Komatireddy | ప్రియాంక సభకు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా!

Komatireddy విధాత, మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు రేకెత్తించింది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరైన సరూర్ నగర్ యువ సంఘర్షణ సభకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వెంకటరెడ్డి లండన్ లో ఉన్నారని ఆయన అనుచరుల కథనం. ఒకవైపు తెలంగాణలో టీ. కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువ […]

  • By: krs    latest    May 08, 2023 3:18 PM IST
Komatireddy | ప్రియాంక సభకు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా!

Komatireddy

విధాత, మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు రేకెత్తించింది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరైన సరూర్ నగర్ యువ సంఘర్షణ సభకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం వెంకటరెడ్డి లండన్ లో ఉన్నారని ఆయన అనుచరుల కథనం. ఒకవైపు తెలంగాణలో టీ. కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువ సంఘర్షణ సభ తలపెట్టిన సంగతి..ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరై కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్నారన్న సంగతి తెలిసి కూడా వెంకటరెడ్డి ఈ సభకు గైర్హాజరవ్వడానికి అంత బలమైన కారణాలు ఏముంటాయి అంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో , రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి.

నిన్న మొన్నటిదాకా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అసమ్మతిగా ఉన్న వెంకటరెడ్డి నల్లగొండ నిరుద్యోగ మార్చ్ సభతో ఆయనతో ఐక్యత రాగం వినిపించారు. ఆంతలోనే మళ్లీ ఏమైందో గాని ప్రియాంక గాంధీ సభకు వెంకట్ రెడ్డి దూరంగా ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులకు ఆయన వ్యవహారం అంతు పట్టడం లేదు.

ఇటీవల తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు సైతం వెంకట్ రెడ్డి గైర్హాజరయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సోదరుడు రాజగోపాల్ రెడ్డి బిజెపిలోకి వెళ్లడం, కాంగ్రెస్ లో తాను ఆశించిన పిసిసి అధ్యక్ష పదవినీ రేవంత్ రెడ్డి ఎగరేసుకుపోవడం వంటి పరిణామాలతో కొంతకాలంగా వెంకటరెడ్డి కాంగ్రెస్ లో కుదురుగా ఉండటం లేదు.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు తరచూ కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహిస్తూ బిజెపిలోకి వెళ్తారన్న ప్రచారానికి సైతం వెంకట్ రెడ్డి ఆస్కారం ఇస్తున్నారు. అయితే తన జిల్లా అభివృద్ధి పనుల కోసమే ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కలిశానంటూ వెంకటరెడ్డి మీడియా ముందు సన్నాయి రాగాలు వినిపించారు. ఏది ఏమైనా ఏకంగా ప్రియాంక గాంధీ సభకు కూడా వెంకటరెడ్డి గైరాజరైన నేపథ్యంలో మునుముందు ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతారో లేదోనన్న సందేహాలను మరోసారి క్యాడర్ లో రేకెత్తించినట్లయ్యింది.