కాంగ్రెస్ ప్రక్షాళనలో అధిష్ఠానం.. కీలక మార్పులు
రాష్ట్ర నాయకత్వాన్ని సన్నద్ధం చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు యత్నాలు.. జోష్ నింపిన రాహుల్ జోడో యాత్ర విధాత: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం సన్నద్ధంగా ఉన్నది. దీనికి అనుగుణంగా పార్టీలో ప్రక్షాళన చేసేందుకు హస్తిన పెద్దలు ఇన్‌చార్జి మాణికం ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీమ్ జావేద్‌తో కలిసి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఢిల్లీలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లు, యువ నాయకులతో […]

- రాష్ట్ర నాయకత్వాన్ని సన్నద్ధం చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు
- ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు యత్నాలు..
- జోష్ నింపిన రాహుల్ జోడో యాత్ర
విధాత: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం సన్నద్ధంగా ఉన్నది. దీనికి అనుగుణంగా పార్టీలో ప్రక్షాళన చేసేందుకు హస్తిన పెద్దలు ఇన్‌చార్జి మాణికం ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీమ్ జావేద్‌తో కలిసి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఢిల్లీలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సీనియర్లు, యువ నాయకులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అన్నివర్గాల వారికి ఈ కమిటీలో సమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. సుదీర్ఘకాలం పార్టీలో ఉంటూ అన్ని పదవులు అనుభవించి తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంతమంది పార్టీ వీడుతున్నారు.
రాజగోపాల్‌రెడ్డి, మర్రిశశిధర్ రెడ్డి లాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీని వీడుతూ.. పార్టీ అధిష్ఠానంపై చేసిన విమర్శలను సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలో ఉండే అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నవాళ్లను పక్కన పెట్టాలని నిర్ణయించారట. కొత్తవారికి అవకాశం ఇచ్చి గీత దాడితే వేటే అనే గట్టి సంకేతాలు పంపనున్నారు.
రాష్ట్రంలో రెండు వారాల పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేతల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇదే ఊపుతో సార్వత్రిక ఎన్నికలకు కార్యాచరణ రూపొందించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్ర నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తూ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్న సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇస్తూ అందరూ ఏకతాటిపైకి వెళ్లేలా సమన్వయ కమిటీ ఏర్పాటు కానున్నది.
రెండుసార్లు అధికారంలో కొనసాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉన్నప్పటికీ నాయకుల వ్యవహారశైలి వల్ల ఒకవేళ గెలిచినా పార్టీలో ఉండరనే అపనమ్మకం పెరిగిపోయింది. దీన్ని అధిగమించి ప్రజల్లో తిరిగి విశ్వాసం పొందేలా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్లాలని పార్టీ అధిష్ఠానం దిశానిర్దేశం చేస్తున్నది.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, ఢిల్లీ పెద్దల నుంచి కావాల్సిన సహకారం అందించ డానికి సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే పార్టీ అగ్రనేతలు స్పష్టం చేశారు. కాబట్టి పార్టీలో ప్రక్షాళన చేసి కీలక మార్పులు చేయడానికి అధిష్ఠాన పెద్దలు కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి మూడు నెలల కిందటే ఈ ప్రక్రియ ప్రారంభమైనా జోడో యాత్ర, మునుగోడు ఉప ఎన్నిక వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం ఆ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.