లోకి వస్తానంటే ఆహ్వానిస్తామని చెప్పారు
కోటలో మూడో రోజు పాదయాత్ర
మానుకోట నియోజకవర్గంలోని కేసముద్రం మండలం పెనుగొండ నుంచి మూడో రోజు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ఈదులపూసపల్లి వరకు సాగింది. భోజన విరామం అనంతరం వామపక్షాలతో మాటముచ్చట నిర్వహించారు.
పార్టీ బూత్ కమిటీ కో-ఆర్డినేటర్లతో సమావేశం జరిపి అనంతరం పాదయాత్ర మహబూబాబాద్ పట్టణం వరకు పాదయాత్ర చేశారు. ఆఫీసర్స్ క్లబ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం డోర్నకల్ నియోజకవర్గం పరిధిలోని పెద్దనాగారంలో రాత్రి బస చేస్తారు.