మేడిగ‌డ్డ‌పై కాంగ్రెస్ కుట్ర‌ల‌ను ఎండ‌గ‌డ‌తాం

మేడిగడ్డ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండగ‌డతామ‌ని బీఆరెస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ అన్నారు

మేడిగ‌డ్డ‌పై కాంగ్రెస్ కుట్ర‌ల‌ను ఎండ‌గ‌డ‌తాం
  • మార్చి1న చ‌లో మేడిగ‌డ్డ కు పిలుపు ఇచ్చిన బీఆరెస్‌
  • మీడియా స‌మావేశంలో వెల్ల‌డించిన వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్‌


విధాత‌: మేడిగడ్డ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండగ‌డతామ‌ని బీఆరెస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ నుంచి మార్చి 1వ తేదీన‌ మేడిగడ్డకు వెలుతున్నామ‌ని తెలిపారు.


ఈ మేర‌కు మార్చి 1 న చలో మేడిగడ్డ కార్యక్రమం తీసుకున్నామ‌న్నారు. దశల వారికి ఆ తర్వాత కాళేశ్వరంలో ఉన్న ప్రతి రిజర్వాయర్ ను సందర్శిస్తామ‌న్నారు. మాతో కాంగ్రెస్ మంత్రులు వస్తామంటే వారిని కూడా వెంట తీసుకువెళ్తామ‌న్నారు. ప్రజలకు కాళేశ్వరం ద్వారా అందుతున్న ఫలాలను వివరిస్తామ‌న్నారు.


కాంగ్రెస్ పార్టీ కేవలం నేరపూరిత మనస్తత్వంతోనే బరాజ్ ల‌కు రిపేర్లు చేయకుండా రోజుకు వేల క్యూసెక్కుల నీటిని ఇప్పుడు కూడా సముద్రంలోకి వదిలిపెడుతుంద‌ని కేటీఆర్ ఆరోపించారు. ఇందులో కాళేశ్వరం బ్యారేజీలు అన్ని వర్షాకాలంలో కొట్టుకుపోవాలనే పెద్ద కుట్ర ఉందన్నారు.


మేడిగడ్డలో రెండు మూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుని మొత్తం కూల్చే కుట్ర చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు, గుండ్ల వాగు, మూసి ప్రాజెక్ట్, సింగూర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, పులిచింతల వంటి అనేక ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయన్నారు. పాడైన బారాజుల మరమ్మత్తుకు ఇంజనీరింగ్ పరిష్కారాలు ఉన్నాయని తెలిపారు. సులువుగా ఒక కాపర్ డ్యాంని నిర్మాణం చేసి ఆ మూడు పిల్లర్లకు వెంటనే మరమత్తులు నిర్వహించవచ్చున‌న్నారు.


మరమ్మతులు ఒకవైపు నిర్వహిస్తూనే… అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని శాసనసభలోనే తాము చెప్పామన్నారు. మీరు వేసిన ప్రతి విచారణను స్వాగతించామ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అప్పులపై అడ్డగోలుగా మాట్లాడుతుందని… కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే కొత్తగా అప్పులు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడిపించాల‌ని కేటీఆర్ స‌వాల్ విసిరారు.


రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నామ‌ని కేటీఆర్ అన్నారు. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్న రైతు ప్రయోజనాలే అందరికీ ముఖ్యంగా ఉండాలన్నారు. కాపర్ డ్యాం నిర్మాణం చేసి వెంటనే మేడిగడ్డకు మరమత్తులు నిర్వహించాల‌ని కోరారు. రానున్న వేసవిలో మంచినీళ్లు ఇవ్వలేమని, ఇక‌ సాగునీరు ఎట్లిస్తాం అని ప్రభుత్వ అధికారులే చెప్తున్నారన్నారు. అవసరమైతే మాపైన దుష్ప్రచారం చేయండి… ఇంకేమైనా చేయండి కానీ రైతుల జీవితాలను మాత్రం దెబ్బతీయకండన్నారు. వారి పంట పొలాలను ఎండబెట్టకండన్నారు.


మూడు పిల్లర్ల నష్టాన్ని చూపించి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ మానివేసి, ప్రాజెక్టు మరమత్తుల పైన దృష్టి సారించాలన్నారు. మరమ్మతులు నిర్వహించకపోతే మూడు బారాజులు కొట్టుకుపోవాలని కుట్రను కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదన్నారు. రానున్న వర్షాకాలంలో మూడు బరాజులను, వచ్చే వరదతో కొట్టుకపోయే విధంగా కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు.


నేరుగా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులే.. అన్నారం, సుందిళ్ల‌ కూడా కొట్టుకుపోతుందని చెప్పారన్నారు. ఈ ప్రాజెక్టు కొట్టుకుపోవాలని కుట్రపూరిత ఆలోచనలో భాగమేన‌న్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మేడిగడ్డకు సందర్శన లాంటి అన్ని డ్రామాలు అయిపోయియి కాబట్టి ఇప్పటికైనా సమస్య పరిష్కారం పైన దృష్టి పెట్టండన్నారు.