Komatireddy Rajagopal Reddy
విధాత: బిజేపి నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణా రావుల భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. అజిజ్ నగర్ ఫౌం హౌజ్ లో వారు రాజగోపాల్ రెడ్డి తో భేటీయై కాంగ్రెస్ లో చేరికలపై సంప్రదింపులు జరిపారు.
రాజగోపాల్ రెడ్డి కొంత కాలంగా బీజేపి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఎలాంటి స్పష్టత నివ్వలేదు. అయితే తాను బిజేపిని వీడాలన్న ఉద్దేశం లేదని, ఆ పార్టీ నాయకత్వంపై విశ్వాసం ఉందన్నారు.
రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని బయటకు వ్యక్తం చేయకపోయినా ఆయన బిజేపిలో ఇమడలేకపోతున్నారని, బీఆర్ఎస్ పట్ల బిజేపీ కేంద్ర నాయకత్వ వైఖరి మారిందని, దీంతో కేసీఆర్ కు వ్యతిరేకంగా తన పోరాటానికి తిరిగి కాంగ్రెస్ పార్టీనే సరైన వేదిక అని ఆయన భావిస్తున్నారని అనుచరవ వర్గాల కథనం.
అదీగాక బిజేపి కేంద్ర నాయకత్వం తాజాగా తెలంగాణ బిజేపి అధ్యక్ష పదవిలో మార్పు చేసి బండి సంజయ్ ను తొలగించి జి.కిషన్ రెడ్డిని నియమించడం, ఈటలకు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా చేసినా తనకు మాత్రం తగిన బాధ్యత నివ్వకపోవడంతో రాజగోపాల్ రెడ్డి నీ నిరాశ పరిచిందని సమాచారం.
దీంతో రాజగోపాల్ రెడ్డిలో నెలకొన్న రాజకీయ అసంతృప్తి నేపథ్యంలో ఆయనను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చెందుకు కాంగ్రెస్- కేంద్ర రాష్ట్ర నాయకత్వం పొంగులేటి, జూపల్లిలను రంగంలోకి దించడం విశేషం.