తుమ్మలకు మంత్రి పదవిపై రాజగోపాల్‌రెడ్డి విమర్శలు.. అసహనంలో తుమ్మల

తుమ్మల నాగేశ్వర్‌రావుకు మంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి యధాలాపంగా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి

తుమ్మలకు మంత్రి పదవిపై రాజగోపాల్‌రెడ్డి విమర్శలు.. అసహనంలో తుమ్మల

విధాత : తుమ్మల నాగేశ్వర్‌రావుకు మంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి యధాలాపంగా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో విలేఖరులతో మాట్లాడుతున్న సందర్భంలో గతంలో తెలంగాణ ఉద్యమకారుడు కాని తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడానికి కేసీఆర్‌కు సిగ్గు, శరం ఉందా..? అని ప్రశ్నించారు. తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడాన్ని తప్పుపడుతూ రాజగోపాల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఇప్పుడు తుమ్మల మన పార్టీలో ఉన్నాడని గుర్తుచేశాడు. దాంతో నోరు జారినట్టు గ్రహించిన కోమటిరెడ్డి పొరపాటును గ్రహించి అప్పుడు అక్కడనే ఉండె కదా అని కవర్ చేసుకున్నారు.

గత బీఆరెస్ ప్రభుత్వంలో తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చిన విషయంపైనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడినప్పటికి, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టిన విషయాన్నిమరిచి ఆయన విమర్శలు చేయడం వివాదస్పదమైంది. ఇదిలావుంటే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా తన సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. తాను ఇప్పుడు సొంత పార్టీ నేతనే అన్న సోయి కూడా రాజగోపాల్‌ రెడ్డికి లేకపోతే ఎలా..? అని అసంతృప్తి వెళ్లగక్కినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వంలోని ఇతర అగ్ర నేతలు కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్నాడన్న సోయి కూడా రాజగోపాల్‌రెడ్డికి లేనట్టుందని ఆయన వ్యతిరేకులు ఎద్దేవా చేస్తున్నారు. గతంలో తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడం సిగ్గు, శరం లేని పని అయితే.. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభత్వంలో కూడా మంత్రి పదవి ఎందుకిచ్చారని సెటైర్లు వేస్తున్నారు.