Congress | కాంగ్రెస్‌కు.. కలిసొచ్చిన ఖమ్మం సభ! జనంలోకి విస్తృతంగా కాంగ్రెస్ పథకాలు

Congress జనంలోకి విస్తృతంగా కాంగ్రెస్ పథకాలు ఒక్కో చోట ఒక్కో డిక్లరేషన్‌తో జనంలోకి ఖమ్మం సభలో చేయూత పింఛన్ల ప్రకటన ఇతర పార్టీ నుంచి చేరికలకు కొత్త ఊపు (విధాత, ప్రత్యేక ప్రతినిధి) తెలంగాణలో అధికార సాధనకు ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం బహిరంగ సభ అవసరమైన కదనోత్సహాన్ని కల్గించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపుతో పాటు ఖమ్మంలో గట్టి పట్టున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిక సందర్భంగా నిర్వహించిన […]

Congress | కాంగ్రెస్‌కు.. కలిసొచ్చిన ఖమ్మం సభ! జనంలోకి విస్తృతంగా కాంగ్రెస్ పథకాలు

Congress

  • జనంలోకి విస్తృతంగా కాంగ్రెస్ పథకాలు
  • ఒక్కో చోట ఒక్కో డిక్లరేషన్‌తో జనంలోకి
  • ఖమ్మం సభలో చేయూత పింఛన్ల ప్రకటన
  • ఇతర పార్టీ నుంచి చేరికలకు కొత్త ఊపు

(విధాత, ప్రత్యేక ప్రతినిధి)

తెలంగాణలో అధికార సాధనకు ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం బహిరంగ సభ అవసరమైన కదనోత్సహాన్ని కల్గించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపుతో పాటు ఖమ్మంలో గట్టి పట్టున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిక సందర్భంగా నిర్వహించిన ఖమ్మం సభ విజయవంతం కావడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కాంగ్రెస్ అధికార పీఠానికి దగ్గరగా సాగుతుందన్న నమ్మకాన్ని కల్గించింది.

సభకు రాష్ట్ర ప్రభుత్వం బస్సులు ఇవ్వకపోయినా.. ప్రైవేటు వాహనాలకు ఫైన్‌లు వేసి.. కార్లు టూవీలర్స్ రాకుండా అడ్డుకుని జనసమీకరణలో ఆటంకాలు కల్పించినా.. రెండు లక్షల మందికి పైగా జనం ఖమ్మం తెలంగాణ జన గర్జన సభకు తరలిరావడం జనంలో పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్‌కు నిదర్శనంగా నిలిచింది.

అదే సమయంలో బీఆరెస్‌ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను కూడా చాటిందని భావిస్తున్నారు. తెలంగాణలోని ప్రతి జిల్లా నుండి ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు ఖమ్మం సభకు హాజరైన తీరు కాంగ్రెస్ పట్ల, ముఖ్యంగా స్థానిక నేతలైన పొంగులేటి, పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్క ల పట్ల వారి అభిమానాన్ని వెల్లడించింది.

ప్రొఫెషనల్‌ రాజకీయ వేత్తగా రాహుల్‌

పొంగులేటి సహా పలువురి చేరికలతో రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం సభ నుండి చేరికలకు కొత్త ఊపు అందించింది. ఖమ్మం సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగం సైతం జనంలోకి సూటిగా వెళ్లిందని అంటున్నారు.

బీజేపీకి ‘బీ’ టీంలా బీఆరెస్‌ పనిచేస్తున్నదని రాహుల్‌ చేసిన విమర్శలు, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనలో వైఫల్యాలపై సంధించిన బాణాలు జనాన్ని ఆలోచనలో పడేశాయి. రాహుల్‌గాంధీ పక్కా ప్రొఫెషనల్‌ పొలిటీషియన్‌గా తన ప్రసంగంతో జనాన్ని ఆకట్టుకోగలిగారు. అలాగే తన పాదయాత్రతో పార్టీకి కొత్త జవసత్వాలు అందించిన పార్టీ దళిత నేత భట్టికి రాహూల్ తన హాజరుతో సముచిత గౌరవం ఇచ్చారు.

చేయూత పింఛన్లపై ప్రకటన

సామాజిక పెన్షన్లను రూ.4వేలు ఇస్తాం అని రాహూల్ గాంధీ చేసిన ప్రకటన జనాన్ని ఆకట్టుకోగా, అధికార బీఆరెస్‌లో కొత్త ఆలోచనలు చేయాల్సిన పరిస్థితిని కల్పించింది. టీపీసీసీ నిర్వహిస్తున్న ప్రతి బహిరంగ సభలో పార్టీ ఎన్నికల ప్రణాళికలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నది. ఇందుకోసం ఒక్కో సభలో ఒక్కో డిక్లరేషన్‌ వెల్లడిస్తున్నారు.

గతంలో వరంగల్‌లో రాహుల్‌ హాజరైన బహిరంగ సభలో రైతు డిక్లరేషన్‌ వెలువరించారు. తదుపరి ప్రియాంకగాంధీ హాజరైన హైదరాబాద్‌ సభలో యూత్ డిక్లరేషన్‌ చేశారు. ఈ క్రమంలోనే ఖమ్మంలో చేయూత డిక్లరేషన్ చేసి ఆయా వర్గాలను ఆకట్టుకునే దిశగా కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలో ముందడుగు వేసింది.

రానున్న రోజుల్లో నిర్వహించనున్న బహిరంగ సభలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, హెల్త్ డిక్లరేషన్‌లు ప్రకటించే కసరత్తు జరుగుతున్నదని సమాచారం. కాంగ్రెస్ సహజ ఓటు బ్యాంకులుగా ఉన్న ఆయా వర్గాలు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ప్రధానంగా సాగిన గత రెండు ఎన్నికలోనూ కాంగ్రెస్‌కు దూరమయ్యాయి. తిరిగి ఆ వర్గాలలో పట్టు సాధించుకునేందుకు కాంగ్రెస్‌ పక్కా ప్రణాళికలతో ముందుకు కదులుతున్నది.

చేరికలకు మరింత ఊపు

చేరికలకు సంబంధించి ఘర్ వాపసీ పిలుపుకు ఊతమిచ్చేలా పాతకాపులకు పార్టీ తలుపులు తెరిచే ఉంచామన్న సందేశాన్ని ఖమ్మం సభ వేదికగా కాంగ్రెస్ అధిష్ఠానం మరింత స్పష్టంగా వినిపించగలిగింది. ఇది బీజేపీ, బీఆరెస్‌లలో ఇమడలేక పోతున్న మాజీ కాంగ్రెస్ నాయకులకు తిరిగి సొంతగూటికి చేరేందుకు రెడ్ కార్పెట్ పరిచినట్లయ్యింది. ఈ పరిణామం వలసలకు మరింత ఊపునిస్తుందని పార్టీ నాయకత్వం విశ్వసిస్తుంది