చ‌నిపోతాన‌ని వ్య‌క్తి బెదిరింపులు.. బిర్యానీ ఆశ‌గా చూపిన పోలీసులు

ఓ 40 ఏండ్ల వ్య‌క్తి బ్రిడ్జిపై నుంచి దూకి చ‌నిపోతాన‌ని బెదిరింపుల‌కు గురి చేశాడు. పోలీసులు అత‌నికి బిర్యానీ ఆశ‌గా చూపి ప్రాణాల‌తో కాపాడారు.

  • By: Somu    latest    Jan 23, 2024 10:50 AM IST
చ‌నిపోతాన‌ని వ్య‌క్తి బెదిరింపులు.. బిర్యానీ ఆశ‌గా చూపిన పోలీసులు

కోల్‌క‌తా : ఓ 40 ఏండ్ల వ్య‌క్తి బ్రిడ్జిపై నుంచి దూకి చ‌నిపోతాన‌ని బెదిరింపుల‌కు గురి చేశాడు. పోలీసులు అత‌నికి బిర్యానీ ఆశ‌గా చూపి ప్రాణాల‌తో కాపాడారు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కోల్‌క‌తాలోని క‌ర‌యాకు చెందిన ఓ 40 ఏండ్ల వ్య‌క్తి ఇటీవ‌లే త‌న భార్య‌కు విడాకులిచ్చాడు. వీరికి ఇద్ద‌రు కూతుళ్లు కాగా, పెద్ద బిడ్డ తండ్రి వ‌ద్దే ఉంటుంది. టైల్స్ బిజినెస్ చేస్తున్న అత‌నికి వ్యాపారంలో న‌ష్టాలు వ‌చ్చాయి. అటు వ్యాపారంలో న‌ష్టాలు, ఇటు భార్య విడాకులివ్వ‌డంతో తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యాడు.

ఇక సోమ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో త‌న బిడ్డ‌ను బైక్‌పై ఎక్కించుకుని సైన్స్ సిటీకి బ‌య‌ల్దేరాడు. మార్గ‌మ‌ధ్య‌లో ఉన్న ఓ బ్రిడ్జి వ‌ద్ద ఆగిపోయాడు. త‌న మొబైల్ ప‌డిపోయింద‌ని, వెతికి వ‌స్తాన‌ని చెప్పి బైక్ ఆపాడు. అంత‌లోనే బ్రిడ్జిపై ఉన్న రెయిలింగ్‌పైకి ఎక్కాడు. తాను బ్రిడ్జి పైనుంచి దూకుతాన‌ని బెదిరింపుల‌కు గురి చేశాడు.

అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అత‌న్ని ప్రాణాల‌తో ర‌క్షించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ వ్య‌క్తి డిమాండ్లు విన్న పోలీసులు, అధికారులు ఉపాధి క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. అంతేకాకుండా బిర్యానీని కూడా ఆశ‌గా చూపారు. ఆ త‌ర్వాత బాధిత వ్య‌క్తి బ్రిడ్జి రెయిలింగ్ నుంచి కింద‌కు దిగొచ్చాడు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఆ బ్రిడ్జిపై 20 నిమిషాల పాటు వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లిగింది.