Khammam | ఖమ్మంలో జన గర్జన సభ నేడే

Khammam భారీ ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్‌ నేతలు ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాహుల్‌ ఆయన సమక్షంలోనే భట్టి యాత్ర ముగింపు కాంగ్రెస్‌ పార్టీలో పొంగులేటి చేరిక విధాత: కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం ఖమ్మం పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. పట్టణ శివార్లలో దాదాపు వంద ఎకరాల భూమిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ సభలోనే ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, మాజీ ఎంపీ […]

Khammam | ఖమ్మంలో జన గర్జన సభ నేడే

Khammam

  • భారీ ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్‌ నేతలు
  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాహుల్‌
  • ఆయన సమక్షంలోనే భట్టి యాత్ర ముగింపు
  • కాంగ్రెస్‌ పార్టీలో పొంగులేటి చేరిక

విధాత: కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం ఖమ్మం పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. పట్టణ శివార్లలో దాదాపు వంద ఎకరాల భూమిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ సభలోనే ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పెద్ద సంఖ్యలో తన అనుచ‌రులతో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.

అలాగే 108 రోజులుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అదిలాబాద్‌ నుంచి చేపట్టిన పాదయాత్ర ఆదివారం ఈ సభ వద్దనే ముగుస్తుంది. భట్టి 1360 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర పూర్తి చేశారు. విజయవంతంగా పాదయాత్ర చేసిన భట్టిని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ సత్కరించనున్నారు.

గన్నవరం వరకు విమానం.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రాహుల్‌ గాంధీ ఢిల్లీ నుంచి గన్నవరం విమానంలో వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకుంటారు. సభ అనంతరం హెలికాప్టర్‌లో గన్నవరం చేరుకుని.. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిపోతారు.

ముస్తాబైన ఖ‌మ్మం

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్న జ‌న‌గ‌ర్జన స‌భ‌ కోసం ఖ‌మ్మం న‌గ‌రం అందంగా ముస్తాబైంది. న‌గ‌రంలో అడుగ‌డుగునా మూడు రంగుల జండాలే ద‌ర్శన‌మిస్తున్నాయి. ఎటు చూసినా.. కాంగ్రెస్ ఫ్లెక్సీలతో సుంద‌రంగా మారింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన‌ కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్ ల‌తో ఖమ్మం పట్టణాన్ని అలంకరించారు.

ప‌ట్టణంలో ప్రధాన ర‌హదారులు, చౌర‌స్తాలు, కూడ‌ళ్లు, విద్యుత్ స్థంభాల‌ను కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీల‌తో అత్యంత సుంద‌రంగా అలంక‌రించారు. ప‌ట్టణంలో దాదాపు 45 అడుగుల కటౌట్స్, 20X20 అడుగుల స‌ర్కిల్ హోర్డింగ్ లు, భారీ క‌టౌట్ లు, పెద్దపెద్ద బెలూన్స్ ఎగ‌రేశారు.

భట్టి పాదయాత్రకు బ్రహ్మరథం

భట్టి విక్రమార్క పాదయాత్ర శనివారం ఖమ్మం చేరుకున్న సందర్భంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 108వ రోజు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కోదాడ ఎక్స్ రోడ్డు నుంచి ప్రారంభమై వరంగల్ ఎక్స్ రోడ్, మున్నేరు బ్రిడ్జి, డీసీసీ ఆఫీస్, ఇల్లందు ఎక్స్ రోడ్, శ్రీ శ్రీ సెంటర్ వరకు కొనసాగింది. 108 రోజుల పాటు పాదయాత్ర చేసి ఖమ్మం గుమ్మంలో అడుగుపెట్టిన జన నాయకుడికి ప్రజలు జేజేలు పలికారు.

కోదాడ ఎక్స్ రోడ్ నుంచి డప్పు, డోలు కళాకారులు గజ్జె కట్టి నృత్యాలు చేస్తూ స్వాగతించారు. ఒగ్గు డోలు కళాకారులు తమ విన్యాసాలను ప్రదర్శించగా, మహిళా డప్పు కళాకారులు ఆటపాటలతో అందరిని విశేషంగా ఆకట్టుకున్నారు.

పాదయాత్ర ప్రారంభానికి ముందు శిబిరంలో ఖమ్మం జిల్లా జర్నలిస్టులు వచ్చి భట్టి విక్రమార్కకు పూల బొకే అందజేసి పాదయాత్ర విజయవంతం చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను కూడా పాదయాత్రలో ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించడానికి కృషి చేయాలని కోరగా నాలుగు నెలల్లో అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉండకూడదని లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని వారికి హామీ ఇచ్చారు. ఇండ్లు లేనివారికి ఇండ్ల నిర్మాణం చేసి ఇవ్వడమే మొదటి ప్రాధాన్యతగా పెట్టుకుంటామని చెప్పారు.