స్కామ్‌లు చేసినోళ్లను అరెస్టు చేస్తే బ్లాక్‌డేనా

స్కామ్‌లకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తే ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అనడం సిగ్గుచేటని బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.

  • By: Somu    latest    Mar 23, 2024 12:44 PM IST
స్కామ్‌లు చేసినోళ్లను అరెస్టు చేస్తే బ్లాక్‌డేనా
  • కేసీఆర్ స్పందన వెనుక మర్మమేమిటో
  • బీఆరెస్ అవినీతి కేసులతో సీఎం రేవంత్‌రెడ్డి లావాదేవిలు
  • కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి


విధాత, హైదరాబాద్‌ : స్కామ్‌లకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తే ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అనడం సిగ్గుచేటని బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కూతురు కవితను అరెస్టు చేస్తే ఒక్క మాట మాట్లాడని కేసీఆర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే మాత్రం బ్లాక్ డే అంటూ వ్యాఖ్యానించడం వెనుక మర్మమేమిటో తెలంగాణ సమాజానికి చెప్పాలని నిలదీశారు. కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనే అరెస్టు చేశారని, ఆమె అరెస్టుకు తెలంగాణకు సంబంధం లేదన్నారు.


గతంలో కేసీఆర్ తెలంగాణ అనుసరిస్తుంది..దేశం ఆచరిస్తుందంటూ డైలాగ్ చెప్పేవారని, తెలంగాణలో మొదలైన లిక్కర్ స్కామ్‌ను కేజ్రీవాల్ ఆచరించిచూపాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాంగ్రేస్ అని, అవినీతి కుంభకోణాలను, కాంగ్రెస్‌ను వేర్వేరుగా చూడలేమన్నారు. తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లిక్కర్‌ కేసులో కేంద్ర దర్యాప్త సంస్థలు పలుమార్లు నోటీసులు ఇచ్చినా కేజ్రీవాల్‌ సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారన్నారు.


ఈ కేసులో స్పష్టమైన సాక్ష్యాలున్నాయని, ఈ కేసులో తమ కుటుంబానికి, ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కు సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. లిక్కర్ పాలసీలో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అవకతవకలు చేసిందని, ఢిల్లీలో తీగ లాగితే తెలంగాణలో దొరికిందన్నారు. కేజ్రీవాల్‌, కవితల అరెస్టును దేశమంతా సమర్థిస్తుందన్నారు. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్‌తో మేం చర్చకు మేం సిద్ధమని, అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తానని, కేజ్రీవాల్‌ తప్పు లేదని కేసీఆర్ నిరూపించగలరా? అని కిషన్‌రెడ్డి సవాల్ చేశారు.


సీబీఐ విచారణకు అభ్యంతరం ఎందుకో


కాళేశ్వరం అవినీతి పై సీబీఐతో విచారణ జరిపించాలని, బీఆరెస్ అవినీతిని నిరూపిస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా సవాల్ చేశారని, అధికారంలోకి వచ్చాకా ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేయించేందుకు నాకు దమ్ముందా అని రేవంత్‌రెడ్డి అడిగారని, సీబీఐతో దర్యాప్తు చేయించే అవకాశం మీకే ఉందని, వాస్తవాలు కోల్డ్ స్టోరేజీలో పెట్టవద్దని, దర్యాప్తు చేసి నిజాలు బయట పెట్టండని డిమాండ్ చేశారు. బీఆరెస్ చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ పేరుతో వారిని బెదిరించి వసూళ్లు చేసుకునే లావాదేవిలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.


కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో విఫలమవుతుందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని మద్యం వ్యాపారులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తల నుంచి ఆర్‌జీ(రాహుల్‌గాంధీ) టాక్స్ వసూలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో కర్ణాటక, తమిళనాడులలో ఆ పని చేశారని, ఇప్పుడు తెలంగాణలో వసూలు చేసిన డబ్బులే ఏఐసీసీకి ఆదారంగా మారాయని, కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి ప్రజలు ఆ పార్టీ పాలనను భరిస్తున్నారన్నారు. తెలంగాణలో 17పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.